‘అచ్చొస్తే ఆంజనేయస్వామి…లేకుంటే కోతి మూతి’ చందం. వివిధ ప్రభుత్వాల్లోని పాలకులు అధికారులను, అనధికారులను సలహాదారులుగా నియమించుకుంటున్న అంశంలో హైదరాబాద్ లోని అత్యంత సీనియర్ జర్నలిస్టు చేసిన వెటకరింపు సామెత ఇది. అనధికార వర్గాల గురించి వదిలేద్దాం. రాజకీయ ప్రయోజనాలో, ఇతరత్రా సమీకరణల వల్లో అనేక మంది నాయకులు పాలకులను ప్రసన్నం చేసుకుని, పదవులను ఆకాంక్షిస్తారు. కొన్ని సందర్భాల్లో అనర్హులకు సైతం అధికార అందలాలు దక్కుతుంటాయి. కానీ అధికార వర్గాల విషయంలో ఈ వాదన అర్థరహితమని చెప్పక తప్పదు. కానీ పదవీ విరమణ చేసిన అనంతరం హాయిగా శేష జీవితం గడపాల్సిన అనేక మంది అధికారులను పాలకులు ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకుంటున్న అంశంపైనే మరోసారి చర్చ జరుగుతోంది. కార్యనిర్వాహక వ్యవస్థలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ పదవీ విరమణ అనంతరం ప్రభుత్వ సలహాదారులుగా నియామకపు పరంపర కొనసాగుతుండడమే ఇందుకు కారణం. తెలంగాణా ప్రభుత్వ సలహాదారుల జాబితాలో తాజాగా మరో పేరు చేరింది. మంగళవారం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఎస్కే జోషిని ప్రభుత్వ సలహాదారునిగా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. జోషి నీటిపారుదల వ్యవహారాల సలహాదారునిగా వ్యవహరించనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
వాస్తవానికి ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారులకు కొదువేమీ లేకపోవడం గమనార్హం. ఏకే గోయెల్, కేవీ రమణాచారి, ఏకే ఖాన్, రాజీవ్ శర్మ తదితర రిటైర్డ్ అధికారులు ప్రభుత్వ సలహాదారులుగా నియమితులయ్యారు. తాజాగా ఎస్కే జోషిని కూడా ప్రభుత్వ సలహాదారునిగా నియమించారు. అనధికార సమాచారం ప్రకారం ప్రతి సలహాదారునికి దాదాపు రూ. 1.50 లక్షల వేతనంతోపాటు ప్రభుత్వ పరంగా అన్ని అలవెన్సులు లభిస్తాయి. వేతనంలో రిటైర్డ్ అధికారులకు లభించే పెన్షన్ ను మినహాయించవచ్చు.
వాస్తవానికి తమ ‘గుడ్ లుక్స్‘లో గల అధికారులు పదవీ విరమణ చేశాక, వారిని తమ సలహాదారులుగా పాలకులు నియమించుకోవడం కొత్తేమీ కాదు. ఇందిరాగాంధీ హయాం నుంచి ఈ సలహాదారుల నియామకపు ప్రక్రియ కొనసాగుతున్నదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనూ తమకు ‘నచ్చిన’ అధికారులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్న చరిత్ర ఉంది. జన్నత్ హుస్సేన్ అనే అధికారిని ఆయన పదవీ విరమణకు ఆరు నెలల ముందే వైఎస్ తన హయాంలో ‘సలహాదారు’నిగా నియమించుకున్నారు. అప్పుడెప్పుడో 1981లో కడప కలెక్టర్ గా పనిచేసిన జన్నత్ హుస్సేన్ ను గుర్తుంచుకుని మరీ 2004లో, అంటే దాదాపు పాతికేళ్ల తర్వాత కూడా గుర్తు పెట్టుకుని సలహాదారునిగా వైఎస్ అందలం కల్పించడం విశేషం. స్వరణ్ జిత్ సేన్ అనే ఐపీఎస్ అధికారి కూడా వైఎస్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సలహాదారునిగా నియమితులైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కాదు గవర్నర్ సలహాదారులుగానూ కొందరు అధికారులు నియమితులైన దాఖలాలు అనేకం. ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి వంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గవర్నర్ సలహాదారులుగా నియమితులైన విషయం విదితమే.
