అశ్వత్థామరెడ్డి…గుర్తున్నాడు కదా? ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేత, టీఎంయూ నాయకుడు. ఇప్పట్లో మర్చిపోయే ఆర్టీసీ కార్మిక సంఘాల లీడర్ కాకపోయినప్పటికీ, ఆర్టీసీ సమ్మె ముగిశాక అశ్వత్థామరెడ్డికి సంబంధించిన వార్తల ప్రాధాన్యత కూడా తగ్గిందనే చెప్పాలి. ఇదిగో ఈ అశ్వత్థామరెడ్డి ఉద్యోగ పరంగా ఆర్టీసీ డ్రైవరే. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత తెలిసిన పక్కా సమాచారమే. హైదరాబాద్ నగరంలోని ఏదో డిపోలో అశ్వత్థామరెడ్డి అచ్చంగా డ్రైవరే. ఈ సాధారణ డ్రైవర్ అతిపెద్ద యూనియన్ నాయకునిగా ఎదగడానికి చేయూతనిచ్చింది కూడా గౌరవనీయ తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. (అశ్వత్థాముని గురించి కేసీఆర్ చేసిన ప్రంసగాల సాక్షిగా)
మొక్కగా పెంచిన అశ్వత్థామరెడ్డి ‘మాను’గా ఎదిగాక, పండగ పూట ఆర్టీసీ సమ్మె చేస్తారా? ఆయ్…అంటూ గుడ్లురిమిన కేసీఆర్ ఆ తర్వాత అనేక చర్యలు చేపట్టిన సంగతి కూడా తెలిసిందే. కోర్టు ఏం చెప్తది? కొడ్తదా? సంకల సంస్కాన ఉంటేనే గదా? ఇచ్చేది? అంటూ చివరికి ధర్మాసనాలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే. ఆర్టీసీలో అసలు యూనియన్లే ఉండరాదని, వీటి వల్లనే కార్మికులు చెడిపోతున్నారని తేల్చిన సంగతీ తెలిసిందే. ఆర్టీసీ చరిత్రలోనే 55 రోజులపాటు సమ్మె జరిగిన పరిణామాల మధ్య, కార్మిక కుటుంబాల పట్ల దయతలచిన కేసీఆర్ వారి ఉద్యోగాలు వారికి తిరిగి ఇవ్వడమేగాక అనేక తాయిలాలు కూడా ప్రకటించారు. అనంతరం డిపోకు ఐదుగురు కార్మికులను ప్రగతి భవన్ కు పిలిపించుకుని కడుపునిండా భోజనం పెట్టి సంతోషపరిచారు. ఇవన్నీ పాత సంగతులే కదా? అనుకుంటున్నారా? ఓ కొత్త విషయాన్ని చెప్పే ముందు కాస్త పాత సంగతులను కూడా వల్లె వేయక తప్పదు.
ఇక అసలు విషయానిక వద్దాం. ఆర్టీసీ సమ్మె ముగిశాక గుర్తింపు యూనియన్ ఆఫీసులకు తాళాలు బిగించడం, యూనియన్ లీటర్లకు డ్యూటీ రిలీఫ్ రద్దు వంటి పరిణామాల్లో థామస్ రెడ్డి, రాజిరెడ్డి వంటి నాయకులు విధుల్లో కూడా చేరారు. కానీ అసలు నేత, అంటే ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ లీడర్ అశ్వత్థామరెడ్డి మాత్రం ఇంకా బస్సు ఎక్కి స్టీరింగ్ పట్టుకోలేదు. కానీ తనకు ఆరు నెలలపాటు సెలవు కావాలంటూ అశ్వత్థామరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి వచ్చే మే నెల 5వ తేదీ వరకు తనకు సెలవు మంజూరు చేయాలని ఈనెల 5వ తేదీనే ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అయితే అశ్వత్థామరెడ్డికి ఆరు నెలలపాటు సెలవు ఇవ్వడానికి ఆర్టీసీ యాజమాన్యం నిరాకరించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర సంక్షోభంలోఉందని, ప్రతి ఉద్యోగి తప్పకుండా విధులు నిర్వహించాల్సిన అవసరముందని వెల్లడిస్తూ సెలవు దరఖాస్తును ఆర్టీసీ యాజమాన్యం నిరాకరించినట్లు తాజా వార్తల సారాంశం. అయితే అశ్వత్థామరెడ్డి సెలవు దరఖాస్తును అధికారికంగా ఇంకా తిరస్కరించలేదని, సెలవు ఇచ్చే ఉద్దేశంలో మాత్రం సంస్థకు లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఓకే… అశ్వత్థామరెడ్డి సెలవు దరఖాస్తును ఆర్టీసీ యాజమాన్యం తిరస్కరించిందా? లేక సెలవు ఇచ్చే ఉద్దేశం ఆర్టీసీ పరిణామాలను స్వీయ పర్యవేక్షణ చేస్తున్న సీఎం కేసీఆర్ కే లేదా? అనే ప్రశ్నలను కాసేపు వదిలేద్దాం. దరఖాస్తును తిరస్కరించినా, సెలవు ఇచ్చే ఉద్దేశం లేకపోయినా, రెండింటి అర్థం, పరమార్థం మాత్రం ఒక్కటేనట…అదేమిటంటే, అశ్వత్థామరెడ్డి ద్వారా ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టించాల్సిందే. ఇదీ సర్కారు లోని కొందరు పెద్దల అసలు లక్ష్యంగా కనిపిస్తోందనేది ఆర్టీసీ ఉద్యోగ వర్గాల వాదన, అశ్వత్థామరెడ్డి బస్సు నడిపినంత మాత్రాన ఆర్టీసీ నష్టాల బారి నుంచి తేరుకుని, లాభాల బాటలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో రివ్వున దూసుకుపోతుందా? అనే సంశయం కూడా సహజమే. అది కాదట అసలు లక్ష్యం. అశ్వత్థామరెడ్డికి సెలవు మంజూరు చేసినంత మాత్రాన ఆర్టీసీకి ప్రత్యేకంగా వచ్చే నష్టం కూడా ఏమీ లేకపోవచ్చు. కానీ సమ్మె ముగిసినా, కేసీఆర్ మనసు మారినా, ఆర్టీసీ ఉద్యోగులు సీఎం వైఖరికి మురిసిపోయి చప్పట్లు కొడుతున్నా, అశ్వత్థామరెడ్డి వైఖరిలో మాత్రం మార్పు వచ్చినట్లేమీ కనిపించడం లేదట. ఎందుకంటే ఆర్టీసీ బతికి ఉంటే యూనియన్లు ఉండాల్సిందేనని, గుర్తింపు సంఘం ఎన్నికలు కూడా నిర్వహించాలని అశ్వత్థామరెడ్డి ఇప్పటికీ పట్టుబడుతున్నారు. మీడియాతో మాట్లాడుతూ ప్రకటనలు సైతం చేస్తున్నారు. అసలు యూనియన్లే ఆర్టీసీ ఉద్యోగులను నష్టపరుస్తున్నాయని కదా? సీఎం కేసీఆర్ వాదన.
ఈ నేపథ్యంలోనే అశ్వత్థామరెడ్డి ఆరు నెలల సెలవుపై సర్కారు పెద్దలు తీవ్రంగా యోచించినట్లు తెలుస్తోంది. సెలవు మంజూరు చేస్తే జరిగే పరిణామాలపై మేథోమథనం చేసినట్లు సమాచారం. ఓ మనిషికి పూర్తిగా ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తాడు? ఏదో ఒక ఆలోచన చేస్తాడు కదా? ఆర్టీసీ సమ్మె ద్వారా 55 రోజులపాటు అనేక మందికి కంటిమీద కునుకు లేకుండా చేసిన అశ్వత్థామరెడ్డి వంటి కార్మిక సంఘ నేతకు ఆరు నెలలపాటు సెలవు రూపంలో ఖాళీ దొరికితే? ఏ కోదండరాం తోనో, మరే చాడా వెంకటరెడ్డితోనో మంతనాలు సాగిస్తాడు కదా? ఆర్టీసీలో యూనియన్ల ఉనికి గురించి లోతైన చర్చలు, విశ్లేషణలు చేస్తాడు. విపక్ష నేతల మద్దతు సమీకరిస్తాడు. ఇటువంటి ఎన్నో పథక రచనలు చేస్తాడు. ఇటువంటి ఏ అవకాశం అశ్వత్థామరెడ్డికి లభించకూడదు. అబ్బే… ఆర్టీసీ సమ్మె విషయంలో ఇంత జరిగాక, కేసీఆర్ వైఖరేమిటో బట్టబయలయ్యాక, ఇంకా అశ్వత్థామరెడ్డి చేసేదేముంటుంది? అని తీసి పారేయకండి. ఆర్టీసీ యూనియన్ల ఆనవాళ్లు కూడా కనిపించకూడదనే లక్ష్యం దెబ్బ తినకుండా, అశ్వత్థామరెడ్డికి ‘వీలు’ చిక్కకూడదు. ఆయన స్టీరింగ్ పట్టాల్సిందే? ఆర్టీసీ బస్సు నడపాల్సిందే… ఇదే అసలు టార్గెట్. అయితే బస్సు నడపాల్సిన ‘ఆర్థిక’ అవసరం అశ్వత్థామరెడ్డికి ఉందా? తన సెలవు విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించే అవకాశం లేదా? వంటి ప్రశ్నలకు ప్రస్తుతానికైతే సమాధానం లేదు. ఇప్పటికింతే.