కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది? మానవాళిని ఎలా కబలిస్తుంది? సామాజిక దూరం పాటింకపోవడం వల్లనో, మూతికి మాస్కు ధరించకపోవడం వల్లనో, చేతులకు శానిటైజర్ పూసుకోకపోవడం వల్లనో అనే సమాధానాలు రావడం సహజం. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా ఎలా సోకిందో తెలియడం లేదనే వాదనలను పలు ఘటనల్లో చూస్తూనే ఉన్నాం, వింటున్నాం కూడా. కానీ..,
పైన గల ఫొటోను నిశితంగా పరిశీలించండి. ఓ టేబుల్ చుట్టూ పది మంది మాస్కులు ధరించి మరీ ఎంచక్కా కుర్చీలు వేసుకుని కూర్చున్నారు కదూ! చిత్రంలో పోలీసులు కూడా ఉన్నారు. ఏంటి ‘కత’ అంటే…? కుర్చీల్లో ఆసీనులైన సార్లందరూ జూదప్రియులు. అదేనండీ పత్తాలాటలో వీరులన్నమాట. ఖమ్మం నగరంలో విష్ణు హోటల్లో వీళ్లందరూ హాయిగా చతుర్ముఖ పారాయణంలో నిమగ్నమై, ఎంజాయ్ చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఉప్పందింది.
ఇంకేముంది? టాస్క్ ఫోర్స్ పోలీసులు హోటల్ పై కొద్దిసేపటి క్రితం దాడి చేశారు. పేకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 55,480 నగదు, ఎనిమిది సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. హోటల్లో పత్తాలాట, పోలీసుల దాడి ఘటన సంగతి ఎలా ఉన్నప్పటికీ, జూదక్రీడలో ‘ముక్కలు’ కలిపే ప్రక్రియలో కరోనా కూడా ఓ ఆటాడితే? ఈ సంగతి జూదప్రియులకు సరిగ్గా బోధపడినట్లు లేదు. ఎంచక్కా కరోనాకు ‘రెడ్ కార్పెట్’ పరిచినట్లు లేదూ… ఈ పత్తాలాట సీన్?
ఈ ముక్కలాటలో ఎవరైనా షో చేసేసరికి ఆటలో గల వారికి లైఫ్ కార్డ్ వస్తుందో రాదోగాని, కరోనా అంటుకుంటే మాత్రం ‘లైఫ్ ఎండ్… అండ్ డెత్’… తప్పదేమో మరి! ఎందుకంటే ఆ మధ్య విజయవాడ నగరంలో ఇటువంటి జూద క్రీడల వల్లే పలువురికి కరోనా అంటుకుంది. అదీ సంగతి.