జర్నలిజపు అధ్యాయంలో ఇది అదనపు క్రెడిట్. సాక్షి పత్రిక ఎడిటర్ వర్దెల్లి మురళీ గౌడ్ కు లభించిన అరుదైన సత్కారం కూడా. ఒకే ఘటనకు సంబంధించి ఒకేరోజు ప్రచురించిన వార్తకు రెండు పత్రికలు ‘క్రెడిట్’ తీసుకోవడం విశేషం కాగా, మరో పత్రిక ముఖ్య ఉద్యోగి అదనంగా ‘సత్కారం’ అందుకోవడం అత్యంత ఆసక్తికరం. జర్నలిజంలో అంతే… ఎవరైనా, ఏ విధంగానైనా క్రెడిట్ తీసుకోవచ్చు. ఒక్కోసారి విషయాన్ని ముందు వెలుగులోకి తీసుకువచ్చిన విలేకరికంటే, ఫాలో అప్ స్టోరీ రాసి క్రెడిట్ కొట్టేసే జర్నలిస్టులు చాలా మంది ఉంటుంటారు. కాకపోతే నాలుగైదు పత్రికలు తిరగేసి వార్తను కిచిడీ చేసి, చాంతాడంత రాసేసి, తామే పే…ద్దగా ప్రచురించాం కాబట్టి, క్రెడిట్ కూడా తమదేనని జబ్బలు చరుచుకుంటుంటారు. ఇంకొందరు జర్నలిస్టులైతే సహచర విలేకరికి క్రెడిట్ దక్కడాన్ని జీర్ణించుకోలేక, ఈర్ష్యను సైతం ప్రదర్శిస్తుంటారు. అబ్బే… అందులో ఏదో మతలబు ఉందండీ, అందుకే అతను వార్త రాశాడండూ ఉదయాన్నే సదరు ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి వద్దకు వెళ్లి మరీ ‘భజన’ చేస్తుంటారు. ఈ ఉపోద్ఘాతానికీ, చెప్పబోయే అసలు విషయానికి సంబంధం లేదనుకోండి. యాధృచ్చికమో, కాకతాళీయమో తెలియదుగాను ఒకేరోజు ప్రచురించి ఓ వార్తాకథనపు ఘనత తమదంటే తమదేనని, ఓవైపు ఆంధ్రజ్యోతి, ఇంకోవైపు సాక్షి పత్రికలు ‘ఎఫెక్ట్’ను సొంతం చేసుకున్నాయి.
ఇక అసలు విషయంలోకి వెడితే… కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని బూరుగిద్ద అనే గ్రామాన్నే ఏకంగా రియల్టర్ ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, ఫలితంగా గ్రామంలో గల 19 కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయనేది అసలు వార్తా కథనపు సారాంశం. ఈ వ్యవహారానికి సంబంధించి ఈనెల 21వ తేదీన వేర్వేరు శీర్షికలతో ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు వార్తా కథనాలను ప్రచురించాయి. బాధితుల పక్షాన నిలుస్తూ ఈ రెండు పత్రికలు వార్తా కథనాలను ప్రచురించడం సంతోషకరమే. విషయం బహిర్గతమయ్యాక ప్రభుత్వ అధికారులు తమ డ్యూటీ తాము చేశారు. జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజాప్రతినిధులు కూడా గ్రామాన్ని సందర్శించారు. బాధితులకు పొజిషన్ సర్టిఫికెట్లను అధికారులు అందజేశారని, ఆరోపణలు ఎదుర్కున్న రియల్టర్ స్వచ్ఛందంగా తన రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నాడని ఈనెల 23న ఆంధ్రజ్యోతి పత్రిక మరో వార్తా కథనాన్ని ప్రచురించింది.
ఆంధ్రజ్యోతి పత్రిక చేసిన మేలును తాము మరువబోమని గ్రామస్తులు భావోద్వేగానికి గురైనట్లు కూడా ఆంధ్రజ్యోతి తన ‘ఎఫెక్ట్’ కథనంగా ప్రకటించుకుంది. ఆంధ్రజ్యోతి కథనంతో ఊరికి మేలు జరిగిందని, తాము జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని గ్రామస్తులు భావోద్వేగంతో చెప్పినట్లు కూడా ఆ పత్రిక ప్రకటించింది. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దయిందని, బూరుగిద్ద గ్రామస్తులకు న్యాయం జరిగిందని సాక్షి కూడా ఈనెల 23నే ‘క్రెడిట్’ కథనాన్ని ప్రచురించింది. కాకపోతే గ్రామాన్ని అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తుల రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు తహశీల్దార్ తెలిపారని, సాక్షి తమను ఆదుకుందని, తమకు అండగా ఉన్న సాక్షికి జీవితాంతం రుణపడి ఉంటామని గ్రామస్తులు చెప్పినట్లు ఆ పత్రిక ప్రకటించింది.
బూరుగిద్ద గ్రామాస్తులకు జరిగిన అన్యాయంపై అటు ఆంధ్రజ్యోతి, ఇటు సాక్షి పత్రికలు ఒకేరోజు వార్తాకథనాన్ని ప్రచురించి, ఆ తదుపరి క్రెడిట్ ను కూడా సమాంతరంగా సొంతం చేసుకున్నాయి. కాకపోతే ఈ ఎపిసోడ్ లో ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ వర్దెల్లి మురళి గౌడ్ కు శాలువా, బొకేల సత్కారం అదనంగా లభించినట్లు ఆ పత్రిక ప్రచురించిన వార్తా కథనంలోని ఫొటో స్పష్టం చేస్తోంది. తమ గ్రామాాన్ని కబ్జాదారులపరం కాకుండా కాపాడారంటూ బూరుగిద్ద గ్రామస్తులు కొందరు హైదరాబాద్ కు తరలివెళ్లి సాక్షి ప్రధాన కార్యాలయానికి చేరుకుని ఎడిటర్ వర్దెల్లి మురళి గౌడ్ ను కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారుట. ‘ మీవల్లే మా ఊరు నిలిచింది… గెలిచింది.. థ్యాంక్యూ సాక్షి’ అంటూ రెండు చేతులా దండం పెట్టి మరీ ధన్యవాదాలు తెలిపారుట. ఇది సాక్షి పత్రిక తరపున దాని ఎడిటర్ మురళీ గౌడ్ కు లభించిన అదనపు సత్కారం. వార్తా కథనాల ‘క్రెడిట్’లో ఇది కొత్తకోణం. కానీ ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఫీల్డ్ వర్క్ చేసి కలమెత్తిన వీరుడెవ్వరు? అని మాత్రం ప్రశ్నించకండి. ఎందుకంటే… ఈ వార్తను రాసిన స్థానిక విలేకరికి గ్రామస్తులు శాలువా కప్పకపోయినా ఫరవాలేదు, కనీసం ధన్యవాదాలైనా తెలిపారో లేదో మాత్రం తెలియదు. సాక్షి పత్రిక ప్రచురించిన వార్తా కథనాల్లో ఎక్కడా ఆ విలేకరి పేరు ప్రస్తావన కూడా లేకపోవడం గమనార్హం.