అయితే ఇటువంటి సలహాదారుల పోస్టుల విషయంలో ఓ సీఎంకు ఏమాత్రం నచ్చని అధికారి, మరో ముఖ్యమంత్రికి ‘ఇష్టం’ కావడం కూడా గమనార్హం. తనకు ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చారనే ఆవేదనతో ఆకునూరి మురళి అనే ఐఏఎస్ అధికారి తెలంగాణా ప్రభుత్వంలో స్వచ్ఛంద పదవీ విరమణ చెందగా, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయనను అక్కున చేర్చుకోవడం విశేషం. ఆకునూరి మురళి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో పాఠశాల విద్య (మౌళిక వసతుల కల్పన) సలహాదారునిగా వ్యవహరిస్తున్నారు. ఇక అనధికార వర్గానికి చెందిన అనేక మంది సైతం పాలకుల అభీష్టం మేరకు ప్రభుత్వ సలహాదారులుగా నియమితులవుతుంటారు. ఉదాహరణకు తెలంగాణాకు చెందిన జర్నలిస్టులకు, సాక్షి పత్రిక ఉద్యోగులకు ఏపీలోని జగన్ సర్కార్ లో లభించిన సలహాదారుల హోదా టైపు అన్నమాట.
మొత్తంగా చెప్పొచ్చే అంశమేమిటంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా, డీజీపీలుగా, కలెక్టర్లుగా వ్యవహరించిన ప్రతి అధికారికీ రిటయిర్మెంట్ తర్వాత ప్రభుత్వ సలహాదారు పోస్టులు లభించే అవకాశం లేదు. పాలకుల ‘గుడ్ లుక్స్’ ఉంటే తప్ప పదవీ విరమణ తర్వాత ఇటువంటి అదనపు హోదా లభించదనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. అయితే ‘గుడ్ లుక్స్’ అనే పదానికి అసలు నిర్వచనంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమర్థవంతంగా విధులు నిర్వహించిన అధికారులవల్ల ప్రభుత్వానికి మంచి పేరు లభించడం, ఇటువంటి అధికారుల సేవలను కొనసాగించాలనే తపన పాలకులకు ఉంటుందనేది ఓ వాదన. కానీ పాలకులు చెప్పిన ‘పద్ధతి’లో ఫైళ్లు కదిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు ఐఏఎస్ అధికారులు ఆ తర్వాత పరిణామాల్లో శ్రీకృష్ణ జన్మస్థానాన్ని దర్శనం చేసుకున్న ఉదంతాలు ఉన్నాయనే మరో వాదన సైతం ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తున్నది.
‘‘ఒక చిన్న కార్యాలయంగా ముఖ్యమంత్రికి సహాయ సహకారాలు అందించడానికి ఏర్పడిన ఆఫీసు… ఈరోజు పలువురు ఉన్నతాధికారులు, సలహాదారులతో ఒక సమాంతర అధికార వ్యవస్థగా తయారైంది. విచిత్రం ఏమిటంటే..? సచివాలయ ‘బిజినెస్ రూల్స్’ ఈ కార్యాలయానికి వర్తించవు. దీన్ని అదనుగా తీసుకొని ముఖ్యమంత్రి కార్యాలయాలు ఎవరు సీఎంగా ఉన్నా, ఎటువంటి బాధ్యతా లేని అధికారాలను చలాయిస్తూ పాలన వ్యవస్థలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.’’
అని…ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఇటీవల ఓ ప్రముఖ పత్రికలో రాసిన వ్యాసంలో చేసిన ఆయా వ్యాఖ్యలతో ఈ కథనాన్ని ఇంతటితో ముగిద్దాం.