తీసుకున్న రుణం చెల్లించలేక చేతులెత్తేసేవాడు డిఫాల్టర్…చెల్లించే ఆర్థిక స్తోమత ఉన్నప్పటికీ రుణం ఎగ్గొట్టేవాడిని విల్ ఫుల్ డిఫాల్టర్ అంటారు బ్యాంకు అధికారుల పరిభాషలో…అయితే రుణం తీసుకున్నట్లు ఎటువంటి రికార్డుల్లేకుండానే సెటిల్మెంట్ చేసుకోవాలని బ్యాంకర్లు నోటీసు పంపితే వారిని ఎలా అర్థం చేసుకోవాలి? నోటీసు అందుకున్న వ్యక్తిని ఏ తరహా డిఫాల్టర్ గా భావించాలి. బ్యాంకర్ల తీరును ఎలా భావించాలి? నేను ఏ రుణమూ తీసుకోలేదు మొర్రో…ఆ బ్యాంకుతో నాకు ఎటువంటి సంబంధం లేకున్నా నోటీసు పంపించి తీసుకున్న రుణం సెటిల్మెంట్ చేసుకోవాలని ఓ బ్యాంకు అధికారులు ఓ డాక్టర్ ను ఇబ్బంది పెడుతున్న ఉదంతం కలకలం కలిగిస్తోంది.
ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వస్తున్నదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వచనం ప్రకారం… చెల్లించగలిగే స్థోమత ఉన్నా బకాయిలను చెల్లించని వారిని, ఏ అవసరానికైతే రుణాలను తీసుకున్నారో వాటికి కాకుండా ఇతర అవసరాలకు ఖర్చుపెట్టినవారిని విల్ ఫుల్ డిఫాల్టర్లు… అంటే… ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా పరిగణిస్తారు. ఇదిగో ఇటువంటి విల్ ఫుల్ డిఫాల్టర్ల జాబితాను ఇంగ్లీష్ వెబ్ సైట్ ‘ది వైర్’ సంపాదించింది. సమాచార హక్కు చట్టం కింద ది వైర్ చేసిన దరఖాస్తు మేరకు ఆర్బీఐ విల్ ఫుల్ డిఫాల్టర్ల జాబితాను విడుదల చేసింది. 2018లో ట్రాన్స్ యూనియన్ సిబిల్ లెక్కల ప్రకారం 2018లో 11,000 వేల కంపెనీలు కలిపి చెల్లించాల్సిన మొత్తం ఎంతో తెలుసా? రూ.1.61 లక్షల కోట్లతో సమానమట. గత ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువుదాటిన 30 మంది అతిపెద్ద రుణ ఎగవేతదార్ల జాబితాను ఆర్బై ఈమేరకు వెల్లడించింది. ఆర్బీఐ విడుదల చేసిన 30 విల్ ఫుల్ డిఫాల్టర్ కంపెనీల్లో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సికి చెందిన 3 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు ఇచ్చిన రుణాల విలువ మొత్తం (ఇప్పటి వరకు బ్యాంకులు రద్దు చేసినవి కూడా కలిపి) రూ.50,000 కోట్లు దాటినట్లు ఆర్బీఐ విడుదల చేసిన జాబితా స్పష్టం చేస్తోంది. ఈ డేటాను ‘ది సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్’ నుంచి తీసుకొని ఆర్బీఐ విడుదల చేసింది. ఇందులో రూ. 5.00 కోట్లకు పైగా రుణం తీసుకొన్న వారి సమాచారం ఉంటుంది. ఇటువంటి విల్ ఫుల్ డిఫాల్టర్ల వద్దకు వెళ్లి రుణం వసూలు చేసే సత్తా బ్యాంకులకు ఎలాగూ ఉండదు. కానీ మధ్యతరగతి వాళ్లను మాత్రం అనేక సందర్భాల్లో వేధింపులకు గురి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అనవసరంగా కూడా వేధిస్తుంటారు. కావాలంటే ఇదిగో ఈ డాక్టర్ ఆవేదన చూడండి.
ఏ రుణమూ తీసుకోని తనను ఓ బ్యాంకు డిఫాల్టర్ గా చూపుతుండడంపై అధికారుల తీరును డాక్టర్ కమ్మంపాటి కిరణ్ ప్రశ్నిస్తున్నారు. ఈ డాక్టర్ దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే కమ్మంపాటి లక్ష్మారెడ్డి కుమారుడు. ఎక్కడో రాష్ట్ర రాజధానిలో వైద్యవృత్తి చేసుకునే డాక్టర్ కిరణ్ ను ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు డిఫాల్టర్ గా పేర్కొంటూ నోటీసులు జారీ చేయడం విశేషం, అసలు తనకు ఖమ్మం జిల్లాతోనే ఎటువంటి సంబంధం లేదని కిరణ్ వాదిస్తున్నారు. వచ్చే డిసెంబర్ నెలాఖరులోపు వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని కూడా బ్యాంకు అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాను తీసుకున్నట్లు చెబుతున్న రుణం తాలూకు వివరాలు చెప్పాలని కిరణ్ బ్యాంకు అధికారులను నిలదీస్తే, అందుకు సంబంధించిన ఎటువంటి ఫైల్ బ్యాంకులో లేదని తేలిందట. అసలు ఫైల్ లేకుండా రుణం ఎవరికి ఇచ్చారో…తనకెందుకు నోటీసులు పంపారో తెలియక డాక్టర్ కిరణ్ ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే దాదాపు రూ. 1.31 లక్షలు రాజేశ్వరపురం బ్యాంకుకు తాను బాకీ ఉన్నట్లు తన సిబిల్ స్కోర్లో చూపుతోందని, దీనివల్ల తనకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అవసరానికి తనకు రుణం కూడా లభించడం లేదని డాక్టర్ కిరణ్ ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పొలం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు సిబిల్ స్కోర్లో చూపుతోందని, బ్యాంకు అధికారులు తనకు ఆ పొలాన్ని అప్పగిస్తే రుణం కూడా చెల్లిస్తానని కిరణ్ స్పష్టం చేశారు. రాజేశ్వరపురం ఎస్బీఐ అధికారులు ఏం చేస్తారో చూడాలి మరి.