బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల కబ్జా బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చట్టపరంగా తీసుకుంటున్న కఠిన చర్యలకు భీతిల్లుతున్న కబ్జాదారులు అనేక మంది ప్రభుత్వ భూములను స్వచ్ఛందగా తిరిగి సర్కారుకు అప్పగిస్తున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చెందిన సుంచుల కుమారస్వామి అనే వ్యక్తి తాను కబ్జా చేసిన మూడెకరాల ప్రభుత్వ భూమి పత్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లకు అప్పగించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 250 ఎకరాల ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. తాజా ఘటనలో కబ్జా భూమిని సర్కారుకు సరెండర్ చేసిన కుమారస్వామి అనే వ్యక్తి 2018 నుంచి 2023 వరకు పీఎం కిసాన్ సమ్మాన్, రైతు బంధు పథకాల ద్వారా లబ్ధి పొందినట్లు కూడా కలెక్టర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ సర్పంచ్, అప్పటి తహశీల్దార్, ఆర్ఐలు కలిసి రూ. 2.50 లక్షలు ఇస్తే కబ్జాలోని భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేస్తామని చెప్పారని కుమారస్వామి పేర్కొన్నారు.
కాగా సిరిసిల్లలో 2 వేల ఎకరాల ప్రభుత్వ భూములు మాయమైనట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేదల పేరుతో బీఆర్ఎస్ నాయకులు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ప్రకటించారు. ఉద్ధేశపూర్వకంగానే వందలాది మంది పేర్లపై అసైన్డ్ భూమిగా నమోదు చేశారని, ఈ అంశంలో సీసీఎల్ఏ నుంచి ప్రత్యేక టీంలను విచారణకు పంపిస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. సిరిసిల్లలో కొందరు భూములను ప్రభుత్వానికి అప్పగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని రెవెన్యూ మంత్రి వ్యాఖ్యానించారు.
సిరిసిల్ల జిల్లాలో భూముల విలువ గణనీయంగా ఉండడం గమనార్హం. ఎకరం భూమి ఎక్కడా రూ. 50 లక్షలకు తక్కువ ధర పలకడం లేదని స్థానిక మీడియా మిత్రులు చెబుతున్నారు. ఈ ప్రాతిపదికన మంత్రి పొంగులేటి వెల్లడించిన అన్యాక్రాంతమైన 2 వేల ఎకరాల ప్రభుత్వ భూముల భూముల విలువ రూ. 1,000 కోట్లుగా ఓ అంచనా. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటించిన ప్రకారం.. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న 250 ఎకరాల ప్రభుత్వ భూముల విలువ రూ. 125 కోట్లుగా భావించవచ్చు.
మొత్తంగా సిరిసిల్లలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వ్యక్తులు తిరిగి అప్పగిస్తున్న ఘటనలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇదే దశలో భూములు అప్పగించకుండా, కేసుల ద్వారా అరెస్టయి జైలుకు వెడుతున్న వ్యక్తుల ఉదంతాలు కూడా కలకలం రేపుతున్నాయి. అయితే ప్రభుత్వం భూములను చెర పట్టిన వ్యక్తులపైనేగాక, వీటి అన్యాక్రాంతానికి కారణమైన రెవెన్యూ అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఇక్కడ పనిచేసిన ఒకరిద్దరు అదనపు కలెక్టర్ స్థాయి అధికారుల పాత్ర కూడా ఇందులో ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.