ఖమ్మం జిల్లాలో కోవిడ్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే రెమ్ డెసివిర్ ఇంజక్షన్ల కొరతను నివరించేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు.
కోవిడ్ పేషెంట్స్ కు వినియోగించే రెమ్ డెసివిర్ ఇంజక్షన్లకు కొరత లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్కరికి ఎమ్మర్పీ ధరకే అందుబాటులో ఉండాలని అధికారులకు మంత్రి పువ్వాడ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
ఇందులో భాగంగానే తాజాగా హెటిరో ఫార్మా సంస్థ అధినేత, ఖమ్మం జిల్లా వాసి బండి పార్థసారథి రెడ్డితో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సుదీర్ఘ చర్చలు జరిపారు. కోవిడ్ తీవ్రత ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉందని వాటి నివారణ కోసం జిల్లాకు సరిపడా ఇంజెక్షన్స్ ఇవ్వాలని కోరారు. అందుకు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ప్రతి రోజు పదకొండు వందల ఇంజక్షన్ ఇచ్చేందుకు పార్థసారథిరెడ్డిని ఒప్పించారు.
ఖమ్మం జిల్లాలోని 30 బెడ్స్ ఉన్న ప్రతి ప్రైవేట్ ఆసుపత్రికి నేరుగా హెటిరో డ్రగ్స్ కంపెనీ నుండి ఇవ్వనున్నారని, అంతకన్నా తక్కువ బెడ్స్ ఉన్న ఆసుపత్రులకు ఇవ్వడానికి స్టాకిస్టును ఏర్పాటు చేసి ఆయా స్టాకిస్ట్ ద్వారా మంత్రి, కలెక్టర్, టాస్క్ ఫోర్స్ ప్రభుత్వ పర్యవేక్షణలో చిన్న ఆసుపత్రులకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్స్ అందించనున్నారు.
ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పది వేల ఇంజెక్షన్స్ ఇస్తుండగా, వాటికి అదనంగా మరో పదకొండు వందల ఇంజక్షన్లు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఇవ్వనున్నారు. అందువల్ల ప్రజాలెవరు కూడా ఆందోళన చెంది అధిక ధరలకు రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.
ఎవరైనా ఆసుపత్రుల, సిబ్బంది అధిక ధరలకు రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు అమ్మితే మంత్రికి గాని, జిల్లా కలెక్టర్ కార్యాలయం (1077), అర్బన్ తహసీల్దార్ (9849906095) కు కానీ, డయల్ 100 ద్వారా పోలీసులకు గాని ఫిర్యాదు చేయాలని మంత్రి కోరారు.
ఇక జిల్లాలో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్స్ కొరత ఉండబోదని, ఎవరైనా వీటిని అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పువ్వాడ హెచ్చరించారు.