ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును తెలంగాణా ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచిందా? ఒకటి కాదు… రెండూ కాదు ఏకంగా ఏడేళ్ల సర్వీసును పెంచి సంచలన నిర్ణయం తీసుకుందా? ఇందుకు సంబంధించి అసెంబ్లీలో సోమవారం బిల్లు కూడా పాసైందా? సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందిన ఎనిమిది బిల్లుల్లో మొదటి బిల్లుకు సంబంధించిన వాక్యం ఇప్పుడు తెలంగాణా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
‘ప్రభుత్వ నియామకాల పదవీ విరమణ వయో పరిమితి చట్ట సవరణ బిల్లు’ పేరుతో అసెంబ్లీ ఆమోదం పొందిన అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఓ రెండేళ్ల సర్వీసు పెంచితే చాలుననే ఆశతో గల ప్రభుత్వ ఉద్యోగుల అంచనాలకు విరుద్ధంగా కేసీఆర్ సర్కార్ ఏడేళ్లకు పెంచినట్లు ప్రచారం జరుగుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క కూడా ఇందుకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదే వీడియోను సీతక్క తన ట్విట్టర్ ఖాతాలోనూ పోస్ట్ చేయడం గమనార్హం.
నిరుద్యోగ యువత ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తు్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును ఏడేళ్లకు పెంచడమేంటి? ఇక కొత్తవాళ్లకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? ఇచ్చిన హామీ మేరకు రూ. 3 వేల నిరుద్యోగ భ్రుతి కూడా ఇవ్వడం లేదని, ఈ బిల్లుకు తాను వ్యతిరేకమని కూడా సీతక్క పేర్కొన్నారు. అయితే తమ రిటైర్మెంట్ వయస్సును ఏకంగా ఏడేళ్లకు పెంచినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఉద్యోగులు సంబరం చేసుకోవడం లేదేమిటి? సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు గట్రా నిర్వహించడం లేదేమిటి? ఇది కదా అసలు సందేహం!
‘ప్రభుత్వ నియామకాల పదవీ విరమణ వయో పరిమితి చట్ట సవరణ బిల్లు’కు అసెంబ్లీ ఆమోదానికి సంబంధించి అసలు పాయింట్ కు వస్తే… వాస్తవానికి ఇది ‘ఆయుష్’ ఉద్యోగులకు సంబంధించిన బిల్లు. ప్రభుత్వ ఆయుర్వేద, యునాని, నాచురోపతి విభాగాల్లో ప్రొఫెసర్లు, ఇతర ఉద్యోగుల తీవ్ర కొరత కారణంగా వారి వయస్సును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ఇప్పటికే ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. తాజా అసెంబ్లీ సమావేశాల్లో అదే ఆర్టినెన్సు స్థానంలో బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.
అయితే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులో ‘ప్రభుత్వ నియామకాల పదవీ విరమణ వయో పరిమితి చట్ట సవరణ బిల్లు’ అని మాత్రమే ఉన్నట్లు సమాచారం. రెఫరెన్స్ లో మాత్రం ఆయుష్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపునకు సంబంధించి ఆర్డినెన్స్ సంఖ్యను ఉటంకించినట్లు తెలుస్తోంది. ఇదీ అసలు విషయం కాగా, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచిందని ప్రచారం జరగడం గమనార్హం. ఎమ్మెల్యే సీతక్క కూడా ఈ విషయంలో పొరబడి ప్రసంగించినట్లు స్పష్టమవుతోంది. అదీ ‘రిటైర్మెంట్’ వయోపెంపులోని అసలు సంగతి.