ప్రముఖులపై ఎఫ్ఐఆర్ అయితే ప్రచురించకూడదా? అని ప్రశ్నించిన ఇండియాటుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్. ప్రజల్లో సందేహాలకు తావిచ్చేట్టుంగా ఉందని వ్యాఖ్యానించిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ నేతలు కె. శ్రీనివాసరెడ్డి, బల్వీందర్ సింగ్. మీడియాను నియంత్రిస్తూ ఉత్తర్వులా? అంటూ ‘ది న్యూస్ మినట్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ధన్యా రాజేంద్రన్ ఆశ్యర్యం. ప్రజాస్వామ్యంలో ఇలాంటివాటికి స్థానం లేదన్న ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ మేనేజింగ్ ఎడిటర్ సునీల్ జైన్. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లుగా అభివర్ణించిన ప్రముఖ వార్తా సంస్థ ‘ది వైర్’ కథనం. ఈ ఉత్తర్వులు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయోనని విస్మయం వ్యక్తం చేసిన ఎన్డీటీవీ జర్నలిస్ట్ ఉమా సుధీర్.
హక్కుల కాలరాతే! శీర్షికన నిన్న సాక్షి పత్రిక ప్రచురించిన వార్తా కథనంలోని పలువురు జర్నలిస్టుల అభిప్రాయాలకు సంబంధించిన సారాంశమిది. ‘అమరావతి భూ కుంభకోణంపై జాతీయ స్థాయిలో చర్చ. కేసు వివరాలు ప్రచురించకూడదన్న హైకోర్టు ఉత్తర్వులపై విస్మయం.’ అంటూ ఆయా వార్తా కథనంలో ఉప శీర్షికలు కూడా ఉన్నాయి.
కాగా, న్యాయవ్యవస్థ పత్రికల నోరు నొక్కుతుండడం దురదృష్టకరమని, అమరావతి భూకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ పార్లమెంట్ ఆవరణలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు నిన్న ధర్నా నిర్వహించారు. ఇందుకు సంబంధించి ‘భావ ప్రకటనకు సంకెళ్లా?’ శీర్షికన నేడు సాక్షి ప్రచురించిన మరో వార్తా కథనమిది. ఇదిగో ఈ నేపథ్యంలోనే…
ప్రభుత్వ నిర్ణయాలకు కోర్టు అడ్డుతగులుతోంది అని మాట్లాడండి. అవినీతి ఆరోపణలపై విచారణ చేయొద్దంటోంది అని మాట్లాడుకోండి. రాజకీయం చేసుకోండి. “మీడియాపై ఆంక్షలు అంటూ” మాట్లాడకండి. జీవో 2430 (30-10-2019) ఇంకా మీడియా మెడపై వేలాడుతూనే ఉంది.
అని ఓ సీనియర్ జర్నలిస్టు తాజాగా చేసిన వ్యాఖ్యల సారాంశం ఆకట్టుకుంది. నిరుడు అక్టోబర్ 30వ తేదీన మీడియాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 2430ని గుర్తు చేస్తూ విజయవాడలో విధులు నిర్వహించే టైమ్స్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ ఎడిటర్ దారా గోపి తన ఫేస్ బుక్ వాల్ పై రాసుకున్న వ్యాఖ్యలివి. భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాలను సృశిస్తూ గోపి రాసుకున్న ఆయా వ్యాఖ్యల్లోని ‘పంచ్’ మీకు అర్థమవుతున్నట్లే కదా!