‘ఈ హిందూ గాళ్లు… బొందుగాళ్లు, దిక్కుమాలిన దరిద్రపుగాళ్ల చేతిలో దేశం విలవిల్లాడుతోంది. ఈ దేశం బాగుపడాలంటే, ప్రపంచ దేశాల ఎదుట తలెత్తుకు తిరగాలంటే ఈ ఇద్దరు దరిద్రులూ- కాంగ్రెస్, బీజేపీ పోవాలె.. దేశమంతటా అన్ని రంగాల్లో సంస్కరణలు రావాలె….అగ్గి లేవాలె, గత్తర రావాలె. వీళ్లేనా దేశభక్తులు..? ఏం మనం కామా..? వాళ్లకు ఎదురుగా ఏదైనా మాట అంటే దేశద్రోహులమా..? మేం మీ కన్నా నికార్సయిన హిందువులం. మేం పూజలు, పునస్కారాలు చేస్కుంటలేమా? గుళ్లకు పోతలేమా? గుళ్లు కొట్టించుకుంటలేమా? నేను చేసిన యాగాలు వేరెవ్వరూ చెయ్యలే… మీది ఓట్ల కోసం, ఎన్నికల కోసం చేసే హిందూత్వం, మాది ఆధ్యాత్మిక హిందూత్వం..’.. అంటూ గత మార్చి 17న కరీంనగర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయి కదా?
ఇదిగో ఈ ‘హిందూ గాళ్ల‘ పని పట్టేందుకే కేసీఆర్ ప్రభుత్వం సిద్ధపడిందా? ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు కొందరు. తన కూతురు కవితను, కుడి భుజం బోయినపల్లి వినోద్ కుమార్ ను ఓడించిన నిజామాబాద్, కరీంనగర్ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ లను ఇప్పటికే టార్గెట్ చేసినట్లు విమర్శలు చవి చూస్తున్న కేసీఆర్, అదే జాబితాలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను కూడా చేర్చారా? తాజా పరిణామాల నేపథ్యంలో ఓ జర్నలిస్టు మిత్రుడు వ్యక్తం చేసిన అభిప్రాయం ఇదే మరి. ‘అన్నా నిన్న మీరు ఇద్దరు ఎంపీల గురించే ఓ న్యూస్ స్టోరీ రాశారు. కానీ ఆ ఇద్దరు ఎంపీలే కాదు. ఇదిగో ఈ రాజాసింగ్ ఎమ్మెల్యే కూడా అదే జాబితాలో ఉన్నారు.‘ అని ఆ మిత్రుడు వ్యాఖ్యానించడం గమనార్హం.
తెలంగాణా అసెంబ్లీలో బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి వంటి యోధానుయోధులు ఓడిపోగా, రాజాసింగ్ మాత్రమే బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెల్చి అసెంబ్లీలో అడుగిడారు. కాషాయ పార్టీకి తెలంగాణా అసెంబ్లీలో మిగిలిన ఈ ఒకే ఒక్క రాజాసింగ్ ను కేసీఆర్ సర్కార్ పోలీసులు ‘రౌడీ’గా తేల్చేశారు. ఈమేరకు ‘షీట్‘ కూడా తెరిచి పోలీస్ స్టేషన్లోని రౌడీల జాబితాలో రాజాసింగ్ పేరును కూడా మంగళ్ హాట్ పోలీసులు చేర్చిన సంగతి తెలిసిందే. ఏదో పనిమీద సదరు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బీజేపీ కార్యకర్తలెవరో విషయాన్ని గమనించి రాజాసింగ్ చెవిన వేశారట. ఈ పరిణామంపై రాజాసింగ్ అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు. ‘తాను అన్నీ వదిలేసి ప్రజాసేవలోకి వచ్చాను‘ అని ఆయనే స్వయంగా చెబుతున్నారు. అయితే తనపై రౌడీషీట్ పెట్టినందుకు బాధ లేదని, ఇంతకీ తాను ఎమ్మెల్యేనా? రౌడీనా? అని తనకు తాను సందేహపడుతూనే, గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై, మంత్రులపై రౌడీషీట్లు ఉన్నాయని, వాటిని ఇప్పుడు కొనసాగిస్తారా? అని కూడా రాజాసింగ్ ప్రశ్నిస్తున్నారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా విడుదల చేశారు.
