మావోయిస్టు నక్సలైట్ల బందీగా చిక్కిన కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదలలో జర్నలిస్టులు తమ వంతు పాత్రను పోషించారు. ఈనెల 3వ తేదీన ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా జీరగూడెం-తొర్రెం అటవీ ప్రాంతంలో నక్సలైట్లకు, పోలీసులకు మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్ ఘటనలో 22 మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో కోబ్రా విభాగానికి చెందిన రాకేశ్వర్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ ను మావోయిస్టులు బందీగా పట్టుకుని తమ వెంట తీసుకువెళ్లారు. రాకేశ్వర్ సింగ్ విడుదల కోసం దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న పరిణామాల్లో అతని విడుదలలో జర్నలిస్టులు కూడా తమ వంతు పాత్రను పోషించడం విశేషం.
నక్సలైట్ల బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్ విడుదలలో పద్మశ్రీ ధర్మపాల్ సైని, గోండ్వానా సమాజ్ అధ్యక్షుడు తెలం బోరయ్యలతో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇద్దరు సభ్యులతోపాటు జర్నలిస్టులు కీలక పాత్రను పోషించారు. ఆయా ముఖ్యులు సహా వందలాది మంది గ్రామస్తుల సమక్షంలో జవాన్ రాకేశ్వర్ సింగ్ ను నక్సలైట్లు గురువారం విడుదల చేశారు. జవాన్ విడుదల కోసం మధ్యవర్తిత్వం వహించిన ఇద్దరు సభ్యుల బృందంతోపాటు బస్తర్ ప్రాంతానికి చెందిన ఏడుగురు జర్నలిస్టులు కూడా ఉండడం విశేషం. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కత్తిమీద సాములా విధులు నిర్వహించే జర్నలిస్టులు ఇటువంటి ఆపత్కాలంలో తమ వంతు పాత్ర పోషించడం ప్రశంసలకు నోచుకుంటున్నది.
ఫొటో: విడుదలైన తర్వాత తమ శిబిరంలో రాకేశ్వర్ సింగ్