నిన్న ఖమ్మంలో జరిగిన టీపీసీసీ సమావేశంలో ఓ ఆసక్తికర దృశ్యం. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ తదితర ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలకు పదును పెట్టేందుకు ఖమ్మం వేదికగా టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. త్వరలో జరిగే ఆయా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనేది వేరే విషయం. కానీ అటు కేంద్రంలోగాని, ఇటు రాష్ట్రంలోగాని అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీకి మాంచి ‘టానిక్’ లాంటి ఘటన ఇది. మేళం శ్రీనివాస యాదవ్ అనే కాంగ్రెస్ వీరాభిమాని ఆ పార్టీకి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ‘మేళం’ కాంగ్రెస్ వీరాభిమాని మాత్రమే కాదు ఆ పార్టీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు కూడా. మాజీ ఎంపీ రేణుకాచౌదరి అనుచరునిగా ప్రాచుర్యం పొందిన మేళం శ్రీనివాస యాదవ్ రూ. కోటి విరాళం ప్రకటించడం, కాంగ్రెస్ అగ్రనాయకత్వం అయనను అభినందించడం కూడా పీసీసీ సమావేశం వేదికగా చకచకా జరిగిపోయాయి. బలమైన ఓటు బ్యాంకు గల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల నిర్వహణకు తనవంతుగా రూ. కోటి విరాళంగా ఇవ్వడం సంతోషంగా ఉందని కూడా మేళం శ్రీనివాసయాదవ్ ప్రకటించారు. అంతా హ్యాపీ. కానీ ప్రభుత్వ నిఘా వర్గాలు ప్రస్తుతం ఇతని గురించి ఆరా తీయడం ప్రారంభించాయి. మేళం శ్రీనివాసరావు రూ. కోటి విరాళాన్ని ఎలా అందిస్తారో బోధపడక తలలు నిమురుకుంటున్నాయట. అదీ అసక్తికర విశేషం. ఇంతకీ ఎవరీ మేళం శ్రీనివాసయాదవ్? ఏమా కథ?

ఎక్కువ ఉపోద్ఘాతంలోకి వెళ్లకుండా, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం… మేళం గురించి క్తుప్తంగానే చెప్పుకుందాం. రూ. కోటి విరాళాన్ని అలవోకగా ప్రకటించిన మేళం శ్రీనివాసయాదవ్ మధిరకు చెందిన స్థానిక నేత. కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి. దివంగత సీఎంలు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీ రామారావుల విగ్రహాలకు మధిరలో ఆయన ప్రతిరోజూ పూలదండలు వేసి ఆరాధిస్తుంటారు. సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క అనుచరునిగా గతంలో వ్యవహరించిన మేళం ప్రస్తుతం రేణుకాచౌదరి అనుయాయునిగా ఉన్నారు. వాస్తవానికి శ్రీనివాస యాదవ్ ఆడంబరాల జోలికి వెళ్లరు. సాధారణ జీవితమే గడుపుతుంటారు. మధిరలోని స్థానిక వ్యాపార సంస్థల అకౌంట్లు చూస్తుంటారు, చార్టెడ్ అకౌంటెంట్ తరహాలో అన్నమాట. కాకుంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థల లావాదేవీలను అకౌంట్ చేసేంత కాదట. మధిరలోని పెస్టిసైడ్స్, తదితర షాపుల అకౌంట్లను చూస్తుంటారుట. రూ. 30 లక్షల విలువైన మధిరలోని ఫ్లాట్ లో నివసిస్తుంటారు. దాదాపు రూ. 10 లక్షల విలువైన సాధారణ కారులోనే ఆయన ప్రయాణిస్తుంటారు.

ఇంత సింపుల్ జీవితం గడిపే మేళం శ్రీనివాస యాదవ్ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అన్న ఫౌండేషన్ పేరుతో వాటిని చేపడుతుంటారు. యువతకు క్రికెట్ కిట్లు ఇస్తుంటారు. పేదలకు అన్నదానం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. గ్రామాలవారీగా పెన్షన్లు ఇస్తానని ప్రకటించారు. శిథిలావస్థలో గల ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యాలయ మరమ్మత్తుల కోసం రూ. 8-10 లక్షల వరకు ఖర్చు చేస్తానని చెప్పారు. మార్చురీకి ఫ్రీజర్ ఇస్తానని కూడా శ్రీనివాసయాదవ్ గతంలో ప్రకటించారు. అయితే ఇందులో అనేకం ఇంకా అమలు కాలేదని, చిన్నా, చితకా సామాజిక సేవా కార్యక్రమాలను మాత్రం నిర్వహిస్తున్నారని స్థానిక విలేకరుల చెబుతున్నారు. వాస్తవానికి రూ. కోటి విరాళం ప్రకటించే ఆర్థిక స్తోమత మేళం శ్రీనివాసయాదవ్ కు లేదనేది మధిర ప్రాంతానికి చెందిన పాత్రికేయవర్గాల అభిప్రాయం కూడా. నిన్నటి పీసీసీ సమావేశపు వేదికపై ‘మేళం’ ప్రకటించిన కోటి రూపాయల విరాళంపై సహజంగానే ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. విరాళమైతే ప్రకటించిన శ్రీనివాసయాదవ్ పీసీసీ సమావేశపు వేదికపై నాయకులకు చెక్కుగాని, డీడీగాని ఇవ్వకపోవడం గమనార్హం.

రూ. కోటి విరాళం గురించి మేళం శ్రీనివాసయాదవ్ ను ts29 ప్రశ్నించగా, తన వనరులు తనకు ఉన్నాయని, తనకు స్నేహితులు ఉన్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన స్నేహితులకు గల అనేక వ్యాపారాల్లో తనకు భాగస్వామ్యం ఉందని, కొద్ది రోజుల్లోనే ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందిస్తానని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలేక పార్టీ కార్యకలాపాల నిర్వహణలో ఆర్థిక కష్టాలను చవి చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం పరిస్థితుల్లో రూ.కోటి విరాళం అందించే మేళం శ్రీనివాసరావు వంటి వీరాభిమాని ఉండడం ఆ పార్టీ అదృష్టం కదూ!

Comments are closed.

Exit mobile version