తెలంగాణలో ఉత్తరదిశ నుంచి వచ్చిన సుడిగాలి రాజకీయ సుడిగుండాన్ని సృష్టిస్తున్నది. ఇందులో అందరూ చిక్కుకొని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఈ పరిస్థితికి లౌకిక శక్తుల ఘోర వైఫల్యం, గులాబీ స్వయంకృత అవకాశవాద విధానాలు, కమలం దండు దుర్భేధ్యమైన వ్యూహం కలగలిసి ఈ సునామీకి ముఖ్యకారణం.
తెలంగాణలో నిన్నమొన్నటి వరకు ఎదురులేదని, ఏ ఎన్నికైనా ఏకపక్షమంటూ, అప్రతిహత విజయాలను ఒంటి చేత్తో సాధించిన ఉద్యమపార్టీ టీఆర్ఎస్కు ఇంతలోనే ఏమైనట్లు? సకల హంగులూ అన్నిరంగులూ సమకూర్చుకున్న పార్టీకి ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు అనుహ్యమా? ఆకస్మికమా? అస్సలు కానేకాదు. స్వయంకృతం? అహంభావమే కారణమా? ఇవే కాదూ నిశితంగా పరిశీలించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. అప్పుడే ఓ దారి దొరుకుతుంది.
రాష్ట్రంలోని పాలకపార్టీ ఏకపక్ష నియతృత్వ విధానాలు ప్రధానంగా ఇక్కడ బీజేపీకి కావలసిన ఊతమిచ్చాయి. దళిత,బహుజన,లౌకిక, ప్రజాస్వామిక శక్తుల వైఫల్యం ఇందులో పూర్తిగా ఉంది. ఒంటెద్దు పోకడలు, విశాల ఐక్యకార్యాచరణ లోపాలున్నాయి. వామపక్ష పార్టీలకు ప్రజల్లో ఉన్న పునాదులు కూలిపోయి శిథిలాల మధ్య భజనచేసే నాయకత్వం కారణాలనే విమర్శలున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలోనైనా వీరు గుణపాఠం తీసుకుంటారా!?వేచి చూడాల్సిందే.
మరీ ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థకు జరిగిన ఎన్నికల ఫలితాలేమిటీ, ఈ ఎన్నికలతోనే ఒక్కసారే రాష్ట్ర రాజకీయాల్లో ఇంత వైపరీత్యం జరిగిపొయిందా? కానేకాదు.
మొన్నటి వరకు గొంగళి పురుగని భావించి దూరం పెట్టిన వారే ఆ దశ దాటి సీతాకోక చిలుకగా మారగానే ముద్దు పెట్టుకుంటున్నారా! రంగులకు లొంగిపోవడమో, ఆకర్షితులు కావడమో సహజ పరిణామమా! మన మకరందాన్ని పీలుస్తుందని గులాబీలు గుర్తించలేకపోయారా!
