ఒకరు భౌతికంగా కనుమరుగయ్యారు. ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగి 24 గంటలు కూడా పూర్తి కాలేదు. నిజానికి ఆ విషాదం నుండి ఆ కుటుంబ సభ్యులు ఇంకా పూర్తిగా తేరుకోలేదు. అదే ఇంటిలో, అదే కుటుంబానికి చెందిన ఒకరు తుది శ్వాస విడిచిన గదిలోనే… అమరుడైన మరో కమ్యూనిస్టు విప్లవ యోధుడికి సంతాప సమావేశం జరపడం ఒక అరుదైన సన్నివేశమే అవుతుందేమో మరి!
ఔను… ఆ కుటుంబ సభ్యుల కళ్ళు అప్పటివరకు కన్నీళ్లు కార్చి కార్చి ఇంకిపోయాయి. అయినా మరోసారి మరో యోధుడి కోసం మళ్లీ వాళ్ల కళ్లు చెమర్చడం కూడా ఓ విశిష్టమైనదే కాబోలు!
ఆయా సన్నివేశం ఈరోజు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని దివిసీమ ఏరియాలోగల దింటిమేరకలోని చల్లపల్లి శ్రీనివాసరావు ఇంటివద్ద చోటు చేసుకుంది. ఇది మరో విప్లవ పోరాటయోధుడు జస్వంత్ మృతి పట్ల జరిగిన సంతాప సమావేశం కావడం గమనార్హం.
చల్లపల్లి శ్రీనివాసరావు ముగ్గురు కుమార్తెలు డాక్టర్ శాంతి, లీల, రాణి, ఇద్దరు కొడుకులు పెద్దబాబు, చినబాబు, చిన్న కోడలు కరుణ పాల్గొన్నారు. ఇద్దరు అల్లుళ్ళు అప్పారావు, డాక్టర్ పట్టాభి కూడా ఉన్నారు. సీపీఐ ఎం.ఎల్. న్యూ డేమాక్రసీ పార్టీ ఆ ప్రాంత నాయకులు రామలింగయ్య, ఈశ్వరయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దివాకర్, ఇఫ్టూ ప్రసాద్ తదితరులు ఈ సంతాప కార్యక్రమంలో పాల్గొన్నాము.
తమ తండ్రి మరణం వల్ల గుండెల నిండా విషాదంతో తల్లడిల్లే సమయంలో కూడా మరో విప్లవయోధుడి మరణ వార్తకు స్పందించి, సంతాప సమావేశంలో తడి హృదయాలతో పాల్గొనడం అమరత్వపు రాజకీయ ఔన్నత్యాన్ని చాటి చెబుతోన్న విశేషంగా పలువురు అభివర్ణిస్తున్నారు.