‘అవసరమైతై మళ్లీ మర చెంబు, తట్ట, రబ్బర్ చెప్పులతో గుజరాత్ కు వెళ్లిపోతా…కానీ మీ అణచివేతకు భయపడి తల దించేది లేదు…మీతో రాజీపడే ప్రసక్తే లేదు…రాతలు మార్చే అవసరమే రాదు…’ ఇదీ జర్నలిజంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ వ్యవస్థాపకుడు రామ్ నాథ్ గోయెంకా మొండితనం. జనహితం కోసం ఆయన ఎంచుకున్న అభిమతం. పత్రికా రంగంలో తాను నమ్మిన సిద్ధాంతాల కోసమే తపన తప్ప, పాలకుల ప్రయోజనాలకు ఊడిగం చేసే జర్నలిజానికి గోయెంకా చాలా దూరం. ఎంత మొండి ఘటమంటే ఎమర్జెన్సీ కాలంలో ప్రధాని ఇందిరాగాంధీని ఎదిరించిన జర్నలిజపు ధీరత్వం. ఆటంకాలు ఎన్ని కల్పించినా జనహితం కోసం పోరాడడమే తెలిసిన వీరత్వం. తన పత్రికకు చెందిన ఎడిషన్లకు న్యూస్ ప్రింట్ రాకుండా సముద్ర పోర్టుల్లో అధికార గణం చేత పాలకులు ఎన్ని ఇబ్బందుకు గురి చేసినా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) విభాగం ద్వారా దాడులు చేయించినా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం గోయెంకా సొంతం. అరుణ్ శౌరీ వంటి పాత్రికేయులు రొమ్ము విరుచుకుని తమ కలాలను ఝుళిపించిన ధైర్యం కల్పించిన పత్రికా యజమాని ఆయన. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే…?
అధికారం చేజారాక పత్రికా స్వేచ్ఛ గురించి కొందరు ప్రముఖ నేతల వైఖరిలో వచ్చిన మార్పును చూశాక…. అధికారంలో ఉన్నపుడు అణచివేసిన తత్వం అండగా ఉంటామని ప్రకటన చేశాక… రామ్ నాథ్ గోయెంకా గుర్తుకు రాకుండా ఉండరు మరి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీడియాకు అండగా ఉంటానని తాజాగా ప్రకటించడం ఇక్కడ విశేషం. జగన్ ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తోందని తణుకులో నిర్వహించిన టీడీపీ సమావేశంలో చంద్రబాబు ఆరోపించినట్లు వార్తా కథనాల సారాంశం. పత్రికా స్వేచ్ఛ అంశంలో ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ, జనహితాన్ని కోరుకునే జర్నలిజం ప్రస్తుతం ఉందా? అని సీనియర్ జర్నలిస్టులు అనేక మంది నిలదీస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మీడియాకు అంటిన రంగులను ఉటంకిస్తున్నారు. యెల్లో మీడియా (టీడీపీ అనుకూలం), పింక్ మీడియా (టీఆర్ఎస్ అనుకూలం), బ్లూ మీడియా (వైఎస్ఆర్ సీపీ అనుకూలం), కాషాయ మీడియా (బీజేపీ అనుకూలం)గా పేరు తెచ్చుకున్న అనేక పత్రికలు, న్యూస్ ఛానళ్ల రాతలు, వార్తల ప్రసారాల తీరుపై భిన్నాభిప్రాయాలు ఎలాగూ ఉన్నాయి.