హైదరాబాద్ పైకి ఉత్తర గాలి:
ఉత్తర భారత నేతలతో దక్షిణభారతంలోని ప్రధానమైన హైదరాబాద్ పైన ఢిల్లీ దండు సామూహిక ఏకపక్ష ఊపిరి సలపని దాడి ఏం సూచిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రచారానికి ఏ పార్టీ ఏ నాయకులైనా రావచ్చని అంటున్నప్పటికీ గల్లీ ఎన్నికలను ఢిల్లీ స్థాయిగా మార్చి మొత్తం ఎజెండానే జెండా కెక్కించారు. కేసీఆర్ ఎత్తుగడలను చిత్తుచేసి పైఎత్తు వేశారు. గులాబీ బాస్‌కు గట్టి హెచ్చరికనే జారీచేశారు. నీ దారేదో తేల్చుకోమన్నారు. ఇక్కడ ఓ విషయం గమనార్హం. తక్కువ మోతాదులోనే ఉన్నా ఈ మొత్తం ఎపిసోడ్లో ప్లాన్‌గానే కాంగ్రెస్‌తో సహా లౌకిక పార్టీల, శక్తుల గొంతు నొక్కేయడం ప్రత్యేకంగా గుర్తించాల్సిన సీరియస్ అంశం.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన మెజార్టీ సీట్లు సగానికి తగ్గిపోయీయి. రెండొంతుల నుంచి ఈ దఫా మూడింట ఒక వంతు సీట్లకు పడిపోయింది. అనూహ్యంగా బీజేపీ నాలుగు స్థానాల నుంచి టీఆర్ఎస్కు ధీటగా సీట్లు పొంది బలం పుంజుకున్నది. ఎంఐఎం తన బలాన్ని బలగాలను కాపాడుకున్నది. కాంగ్రెస్ బలంలో పెద్ద మార్పేమీలేదు. అంకెల గారడీ ప్రకారం ఇక్కడ నష్టపోయింది మాత్రం గులాబీ దళమే అనడంలో సందేహం లేదు. ఇవి కేవలం తాజా ఎన్నికల ఫలితాలు మాత్రమే.
దీనికి ముందు ఆరేళ్ళుగా దేశంలో జరిగిన పరిణామాలు, రాష్ట్రంలో చోటు చేసుకున్న మార్పుల పూర్వపరాలను లోతుగా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు జూస్తాయి. కాకుంటే ఈ విషయాలు మింగుడుపడడం కొంత మందికి కష్టమే. లేకుంటే భవిష్యత్తు ఇదే దారిలో సాగితే అన్ని అవకాశాలు చేజారిపోవడం షరా మాములుగా జరుగుతుంది. తాజా గెలుపోటముల సంగతిని కాస్త పక్కకుపెడితే బీజేపీ ఖచ్చితంగా పక్కలో బల్లెంలా మారుతుందనడంలో సందేహం లేదు.
ఇప్పుడు గుండెలు బాదుకుంటే ఏం లాభం:
రాష్ట్రంలో తాజ పరిణామాలు కేవలం టీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకత కారణంగా ఉరుములేని పిడుగులు పడ్డట్లు జరిగిందని కొందరు అమాయకంగా విశ్లేషిస్తున్నారు. కొందరు ప్రజాస్వామిక వాదులకు ఈ పరిణామాలూ అస్సలు రుచించడం లేదు. నిజాయితీపరులైన వారిని సైతం పరిణామాలు నిద్రపోనివ్వడం లేదనేది గమనార్హం. బయటికి చెప్పడంలేదుగానీ అధికార పీఠానికి అనుంగు అపర మేథావులు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. కొందరు ఏకంగా గుండెలు బాదుకుంటున్నారు. వీరు స్వీయమానసిక ధోరణికి అలవాటు పడ్డారు. పీఠాల కోసమో, మూటల కోసమో ఈగ వాలనీయని చందంగా తయారయ్యారు. వాస్తవాలను చర్చించేందుకు సిధ్ధంగాలేని విధానాలు వీరికి బాగా అలవాటయ్యాయి. వాస్తవాలను కొట్టిపారేసే ఈ సమూహం తాము కళ్ళు తెరిచేదిలేదూ, తమ అధినేతకో, తమ నాయకత్వానికో కనీస సలహా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే జబ్బలు చరుచుకోవడం తప్ప ఓ మాటచెప్పే అవకాశం వీరికి లేదు. ‘గడీ’ దరిదాపుల్లోకే వీరిని రానివ్వరు.
