ఫొటోను నిశితంగా చూడండి. తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతులు కట్టుకుని ఉండగా, బీజేపీ నేత, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆయనను తదేకంగా చూస్తున్నారు. వీరిద్దరు కూడా చిరునవ్వులు చిందిస్తున్న ఈ దృశ్యం రాజకీయ కలకలానికి దారి తీసింది. ఓ న్యూస్ ఛానల్ బ్రేకింగ్ ప్లేట్ ఫొటోలతో సోషల్ మీడియాలో ఒకటే పోస్టుల వరద. ‘బీజేపీలో భవిష్యత్తు లేదు. రేవంత్ వచ్చాక కాంగ్రెస్ కు పూర్వ వైభవం: వివేక్, పార్టీ మారే విషయంపై రెండు గంటలపాటు చర్చలు’ అంటూ ఆయా పోస్టుల సారాంశం. ఇంకేముంది…? అటు బీజేపీలో, ఇటు కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య ఒకటే రాజకీయ చర్చ. కానీ ఇవన్నీ ఫేక్ వార్తలంటూ వివేక్ కు వర్గీయులు వివరణ ఇచ్చుకోవలసిన తాజా పరిస్థితి. ఇంతకీ అసలు విషయమేమిటంటే…?
వాస్తవానికి ఈ ఫొటో ఇప్పటిది కానే కాదట. రెండేళ్ల క్రితం… 2019 జూన్ 12న రేవంత్ రెడ్డి ఫేస్ బుక్ లో ఈ ఫొటో పోస్ట్ అయినట్లు వివేక్ వర్గీయులు సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చుకుంటున్నారు. అప్పటి ఫొటోను ఇప్పుడు వివిధ మీడియా సంస్థల పేరుతో నకిలీ బ్రేకింగ్ న్యూస్ ఇమేజ్ లు క్రియేట్ చేసి వదులుతున్నారట. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగానూ వివేక్ గురించి ఈ తరహా పోస్టులనే క్రియేట్ చేశారని, ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో తాజాగా అదే తరహా దుష్ప్రచారానికి పాల్పడుతున్నారనేది వివేక్ వర్గీయుల వాదన. మొత్తంగా అప్పుడెప్పుడో కలుసుకున్నట్లు పేర్కొంటున్న ఈ ఫొటో లేపుతున్న రాజకీయ గత్తరపై వివేక్ మీడియాకు చెందిన ఉద్యోగులు కూడా సోషల్ మీడియా వేదికగా ‘కౌంటర్’ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.