వర్తమాన మీడియా రాతల్లో ప్రజా ప్రయోజనం శాతం సంగతి ఎలా ఉన్నా, యాజమాన్య ప్రయోజనాలే ప్రస్తుత కలర్ ఫుల్ మీడియాలో పెరిగిపోవడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఏపీలో సాధారణ ఎన్నికలకు ముందు చంద్రబాబుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకష్ణల మధ్య గల సాన్నిహిత్యం, ప్రభుత్వ ఉద్యోగుల అంశంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోలు తెలుగు రాష్ట్రాల్లోనేకాదు…జాతీయ స్థాయిలో వైరల్ గా మారాయి. అదేవిధంగా ఎలక్ట్రానికి మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా తన వీరాభిమానులు అభివర్ణించిన టీవీ9 వ్యవస్థాపకుడు రవి ప్రకాష్ పై వచ్చిన అరోపణలు, కేసులు తదితర వ్యవహారాలు ఇంకా పూర్తి స్థాయిలో సద్ధుమణగలేదు. రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తామని ప్రకటించిన కేసీఆర్ సీఎం అయ్యాక రామోజీ ఫిలింసిటీని సందర్శించి అద్భుత కట్టడమంటూ ప్రశంసల వర్షం కురిపించిన విషయమూ విదితమే. జాకెట్ యాడ్ల కోసమో, మరో ప్రయోజనం కోసమే మీడియా టైకూన్లు, పెద్ద పెద్ద జర్నలిస్టులు పాలకుల ప్రయోజనాలకు అనుగుణంగా చేతులు కట్టుకుని రాస్తున్నరాతలు ప్రజలకు తెలియనివీ కావు. పోరాటా యోధులుగా ప్రాచుర్యం పొందిన ఫేమస్ జర్నలిస్టులూ మీడియా అణచివేతకు సంబంధించి వెలువడుతున్న ప్రభుత్వ జీవోలను పొగుడుతూ స్టేట్ మెంట్లు ఇస్తున్న వర్తమాన దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి.
అసలు విషయమేమిటంటే తాము అధికారంలో ఉన్నపుడు పత్రికా స్వేచ్ఛ, అణచివేత, ఉక్కుపాదం, అండ వంటి పదాలు రాజకీయ నాయకులకు గుర్తుకు రాకపోవడమే. అధికారం కోల్పోయాక గాని మీడియా అవసరం వారికి గుర్తుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. తాము అధికారంలో ఉండగా కొన్ని పత్రికలను తమ సమావేశాలకు పిలవకుండా నిషేధించి, ఛానళ్ల ప్రసారాలను కట్ చేయించి, కొందరు జర్నలిస్టుల ఉద్యోగాలను ఊడగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కున్న నాయకులే అధికారం పోయాక అండగా ఉంటామని ప్రకటించడమే అసలు విషాదంగా జర్నలిస్టు సర్కిళ్లు అభివర్ణిస్తున్నాయి. అయినా ఇప్పడు మీడియాలో రామ్ నాథ్ గోయెంకాలు ఎవరూ లేరు…దాదాపు అందరూ పాలకుల జాకెట్ యాడ్లు, ప్యాకేజీల కోసం అర్రులు చాచేవారే…అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు.
కొసమెరుపు ఏమిటంటే…తెలుగు రాష్ట్రాల్లోని రెండు సంస్థలు నయా పైసా ఖర్చు లేకుండా లాభాల్లో తమ పత్రికలను నడుపుతున్నాయట. ఎందుకంటే అందులో పనిచేస్తున్న విలేకరులకు ఆయా సంస్థలు ఎటువంటి లైన్ ఎకౌంట్లుగాని, కనీసం జిల్లా ఇంచార్జ్ లకు వేతనాలు గాని ఇవ్వడం లేదు. పాత్రికేయులుగా ఛాతీ చించుకుంటున్న ఆయా సంస్థల్లో పనిచేస్తున్నవారు యాడ్ రిప్రజెంటేటివ్ లు గా మారి ‘ఎదురు’ మొత్తాలు చెల్లిస్తున్నదారుణ స్థితి తెలుగు పత్రికా రంగానిది. అంతేకాదు జర్నలిజంలో కావలసింది ‘పెన్ను రాతలు’ కాదు…నుదుటి రాత కూడా అంటాడు మరో పాత్రికేయ మిత్రుడు. అదీ విషయం.