అభివృద్ధి, పేదల సంక్షేమం, ప్రజల సమస్యలు ఎజెండాగా ఉండాల్సిన తరుణంలో మతప్రాతిపదిక చర్చ జరగడం దారుణం. ఏమైనా ఈ పరిణామాలు ఎవరికైనా ఆరోగ్యకరమైనవి ఎంతమాత్రం కావనేది వాస్తవం. ఇక్కడి పాలకులపైన ఉన్న ఆగ్రహంతో కొందరికి తాత్కాలిక సంతోషం లభించినా భవిష్యత్తులో ఇబ్బందికరమే. ఎందుకంటే కేంద్రంలో వీరి పాలనలోనూ ఒరిగిందేమీలేదని నగ్నంగానే కన్పిస్తలేదా?
ఇక ఈ కొద్దికాలంలోనే రాష్ట్రంలో ఇంత మార్పులు ఏలా జరిగాయి. లోతుగా పరిశీలిస్తే ఇవేమీ ఆకస్మికంగా జరిగినవి కావనేది అర్థమైతుంది. ఓ క్రమానుగుణంగానే ఈ మార్పులు సంభవించాయనడంలో ఎలాంటి సంశయం అవసరంలేదు. ఈ వాస్తవాలను నిజాయితీతో అర్ధం చేసుకోకుండా గందరగోళానికి గురైతే పరిష్కారం మాత్రం లభించదు.
రాష్ట్రంలో జరిగిన రాజకీయం:
తెలంగాణ పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్టం. ఉద్యమ పార్టీగా చెప్పుకునే పార్టీయే తక్కువ మెజార్టీతోనైనా మొదటిసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ అధికారమే అనేక మార్పులకు కారణమైంది. బహిరంగ అనైతిక చర్యలకు దారి చూపించింది. ఏకంగా ఒక్కసారి కాదు రెండవసారి పీఠాన్ని చేజిక్కించుకున్నది. తొలిసారి గెలవగానే ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీల నుంచి అధికారానికి ముప్పుందనే అభద్రత కారణంతో ప్రతిపక్ష టీడీపీ మనుగడ లేకుండా చేసింది. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీతో అంటకాగుతూ వచ్చింది. మోడీ మీద ఈగ వాలనీయనంత ఊడిగం చేశారు. కేంద్ర సహకారంతో ముందస్తు ఎన్నికలు జరిపి రెండవసారి అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి ప్రతిపక్షం లేకుండా చేశారు. ఉన్నా నామమాత్రంగా మార్చేశారు. మరో వైపు కారణాలేమైనా ప్రజాస్వామిక వాతావరణాన్ని, కార్యకలాపాలను పూర్తిగా ఉక్కుపాదంతో అణచివేసే చర్యలు చేపట్టారు. వివిధ వర్గాలు ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేసే కనీస స్థితి లేకుండా ప్రభుత్వం చేసింది. అధికారంలోకి వచ్చిన ఈ కొద్దికాలంలోనే టీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరించింది. అటు ఎంఐఎం ఇటు బీజేపీతో సయ్యలాటలాడుతూ
మతతత్వ శక్తులకు ఊతమిచ్చి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను నాశనం చేశారనే అపవాదు ఉంది.
తాజా పరిణామాలకు తనకు తాను చేసుకున్న స్వయంకృతంగానూ చెప్పవచ్చు. టీఆర్ఎస్ అవకాశవాద వైఖరి కూడా దీనికి ప్రధాన కారణం. తొలి నుంచి ఈ పార్టీ ఇదే విధానాన్ని రాజమార్గంలోనే అనుసరిస్తున్నది. తొలినాళ్లలో తెలంగాణ సాధన కోసమంటూ చెప్పిన నాయకత్వం తర్వాత అధికారాన్ని కాపాడుకోవడానికి అంటూ బీజేపీతో దోబూచులాడే పద్ధతి అనుసరిస్తూ వచ్చిన విషయం బహిరంగమే. తర్వాత రాజకీయ అవసరాల కోసం టీఆర్ఎస్ తన దిశ మార్చుకోవడం సహజంగానే బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ పార్టీ ఎత్తుగడలకు పదునుబెట్టింది.
