రవి ప్రకాష్.. తెలుగు మీడియా రంగంలో పెద్దగా పరిచయం అక్కరలేని ప్రముఖ జర్నలిస్టు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి. టీవీ9 లోగో వివాదం, కోర్టు కేసులు తదితర అంశాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, మీడియాలో రవి ప్రకాష్ పోషించిన పాత్రను ఎవరూ కాదనలేనిది. అటువంటి రవి ప్రకాష్ ఆధ్వర్యంలో వస్తున్నట్లు ప్రాచుర్యంలో గల ఓ న్యూస్ ఛానల్ అంటే ఎలా ఉండాలి? రవి ప్రకాష్ అనే పేరు బ్రాండ్ పై వస్తున్నట్లు చెప్పుకుంటున్న ఆ న్యూస్ ఛానల్ ప్రస్తుతానికైతే యూ ట్యూబ్ కు మాత్రమే పరిమితం. త్వరలోనే శాటిలైట్ ఛానల్ గా మారుతుందని అందులో పనిచేసే ఉద్యోగ వర్గాలు పబ్లిసిటీ చేస్తున్నాయి. మరి రవి ప్రకాష్ ఛానల్ అంటే దాని విశ్వసనీయత ఎలా ఉండాలి? జనంలోకి ఛానల్ వెళ్లాలంటే ఆదిలోనే తప్పటడుగులు వేస్తే వీక్షకుల నుంచి లభించే ఆదరణ ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నీ దేనికంటే..?

ఈ దృశ్యాన్ని నిశితంగా చూడండి.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కనిపిస్తున్నారు కదా?  ఆ పక్కనే చూడండి.. వీళ్లెవరూ అనుకుంటున్నారా? ఒకతను పిడమర్తి రవి.. తెలంగాణా ఉద్యమకారుడు, సత్తుపల్లి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీచేసిన లీడర్. అతని పక్కనే కళ్లద్దాలతో కనిపిస్తున్న వ్యక్తి పేరు డాక్టర్ కోట రాంబాబు.. ఇతను కూడా గత ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిత్వంతో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పిడమర్తి రవితోపాటు డాక్టర్ కోట రాంబాబు ప్రస్తుతం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శిబిరంలో ఉన్నారు. ఈ ఫొటోను చూపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శిబిరంలో చీలక? పొంగులేటికి అనుచరుల గుడ్ బై? అంటూ రవి ప్రకాష్ యూ ట్యూబ్ ఛానల్ లో యాంకర్ అధ్దిరిపోయే వాయిస్ తో యాంకరింగ్ చేశారు. ఫొటో చెబుతున్న సీన్ అదే కదా? అనుకుంటే మీరూ పప్పులో కాలేసినట్టే.

ఇప్పుడు ఈ దృశ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అదే పొటోలో మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నాయకుడు బాలసాని లక్ష్మినారాయణ కూడా ఉన్నారు. అదే సీన్లో కిరణ్ కుమార్ రెడ్డి పక్కన లాల్చీ పైజామాతో మరో వ్యక్తి కూడా ఉన్నారు. విషయం అర్థమైంది కదా? రవి ప్రకాష్ బ్రాండ్ తో జనాల్లోకి వెళ్లాల్సిన ఈ ఛానల్ ప్రస్తుతానికి యూ ట్యూబ్ కే తన ప్రసారాలను పరిమితం చేసింది. శాటిలైట్ గా మారకముందే ఇటువంటి నాసిరకం కథనాలతో రవి ప్రకాష్ ఛానల్ ఎలా జనాదరణ పొందుతుందనే సందేహాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఏంటండీ రవి ప్రకాష్ గారూ.. ఈ పధ్ధతి? అని పొంగులేటి వర్గీయులు అసహనంతో ప్రశ్నిస్తున్నారు. అయినా మేం ఇటువంటి సంచలన కథనాలతోనే జనాలను ఆకట్టుకుంటాం.. అంటే మాత్రం చేయగలిగేమీ లేదని పొంగులేటి వర్గీయులు పెదవి విరుస్తున్నారు.

ఇంతకీ ఆ ఫొటో ఎక్కడిదంటారా? దాదాపు ఏడాది క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు ఎంగేజ్మెంట్ సందర్భంగా హైదరాబాద్ లోని ఆయన నివాసంలోని దృశ్యమట.  ఇదే విషయాన్ని డాక్టర్ కోట రాంబాబు చెబుతూ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, మధిర నియోజకవర్గ ప్రజలు నమ్మవద్దని ఓ ప్రకటన విడుదల చేశారు. అదీ అసలు సంగతి.

Comments are closed.

Exit mobile version