కార్పోరేషన్లలో, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో కూడా సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.
కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వరంగల్ కార్పోరేషన్ లో విలీనమైన గ్రామాల్లో కూడా సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కీసీఆర్ రాష్ట్రంలోని అన్ని మున్సిలిపాలిటీల, కార్పొరేషన్ల పరిధిలోని విలీన గ్రామాల్లో సాదాబైనామాలతో జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి ఆదేశాలు జారీ చేశారు.