ఇప్పడు అసలు విషయంలోకి వద్దాం. అసలు రౌడీ షీట్ ఎవరిపై ఓపెన్ చేస్తారు? ఇందుకు ప్రామాణికం ఏమిటి? ఎమ్మెల్యే వంటి ప్రజాప్రతినిధులపై రౌడీ షీట్ తెరిస్తే, విధుల్లో భాగంగా పోలీసులు ఏం చేయాలి? రాజాసింగ్ ఘటన నేపథ్యంలో రేకెత్తుతున్న అనేక ప్రశ్నలివి. సాధారణంగా ఎవరిపైనైనా కనీసం మూడు నేర ఘటనలకు సంబంధించి కేసులు నమోదైతే, అటువంటి వ్యక్తులపై పోలీసులు రౌడీ షీట్ తెరుస్తారు. నేర తీవ్రతను బట్టి కూడా రౌడీ షీట్ తెరుస్తారు. ఇక వీళ్లను జైల్లో పెడితే తప్ప నేరాలు తగ్గే అవకాశం లేదని భావిస్తే పీడీ యాక్టు కూడా పెడతారు. ముఖ్యంగా దొంగతనాలు, దోపిడీలు, దొమ్మీలు, ప్రజలను భయ, భ్రాంతులకు గురిచేసే వ్యక్తులపై రౌడీ షీట్ తెరుస్తారు. ఎస్పీ స్థాయి అధికారులు గల జిల్లాల్లో మెజిస్టీరియల్ అధికారాలు గల అధికారుల అనుమతితో ఇటువంటి వ్యక్తులపై రౌడీ షీట్లు తెరుస్తారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే కమిషనర్ స్థాయి ఐపీఎస్ అధికారులకు మెజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి, కాబట్టి నేరుగా పోలీసు అధికారుల అనుమతితోనే నేరాలకు పాల్పడేవారిపై స్థానిక పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేయవచ్చు.
రౌడీషీట్ తెరిచిన వ్యక్తి కదలికలపై పోలీసులు గట్టి నిఘా కూడా ఏర్పాటు చేస్తారు. అతని అడుగు, జాడలపై నిత్యం కన్నేసి ఉంచుతారు. ఎప్పుడైనా, ఎక్కడైనా రౌడీషీటర్లను తనికీ చేయవచ్చు. ప్రశ్నించవచ్చు. అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా రౌడీషీటర్ల నివాసాలను తనిఖీ చేయవచ్చు. అవసరం అనుకుంటే పోలీసులు ఎప్పుడైనా రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్ కు పిలిపించుకోవచ్చు. వాళ్లు పిలిచిందే తడవుగా రౌడీ షీటర్లు స్టేషన్ కు రావలసి ఉంటుంది. అవసరమైతే ఓ రిజిస్టర్ లో నిర్దేశిత గడువు ప్రకారం స్టేషన్ కు వచ్చి సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. పోలీసు అదేశాలను రౌడీ షీటర్ పాటించకపోతే అతను ఏదో నేరానికి పాల్పడేందుకు స్కెచ్ వేస్తున్నట్లుగానో పోలీసులు అనుమానించే అవకాశం కూడా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే రౌడీషీటర్ ప్రతి కదలికపై పోలీస్ నిఘా ఉంటుంది. నేర నియంత్రణలో పోలీసు విధుల్లో ఇది ఓభాగం.
అయితే గత ఘటనల నేపథ్యంలో… రాజా సింగ్ పై ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచాల్సిన అవసరం లేదనేది కొందరి వాదన. పోలీసులు రౌడీ షీట్ తెరిచిన రాజాసింగ్ వారి నుంచి తప్పించుకుని తిరిగే అవకాశమే లేకపోవడం గమనార్హం. ఓ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాసింగ్ భద్రత కోసం ఆర్ముడ్ రిజర్వు (ఏఆర్) విభాగానికి చెందిన పోలీసులు నిత్యం కాపలా కాస్తూనే ఉంటారు. రాజాసింగ్ ప్రతి కదలిక ప్రభుత్వానికి తెలిసే అవకాశం లేదని భావించే పరిస్థితి కూడా లేదు. రాజాసింగ్ అడుగు తీసి అడుగు వేస్తే ఎప్పటికప్పుడు నివేదించడానికి అతనికి రక్షణగా ఉన్న ఏఆర్ పోలీసులు సిద్ధంగానే ఉంటారు. ఇంటలిజెన్స్ తరహాలో సమాచారం అందించే అవకాశం కూడా ఉంది. ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, మంత్రులకు సెక్యూరిటీగా ఉండే పోలీసులు అవసరం మేరకు, ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పరోక్షంగా ఇంటలిజెన్స్ డ్యూటీ కూడా చేస్తుంటారనేది అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వంలో భాగమైన పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్ పై రౌడీషీట్ ఎందుకు తెరిచినట్లు? ఆయన కదలికలు ఏమిటో ప్రభుత్వానికి తెలియకుండా ఉంటాయా? రాజాసింగ్ అసెంబ్లీకి కూడా వస్తుంటారు కదా? తాను అన్నీ వదిలేసి ప్రజాసేవ లోకి వచ్చానని రాజాసింగే చెబుతున్నారు కదా? మరి ఇటువంటి పరిస్థితుల్లో రాజాసింగ్ పై పోలీసులు రౌడీషీట్ తెరవడానికి గల అసలు కారణం ఏమిటి? ఇటువంటి అనేక సందేహాలపై ఓ బీజేపీ నాయకుడు మాట్లాడుతూ, ‘బహుషా తాను అత్యంత ప్రేమగా చూసుకుంటున్న తన మిత్రపక్ష పార్టీ నేతలను సంతోషపర్చడానికి కేసీఆర్ ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చు‘ అని వ్యాఖ్యానించారు. ఔనా..? నిజమేనా!! అసలు సంగతి అదేనా?