తప్పా.. ఒప్పా..? ఏది అబద్ధం… మరేది నిజం? ధ్రువపడని వార్త ఏమిటి? ధ్రువీకరించిన సమాచారం ఏమిటి? అసలు వార్తకు ప్రామాణికం ఏమిటి? జర్నలిజపు ప్రమాణాలు ఏమిటి? వీటి అర్థాలు, పరమార్థాలు.. మూలాలు… గీలాలు.. చర్చా.. గిర్చా.. ప్రస్తుత జర్నలిజపు కాలంలో జాన్తా నై. కానీ ఒకానొక అంతర్జాతీయ వార్తా సంస్థ వెలువరించిన ఓ కథనం ప్రభావానికి ఆంధ్రప్రదేశ్ లోని జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విలవిలలాడుతున్నట్లే కనిపిస్తోంది. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇదో హాట్ టాపిక్ కూడా.
జగన్ తోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు పదే పదే ప్రస్తావించే ‘ఎల్లో మీడియా’ రాయిటర్స్ వార్తా సంస్థ అందించిన కథనాన్ని బేస్ చేసుకుని తమదైన శైలిలో కుమ్మేశాయి. ఏపీ పారిశ్రామిక రంగానికే తలమానికంగా చెప్పుకుంటున్న అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ ‘కియా’ మన రాష్ట్రం నుంచి తమిళనాడుకు తరలిపోతోందా? అంటూ లీడ్ పేరాతో ‘ఈనాడు’ బ్యానర్ స్టోరీని ప్రచురించింది. ‘రాయిటర్స్’ సంచలన కథనం అంటూనే, మంత్రులు ప్రచారాన్ని ఖండించారని, తాము చర్చించలేదని తమిళనాడు అంటున్నదని, తమ రాష్ట్రానికి రావాలంటూ పంజాబ్ ఆహ్వానిస్తోందని చెబుతూనే… మరోవైపు ‘రాయిటర్స్ కథనం సారాంశం ఇదీ’ అంటూ భారీ కథనాన్ని ‘ఈనాడు’ తన పాఠకుల ముందుంచింది.
జగన్ సర్కార్ కు సంబంధించి ‘చిన్న’ పాయింట్ దొరికినా బ్యానర్ స్టోరీ స్థాయిలో కుమ్మేసే ఆంధ్రజ్యోతి మాత్రం ఈసారి టోన్ డౌన్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ వార్తను మొదటి పేజీలో కాకుండా పదో పేజీలోకి నెట్టేసి ‘కియ’ కలకలం శీర్షికన మూడు కాలాల వార్తకే పరిమితం చేయడం గమనార్హం.
ఇక ‘ఎల్లో మీడియా’ ప్రచారపు జాబితాలో గల పలు న్యూస్ ఛానళ్ల సంగతి సరేసరి. తీవ్రవాద ఉద్యమంలో పనిచేసినట్లు తనకు తాను లైవ్ లోనే చెప్పుకునే వెంకటకృష్ణ ‘బ్రేకింగ్ న్యూస్’ అంటూ ఈ విషయంలో తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.‘కియా మోటార్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కిరీటంలాగా అందరం భావించాం మనం, డెఫినెట్ గా ఇది ఏపీకి మకుటాయమానం లాంటి ఒక ప్రాజెక్టు.. చంద్రబాబునాయుడి గారి హయాంలో శంకుస్థాపన జరిగి, ప్రారంభోత్సవాలు జరిగి…’ అంటూ మొదలు పెట్టి ‘కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటోంది. ఇదీ బ్రేకింగ్ న్యూస్. ఇదీ నేను చెప్తున్న మాట కాదు..ప్రపంచంలోనే నంబర్ వన్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్… రాయిటర్స్ తెలియని వాళ్లెవరూ ఉండరు. రాయిటర్స్ ఏజెన్సీ నిన్న రిలీజ్ చేసిన స్టోరీ. ఎక్స్ క్లూజివ్.. యు కెన్ వాచ్ ఇట్ హియర్. ఎక్స్ క్లూజివ్.. న్యూఢిల్లీ నుంచి ఒచ్చిందీ స్టోరీ. దీనియొక్క సారాంశం ఏంటంటే..’ అంటూ సదరు ఏజెన్సీ రాసిన వార్తా కథనాన్ని కాస్త ఆంగ్లంలో, మరికొంత తెలుగులో చదువుతూ వినిపించారు.
సరే… ‘రాయి’టర్స్ సంస్థ వదలిన వార్తా కథనానికి మరింత మసాలా జోడించి ‘ఎల్లో మీడియా’ తనదైన తీరులో వార్తలను జనంలోకి వదిలితే.. టీడీపీ నేతల పరిభాష ప్రకారం ‘బ్లూ’ మీడియా లేదా జగన్ మీడియా ఊరుకుంటుందేంటి? ‘కియా’పై మాయాజాలం శీర్షికన ‘సాక్షి’ పత్రిక సైతం బ్యానర్ స్టోరీని జగనన్న వదిలిన అక్షర బాణంలా సంధించింది. ‘రాయిటర్స్’ లో వార్త… నిమిషాల వ్యవధిలోనే వెబ్ సైట్లలో ప్రత్యక్షం, కియా ఖండించిందంటూనే తమిళనాడుకు తరలుతోందని వింత రాతలు, కార్ల కంపెనీ యాజమాన్యం ఖండించినా ఆగని దుష్ప్రచారం, ఈ కథనం వెనుక రాజకీయ దురుద్ధేశాలు, వార్త రాసిన విలేఖరి ఖాతాను స్తంభింపజేసిన ట్విట్టర్, అద్భుతంగా నడుస్తున్న ప్లాంట్ పై ఈ అసత్య కథనాలేంటి?, ఆశ్చర్యం కలిగించాయంటున్న కియా మార్కెంటింగ్ హెడ్ మనోహర్ భట్’ అంటూ సాక్షి కౌంటర్ కథనాన్ని తన పాఠకుల ముందుంచింది.
మొత్తంగా ఈ విషయంలో చెప్పేదేమిటంటే.. ఓ వార్త దావానలంలా వ్యాపిస్తుంది. నిజానిజాల సంగతి ‘కియా’ మోటార్స్ సంస్థకెరుక కావచ్చు. కానీ ఏది నిజమో, మరేది అబద్ధమో తేల్చుకునేలోపు జరగాల్సిన నష్టం మాత్రం జరుగుతుంది. ఏపీలో ప్రస్తుతం ఈ పరిణామం అధికార పార్టీకి రాజకీయంగా జరిగే నష్టం కావచ్చు. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే కాబోలు ‘రాయి’టర్స్ వార్తా కథనపు ప్రభావంతో జగన్ సర్కార్ ‘కియా’ మొర్రో అంటోందనడానికి ఆయా వార్తా కథనాలే ‘సాక్షి’. ఇదీ అసలు సంగతి.