ఔను… ఈ ఘటన ఖమ్మం పోలీసుల ఇజ్జత్ కా సవాల్ (పరువుకు సంబంధించిన ప్రశ్న) వంటిదే. ఫొటో చూశారు కదా…? ఇది ఖమ్మం టూ టౌన్ పోలీసుల పెట్రోలింగ్ వెహికిల్. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధుల నిర్వహణకు వెళ్లిన పోలీసులపై కొందరు రౌడీ మూకల దాడి ఘటనకు ప్రబల నిదర్శనం ధ్వంసమైన ఈ వాహనం. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేని నిస్సహాయ స్థితిని ఎదుర్కుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
నగరంలోని రమణగుట్ట ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఓ ఘర్షణ ఘటనలో పోలీసులూ బాధితులుగా మిగిలిపోవడమే విషాదం. ఘర్షణను నివారించడానికి వెళ్లిన పోలీసులపై స్థానిక రౌడీ మూకలు ఎదురుదాడికి దిగినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు పోలీసు వాహనాన్ని ఎలా ధ్వంసం చేశారో ఫోటోలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అంతేకాదు తమపై జరిగిన దాడి తీవ్రతకు తగ్గని విధంగా పోలీసులపైనా దాడులు జరిగాయని బాధిత వర్గాలు చెబుతున్నాయి. టూ టౌన్ సీఐని కాలనీ బయటి వరకు రౌడీ మూకలు నెట్టుకుంటూ వెళ్లాయని కూడా చెబుతున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై రౌడీలు చేయి చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు వెళ్లిన అధికారుల, పోలీసుల విధులకు ఈ విధంగా ఎవరైనా ఆటంకం కలిగిస్తే చర్యలు ఎలా ఉండాలి? కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా ఉండడమే అసలు విశేషం. ఈ ఘటనలో ఘర్షణకు దిగిన ఇరువర్గాలు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలేనట. నమోదైన కేసు ప్రకారం… రౌడీయిజానికి పాల్పడిన నిందితులందరూ గులాబీ పార్టీకి చెందిన కార్యకర్తలట.
దీంతో ఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా పోలీసులు నిందితులైన 12 మందిలో ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎటువంటి అరెస్టులు జరగలేదని పోలీసు వర్గాలు కూడా ఈ వార్తా కథనం రాసే సమయానికి చెప్పాయి. తాము అధికార పార్టీలో ఉన్నామని, ఫలానా ముఖ్య నేత అనుచరులుగా ఉన్నందువల్లే తమకు ఈ దుస్థితి దాపురించిందని, తమను అరెస్ట్ చేస్తే పురుగుల మందు తాగుతామని నిందితులు పోలీసులను ఉల్టా బెదిరిస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు పాలుపోని స్థితిని ఎదుర్కుంటున్నారుట.