అరె…ఏంటండీ ఈ ఆర్నబ్ గోస్వామి గోల? ఆయనెవరు? అని ప్రశ్నించకండి. అదేనండీ రిపబ్లిక్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ కమ్ మేజర్ వాటాదారుడు. అదే పనిగా అరుస్తుంటాడు ఏంటండీ?
నెత్తురు చుక్క చిందకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, బంగారు తెలంగాణాగా మార్చే ప్రక్రియలో బిజీగా ఉన్న సీఎం కేసీఆర్ సార్ గురించి, హోం మంత్రి మహమూద్ ఆలీ సాబ్ గురించి అలా మాట్లాడడమేంటండీ?
ప్రియాంకారెడ్డి హత్య జరిగితే మీ సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని నిలదీయడమేంటండీ? తన రిపబ్లిక్ టీవీ ఛానల్లో తన వార్తలేవో తాను చెప్పుకోకుండా, తన అరుపులేవో మరింత గట్టిగా అరవకుండా, మధ్యలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని లైవ్ లో పట్టుకుని ఎలా పడితే అలా ప్రశ్నించడమేంటండీ?
ఏమన్నాడు? అర్నబ్ అంటారా? ఇంకేం అనాలండీ? అంటే ఫరవాలేదండీ. కానీ ఆ అరుపులేంటి? గోలేంటి? ఒక్కటీ, రెండూ కాదండీ, ఎన్నో అన్నడు. ఆర్నబ్ ఏమన్నడంటే…?
ప్రియాంకారెడ్డి దారుణ హత్యకు గురైతే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు. సీఎం కేసీఆర్ స్పందించరా? ప్రియాంక ఘటనపట్ల ఆయన సానుభూతి కూడా ప్రకటించరా? అని నిలదీశాడు. అసలు మీరేమనుకుంటున్నారు? మీ ప్రభుత్వంలో ఏదైనా నడుస్తుందని భావిస్తున్నారా? మీ ప్రభుత్వంలో ఇలాగే జరుగుతుందా? చట్టసభ నిద్రపోతోందా?జరిగిన ఘోరం గురించి అక్కడ మీరు చర్చించరా? మీ హోం మంత్రి బాధితురాలిని బద్నాం చేయడమేమిటి? సంఘటన జరిగితే కనీసం విచారం వ్యక్తం చేయకుండా, చెల్లికి ఫోన్ చేసే బదులు 100కు ఫోన్ చేస్తే అలా జరిగేది కాదని హోం మంత్రి మహమూద్ ఆలీ వ్యాఖ్యానించడమేంటి? ఇదేనా మీ ప్రభుత్వ పద్ధతి…? అంటూ అర్నబ్ గోస్వామి తన సహజ శైలిలో గుక్కతిప్పుకోకుండా ఎంపీ రంజిత్ రెడ్డిని కడిగేస్తుంటే…సారీ, అడిగేస్తుంటే ఆయన మాత్రం ఏం చేస్తారు పాపం. తన వాదనేదో తాను చేస్తూ ‘మా సీఎం ప్రస్తావన తీసుకురావద్దు’ అంటూ అర్నబ్ గోస్వామి అరుపులను నియంత్రించేందుకు విఫలయత్నం చేశారు. రిపబ్లిక్ టీవీలో ప్రసారమైన ఈ అంశపు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆర్నబ్ గోస్వామి గోల సంగతి సరే…ప్రియాంకరెడ్డి హత్యోదంతపై ఇంతగా ప్రజాగ్రహం పెల్లుబికుతుంటే తెలంగాణా సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నట్లు అని మాత్రం మళ్లీ అర్నబ్ తరహాలో ప్రశ్నించకండి. ఎందుకంటే ప్రస్తుతం సీఎం కేసీఆర్ సార్ చాలా బిజీగా ఉన్నారు. ఆర్టీసీ యూనియన్ల భరతం పట్టే దిశగా చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఆర్టీసీ యూనియన్ టీఎంయూ కార్యాలయాలకు తాళాలు కూడా బిగింపజేశారు. యూనియన్ నేతలు డ్యూటీ రిలీఫ్ పొందకుండా చర్యలు సైతం తీసుకున్నారు. థామస్ రెడ్డి వంటి యూనియన్ నాయకులు కంట్రోలర్లుగా విధుల్లో చేరారు. అశ్వత్థామరెడ్డి ఇంకా డ్యూటీలో చేరిన దాఖలాలు లేవు. యూనియన్ల వల్లే ఆర్టీసీ కార్మికుల బతుకులు బజారున పడుతున్నాయని బాహాటంగానే ప్రకటించిన సీఎం కేసీఆర్ ఈరోజు నేరుగా కార్మికులతోనే చర్చించనున్నారు. ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికుల చొప్పన తెలంగాణాలోని 97 ఆర్టీసీ డిపోల నుంచి కార్మికులను పిలిపించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ముగిసిన తర్వాత కార్మికులతో కలిసి భోజనం కూడా చేస్తారు. మొత్తంగా ఆర్టీసీ యూనియన్ల ఆనవాళ్లు కూడా లేకుండా చేసే దిశగా సీఎం తీరిక లేకుండా ఉన్నారు.
ఆర్టీసీకి చెందిన దాదాపు 50 వేల మంది కార్మికుల భవితవ్యంపై సీఎం కేసీఆర్ తీరిక లేకుండా ఉంటే మధ్యలో రిపబ్లిక్ టీవీ ఎండీ కమ్ జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామి గోలేంటండీ? ప్రియాంకారెడ్డి దారుణ హత్య గురించి కేసీఆర్ పట్టించుకోరా? స్పందించరా? అని ప్రశ్నిస్తున్నాడు. తెలుగు మీడియా పోకడలు ఆర్నబ్ గోస్వామికి బొత్తిగా ఒంటబట్టినట్లు లేవు కదూ!
-ఎడమ సమ్మిరెడ్డి