‘నీ కాల్మొక్త…బాంచెన్…జెర…నా జోలికి రాకు’ అని ఓ భూస్వామి అభ్యర్థిస్తే ఎలా ఉంటుంది?
‘అరె..నీ దండం బెడ్తర బయ్..నా జోలికి ఎందుకొస్తున్నవ్?’ అంటూ మరో దొర లేదా పటేల్ వేడుకుంటే ఏమనిపిస్తుంది?
ఎక్కడో ఏదో తేడా కొట్టింది…అందుకే ఈ అనివార్య మార్పు కాబోలు… అనిపిస్తుంది కదూ?
భూస్వామ్య, ఫ్యూడలిస్టు దొరల భావాలతో సంబంధం ఉన్నా, లేకపోయినా, రెడ్ టేపిజం (కాలయాపన), అవినీతికి మారుపేరుగా ప్రాచుర్యం పొందిన రెవెన్యూ అధికారుల తాజా వేడుకోలు మాత్రం అచ్చంగా ఈ తరహా భావనలనే ఆవిష్కరిస్తున్నది.
‘మీకు దండం బెడ్తం…మాపై దాడులు చేయొద్దు‘ అని రెవెన్యూ అధికార వర్గాలు ప్రజలను వేడుకుంటున్న దృశ్యం తెలంగాణాలో కనిపిస్తోంది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటన నిర్దంద్వంగా ఖండించే ఘటనే… అయినప్పటికీ, ఈ ఉదంతం మాత్రం రెవెన్యూశాఖ ఉద్యోగుల్లో ఎక్కడా లేని ప్రాణభయానికి కారణమైనట్లు కనిపిస్తోంది. వివిధ పనుల కోసం తమ కార్యాలయాలకు వచ్చే ప్రజలను పీల్చుకు తింటారని ప్రాచుర్యం పొందిన రెవెన్యూ అధికారులు ప్రాణభయంతో ప్రస్తుతం చేస్తున్న వేడుకోలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘రెవెన్యూ ఉద్యోగుల తరపున చేతులెత్తి వేడుకుంటున్నాం. అధికారులపై దాడులు చేయొద్దు. సజీవ దహనం వంటి చర్యలకు పాల్పడవద్దు‘ అని డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమోహన్ ప్రజలను అభ్యర్థించడం విశేషం. తహశీల్దార్ విజయారెడ్డి ఉదంతంలో మరణించిన డ్రైవర్ గుర్నాథం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సందర్భంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండలో ఆయన ప్రజలకు ఈ అభ్యర్థన చేశారు. ‘రెవెన్యూ అధికారులు తప్పు చేస్తే ఆర్డీవో, జేసీ, కలెక్టర్ వంటి ఉన్నతాధికారులకేగాక మంత్రుల దృష్టికి తీసుకువెళ్లాలని చంద్రమోహన్ కోరారు. అంతే తప్ప అవేశాలకు లోనై దాడులు, సజీవ దహనాలకు పాల్పడి తమ కుటుంబాలను బజారున పడేయవద్దని ప్రజలను వేడుకున్నారు. ప్రజలు కట్టే పన్నుల ద్వారానే తాము వేతనాలు పొందుతున్నట్లు కూడా చంద్రమోహన్ ఈ సందర్భంగా అంగీకరించారు. ప్రజలకు తాము శత్రువులం కాదని, రెవెన్యూ చట్టాల్లో ఉన్నటువంటి సుదీర్ఘ అంశాల కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తాముపొరపాట్లు చేస్తే తమ దృష్టికి తీసుకువచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని, అనాలోచిత నిర్ణయాలకు పాల్పడవద్దని అభ్యర్థించారు.
అయితే రెవెన్యూ అధికారవర్గాల్లో వచ్చిన ఈ మార్పు ఆశాఖ పనితీరుపై గుండె లోతుల్లోనుంచి వచ్చిందేనా? ప్రాణ భయంతో అనివార్యమైందా? అనే ప్రశ్నలు ప్రజల నుంచి తలెత్తుతున్నాయి. తాము తప్పు చేస్తే ఉన్నతాధికారుల, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నారే తప్ప, ఇక తప్పులు చేయబోమని ఎందుకు ప్రకటించడం లేదనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విజయారెడ్డి సజీవదహనం ఘటన నేపథ్యంలో సానుభూతి కంటే, ప్రజల నుంచి అక్రోశం పాళ్లనే ఎక్కువగా చవి చూసిన రెవెన్యూశాఖ ప్రస్తుత వేడుకోలుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల అవసరాలు తీర్చడంలో, వారికి సేవ చేయడంలో రెవెన్యూ అధికారుల్లో, సిబ్బందిలో ఆశించిన మార్పు రావాలే తప్ప, ప్రాణ భయంతో చేసే అభ్యర్థన అసలు సమస్య పరిష్కారానికి మార్గం చూపదనే వాదనలూ ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. వేధింపులు, అవినీతికి తావు లేకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తే ఈ తరహా వేడుకోలు అవసరమే ఉండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.