మావోయిస్టు నక్సలైట్లకు తుపాకీ బుల్లెట్లను సరఫరా చేసిన ఘటనలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించారు. నక్సలైట్లకు తుపాకీ గుళ్లను సరఫరా చేస్తున్నారనే అభియోగంపై ఏఎస్ఐ అనంద్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్ సుభాష్ సింగ్ లను ఈనెల 8వ తేదీన సుక్మా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై వేగవంతమైన దర్యాప్తు నిర్వహించిన పోలీసు అధికారులు ఆ ఇద్దరు జవాన్లపై కఠిన చర్య తీసుకున్నారు. ఇందులో భాగంగానే అరెస్టయిన ఇద్దరు పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించినట్లు బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ ప్రకటించారు. ఈ చర్య బస్తర్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆత్మస్థయిర్యంపై ఎటువంటి ప్రభావం చూపదని ఐజీ సుందర్ రాజ్ ఈ సందర్భంగా ప్రకటించారు.