ఏకే-47 వంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుండగా తమకు సలహాలిచ్చే ఎటువంటి ‘పీకే’లు అవసరం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రశాంత్ కిషోర్ ను సలహాదారునిగా పెట్టుకోవాలని ఓ మిత్రుడు సలహా ఇచ్చారని చెప్పారు. అయితే ఏకే-47 వంటి, పాదరసం తరహా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండగా తమకు ఎటువంటి పీకేల సలహాలు అవసరం ఉండదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తమకు పీకేలని, బ్రాండ్ అంబాసిడర్లను నిర్వచించారు. పీసీసీ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం గాంధీ భవన్ వేదికగా నిర్వహించిన సభలో రేవంత్ మాట్లాడారు. తెలంగాణాలో కేసీఆర్ పాలనకు అంతం పలకడానికి కాళోజీ నారాయణరావు మాటలను గుర్తుకు తెచ్చుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు. ‘ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే….ప్రాంతం దాకా తన్ని తరుముతం. ప్రాంతంవాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతరపెడ్తాం.’అని చెప్పిన కాళోజీ మాటలు ప్రేరణగా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలన్నారు.
వ్యక్తిగత నినాదాలిస్తే పార్టీలో ఉండరని, పార్టీ నుంచి బహిష్కరిస్తామని, వ్యక్తిగత నినాదాలు కాంగ్రెస్ పార్టీకి నష్టమని రేవంత్ అన్నారు. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ నినాదాలు మాత్రమే వినిపించాలన్నారు. స్వయం పాలన లేకపోవడం వల్లే తెలంగాణా బందీగా మారిందన్నారు. తెలంగాణా తల్లి సోనియమ్మ మాత్రమేనని, ఎవరెన్ని చెప్పినా, ఎంత మంది అడ్డం పడ్డా 60 ఏళ్ల తెలంగాణా కల సాకారమైంది సోనియా గాంధీ వల్ల మాత్రమేనని చెప్పారు. ప్రతి ఇంట్లో సోనియా గాంధీ చిత్రపటం ఉండాల్సిన అవసరముందన్నారు. తెలంగాణా ద్రోహులు మంత్రులై, గద్దెలెక్కి మన నెత్తిన ఎక్కి డాన్సులు చేస్తున్నారన్నారు. ప్రతి తలుపును, ప్రతి గుండెను తట్టాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మోదీ, కేసీఆర్ వల్ల పేదోడు బతికే పరిస్థితి లేదన్నారు. కరోనాకంటే కేసీఆర్, మోదీలు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనను 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలంటే, ప్రతి కార్యకర్త రెండేళ్లపాటు ఇంటికి సెలవు పెట్టాలన్నారు. రెండేళ్లు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నట్లు చెప్పి ఇంట్లో అనుమతి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణాలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇన్ని ఉద్యోగ ఖాళీలు ఎలా ఉన్నాయో సీఎం చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణాలో ఎన్కౌంటర్లు ఆగాయా? రైతుల ఆత్మహత్యలు ఆగాయా? అని నిలదీశారు. ఉద్యమకారులపై కేసులు తొలగించలేదన్నారు. తెలంగాణాకు పట్టిన చీడను పొలిమేర దాటే వరకు తరమాలన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణా తేలదని, అధికారాన్ని కోల్పోయి తెలంగాణాను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. అధికారం పోయినా ఫరవాలేదని తెలంగాణా ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘటన కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. తెలంగాణా సమాజాన్ని అడుగుతున్నానని, గిలాస మంచి నీళ్లిస్తే సల్లంగుండాలని దీవిస్తం… 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాకు కృతజ్ఞత చూపాల్సిన బాధ్యత తెలంగాణా ప్రజలకు లేదా? అని రేవంత్ ప్రశ్నించారు.
అంతకు ముందు టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, ఇతర నేతలు దామోదర రాజనర్సింహా, సీతక్క, నాగం జనార్దన్‌రెడ్డి, పొన్నాల లక్ష్యయ్య సహా కొత్త కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు.. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమానికి ముందు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో పూజలు చేశారు. అనంతరం నాంపల్లిలోని దర్గాకు ర్యాలీగా బయలుదేరి అక్కడ చాదర్ సమర్పించారు. అక్కడి నుంచి గాంధీ భవన్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రేవంత్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గాంధీభవన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు భారీ సందడి చేశారు.