కరోనా ‘వైరస్’తో సహజీవనం అంటే ఏమిటి? మందూ, మాకూ మార్కెట్లో లేని ఈ జబ్బుతో కలిసి బతకక తప్పదని మన నాయకులు ఇప్పటికే తేల్చేసిన సంగతి. అయితే ఇందుకు భౌతిక దూరాన్ని పాటించాలని, మూతులకు మాస్కులు ధరించాలని, కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్నదే సహజీవనంలోని అర్థం, పరమార్థం. కరోనాకు సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ఒళ్లు దగ్గర పెట్టుకుని జీవించాలన్నదే ప్రజలకు పాలకులు చేసిన ఉద్బోధలోని అసలు సారాంశం.
ఈ దశలోనే దేశంలోనే కాదు తెలంగాణా రాష్ట్రంలోనూ కరోనా తీవ్ర స్థాయిలో భయపెడుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ పేషెంట్లు పెరుగుతున్నారు. ఇదిగో ఈ పరిస్థితుల్లోనే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు పార్టీని బలోపేతం చేసే దిశగా గట్టి చర్యలు చేపట్టారు. కరోనా, గిరోనా జాన్తా నై, పార్టీని శక్తివంతం చేయడమే తమ ప్రధమ కర్తవ్యమని చెప్పకనే చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మధిరలో కాంగ్రెస్ పార్టిని మట్టి కరిపించి, గులాబీ జెండాను రెపరెపలాడించడమే ధ్యేయంగా అలుపెరుగని కృషి చేస్తున్నట్లున్నారు.
ఇందులో భాగంగానే మధిర మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డీసీసీబీ చైర్మెన్ కూరాకుల నాగభూషణం తదితరుల ఆధ్వర్యంలో చింతకాని మండలం పందిళ్లపల్లిలో శుక్రవారం పార్టీలో భారీ చేరికల కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఎం, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సుమారు 70 కుటుంబాలకు చెందిన కార్యకర్తలకు, నాయకులకు గులాబీ కండువాలు కప్పి అధికార పార్టీలో చేర్చుకున్నారు.
ఈ సందర్బంగా కొత్తగా పార్టీలో చేరినవారికి, ఇప్పటికే పార్టీలో ఉన్నవారికి ఆయా నాయకులు హితబోధ కూడా చేశారు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలని, కలహించుకోరాదని నొక్కి మరీ చెప్పారు. ఈ సందర్భంగా గ్రూపు ఫొటోలు కూడా దిగారు. కానీ అసలు విషయమేమిటంటే తాజాగా వెలుగు చూసిన కరోనా పాజిటివ్ కేసులు గల బోనకల్ కేంద్రానికి వెళ్లే మార్గంలోనే, ఖమ్మం నగర శివార్లలోనే పందిళ్లపల్లి గ్రామం ఉండడం. ఖమ్మం నగరంలోనేగాక పరిసర ప్రాంతాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలోనే కనీస భౌతిక దూరం పాటించని ఈ తరహా కార్యక్రమాలపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి. కరోనాతో సహజీవనం అంటే కనీస భౌతిక దూరాన్ని పాటించకుండా పార్టీ కండువాలు కప్పడమే కాబోలునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అదీ సంగతి.