వాస్తవానికి తెలంగాణలో ఆ మాటకొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ బీజేపీ తన మనుగడ కొనసాగిస్తున్నప్పటికీ, తన హిందుత్వ ఎజెండాను అమలు చేసేందుకు తొలి నుంచి ఇక్కడ అడ్డంకులే ఏర్పడ్డాయి. ఒక్క హైదరాబాద్‌లో కొంత అవకాశం లభించినప్పటికీ ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు పార్టీల కార్యకలాపాలు, ఓటుకోసమైనా కాంగ్రెస్ అనుసరించే లౌకికవాద విధానం, విప్లవ, ప్రజాస్వామిక, మైనార్టీ శక్తుల నిత్య కార్యకలాపాల ఫలితంగా హిందుత్వదాడిని ఏదో మేరకు నిలువరిస్తూ వచ్చారనడంలో సందేహంలేదు. ఇప్పుడు ఈ అడ్డంకులు లేకుండా పోయాయి.
రాజకీయ శూన్యత దోహదం:
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి అనేక కారణాలున్నాయి, వామపక్ష, లౌకిక, విప్లవ కార్యకలాపాలు తగ్గిపోయాయి. టీడీపీ ఇక్కడ కనుమరుగు కాగా, కాంగ్రెస్ పూర్తిగా క్షీణదశకు చేరింది. ఈ సమయంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో టీఆర్ఎస్ చెట్టపట్టాల్ వేసుకున్నది. కేంద్రంలో రెండవ సారి అధికారంలోకి రావడంతో హిందుత్వ ఎజెండా అమలులో మోడీ, షాలు దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో లౌకికవాదం స్థానంలో కేసీఆర్ కూడా తానో హిందువుననే విషయాన్ని ఏదో రూపంలో ప్రదర్శించుకునేందుకు తొలి నుంచి ప్రయత్నించడం మారిన రాజకీయ పరిస్థితికి అద్ధం పడుతోంది.
విపక్షాలు, ప్రజాసంఘాల కార్యకాలాపాలు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను బీజేపీ పూర్తిచేసే ప్రయత్నం పెంచింది. రెండు పక్షాలు టీఆర్ఎస్, బీజేపీ మధ్య దూరం పెరుగగానే దూకుడు పెంచింది. ఇరువురి మధ్య అసెంబ్లీ ఎన్నికల వరకు సాగిన స్నేహగీతం లోక్‌సభ ఎన్నికలు వచ్చే వరకు పూర్తిగా మారిపోయింది. ఇదే సమయంలో బీజేపీ తన పట్టు పెంచుకుంటూ వస్తోంది. కేంద్రంలో ఉన్న అధికారం కూడా బీజేపీకి శ్రీరామ రక్షగా మారింది. మిగిలిన పక్షాలను బెదిరించినట్లు బీజేపీని బెదిరించే పరిస్థితి లేకుండా పోయింది. దుబ్బాక ఎన్నికే దీనికి నిదర్శనం. దీనికి తోడు దశాబ్దాలుగా పునాదులు వేసుకున్న సంఘ్‌పరివార్ శక్తులు నిద్రలేచాయి. ఇప్పటి దాకా వివిధ జెండాల నీడలో సేదదీరిన హిందుత్వ లీడర్లు కమలం గూటికి చేరారు. టీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతను బీజేపీ సానుకూలంగా మార్చుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉద్యమ పార్టీ అయినప్పటికీ సమిష్టి నాయకత్వం స్థానంలో కుటుంబసభ్యులు రావడం కూడా విమర్శలకు తావిస్తోంది. హైదరాబాద్‌లో ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తానా బీజేపీ మరో మతంపై దాడిగా ఓవైసీలను ఎన్నుకోవడం గమనార్హం. కర్ణుని చావుకు ఆరు కారణాలన్నట్లు హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి తాజా మార్పులకు అన్ని కారణాలున్నాయి.
