ప్రభుత్వం మారే అంశాన్ని పోలీసులు ముందే పసి గడతారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనను హైదరాబాద్ లో కలిసిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేటర్లతో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మనం రోడ్డు మీదకు వస్తే పోలీసులు మనల్ని దొంగలను చూసినట్లు చూసేవారని, కానీ ఈనెల 12న నిర్వహించిన ధర్నా కార్యక్రమాల్లో పోలీసులకు కూడా అర్థమైందని, కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడతారని, ఊరుకునేట్లు లేరని, లాఠీ ఛార్జి చేస్తే రాళ్లతో కొట్లే పరిస్థితి ఉందని వాళ్లకు కూడా అర్థమైందన్నారు.
ప్రభుత్వం మారబోతున్నదనే విషయాన్ని అందరికంటే ముందుగా పోలీసులు గుర్తు పడతారని, వివిధ అవసరాలపై స్టేషన్ కు వచ్చే ప్రజల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తుంటారని అన్నారు. పోలీసులు ప్రతిపక్షాలను గౌరవిస్తున్నారంటే ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తున్నట్లు గ్రహించాలన్నారు. ఈ అంశాన్ని పోలీసులే తొలుత గుర్తు పడతారని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు పూర్తిగా టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా వ్యవహరించిన పోలీసులు నిన్న, మొన్నటి కార్యక్రమాల్లో బ్యాలెన్స్ స్థితికి వచ్చారని, భవిష్యత్తులో పూర్తిగా సహకరించేకాడికి వస్తారని రేవంత్ అన్నారు.
ఎవరూ అధైర్య పడవద్దని, భవిష్యత్తు మంచిగా ఉంటుందని అన్నారు. ఇప్పుడు కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుంటానని హామీ ఇచ్చారు. గతంలో ఉన్న రాజకీయాలు, పరిస్థితులు వేరని, ఇప్పుడు మారిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉన్నానని భరోసా ఇచ్చారు. న్యాయ సహాయం కావాలన్నా, ఏ అవసరం ఉన్నా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఖమ్మం కార్పొరేటర్లతో రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారో దిగువన గల వీడియోలో చూడవచ్చు.