బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణా ప్రభుత్వం రూ. 10 కోట్లు కేటాయించింది. దేశానికి విభిన్న రంగాల్లో ఆయన అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
పీవీ జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్ లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పివి జయంతి వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కె.కేశవరావు, మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పివి నరసింహారావు కుమారుడు పివి ప్రభాకర్ రావు, కుమార్తె వాణీదేవి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంలో సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఉత్సవాల నిర్వహణ సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలను నిర్దేశించారు.