గులాబీల్లో మార్పు వచ్చేనా౹?
మెజార్టీ మత ప్రజలకు ప్రతినిధిగా తనకుతాను కితాబిచ్చుకుంటున్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం పురుడు పోసుకోవాలంటే లౌకిక శక్తులు ఐక్యం కావడమొక్కటి తప్ప మరో గత్యంతరం లేదు. కనీసం దాని దూకుడును నిలువరించాలన్నా ఇది అనివార్యం. కొంత ఆలస్యంగానైనా ఇది జరిగే పరిణామమే అయినప్పటికీ అలా కాకుండా అధికార టీఆర్ఎస్ తన దిశ మార్చుకుని సహకరిస్తే పరిస్థితిలో త్వరగా మార్పుచెంది ఆ పక్షాలకు కాసింత మనుగడు లభిస్తుంది. ఉడికిపోతున్న ప్రజాస్వామిక శక్తులకు ఓ దారి దొరుకుతుంది. ప్రగతిశీల శక్తులకూ మార్గం లభిస్తుంది. ఈ శక్తుల ఐక్యత ఒక్కటే సరైన ప్రత్యామ్నాయం.
ప్రాంతీయ అస్థిత్వవాదంపైన ఆధారపడిన పార్టీ. లౌకిక పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ దీర్ఘకాలిక రాజకీయ ఆరోగ్యానికి మంచింది. లేకుంటే ‘కరి మింగిన వెలగపండు గదరా సుమతీ’ అన్నట్లు వేగంగా పరిణామాలు జరగడం ఖాయం. మతం ముందు మిగిలిన సంక్షేమ, ఓటు బ్యాంకు పథకాలన్నీ దిగదుడుపే. రాష్ట్రంలో ఇప్పటికే వివిధ వర్గాల ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగడం ఖాయం.
సవాల్ చేస్తారా? సాగిలపడుతారా!?
ముఖ్యంగా ఇప్పటికైనా వాస్తవాలను ఒపిగ్గా విశ్లేషించుకుంటే పాలక గులాబీ పక్షానికి సరైన కనువిప్పుకలుగుతుంది. ఈ దిశగా ఆ పార్టీ నాయకత్వంలో మార్పు కలుగుతుందా అనేది అత్యాశే అయినప్పటికీ వేచి చూడాలి. అధికారం కోసమైనా ఎదో మార్పు అవసరం. బీజేపీతో ఢీ కొట్టడమో? లౌకిక శక్తులతో కలిసి సాగడమో? లేదంటే బీహార్ మాదిరి బీజేపీకి సాగిలపడి అధికారం కాపాడుకోవడమే మార్గాలు.
లేదంటే రానున్న ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునే బీజేపీ దీర్ఘకాలిక వ్యూహానికి లొంగిపోయి స్నేహ హస్తమందించడమే. ఈ దూరదృష్టి బీజేపీకి పుష్కలంగా ఉంది. ఈ కారణంగా అంగీకరించే అవకాశాలు కొట్టిపారేయలేం. ఇదే జరిగితే రాష్ట్ర కమలాల చెవిలో గులాబీలే. ఏమైనా బీజేపీని గులాబీలు సవాల్ చేస్తారా..? గులాములవుతాయా? ఏ దారిని ఎంచుకోవడమనేది టీఆర్ఎస్ చేతుల్లోనే ఉంది.
ఇప్పటి వరకు ఏకపక్షంగా, నియంతృత్వ పోకడలతో దూకుడుగా వ్యవహరించే పాలక టీఆర్ఎస్ పార్టీ తాజా పరిణామంతో రానున్న రోజుల్లో విశాలంగా, ప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందా? అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ప్రజలకు మాత్రం ప్రత్యామ్నాయ శక్తుల ఐక్యత ఒక్కటే తగిన రక్ష. ఆలశ్యమైనా ఇదే మార్గం.
✍️ రవి ® సంగోజు