రాంచరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల నేపథ్యంలో ఖమ్మం నగర పోలీసులు ఆంక్షలు విధించారు. ఈమేరకు సిటీ ఏసీపీ రమణమూర్తి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 10వ తేదీన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఉదయం 4 గంటలకు సినిమా ఎక్స్ట్రా షోకు సంబంధించిన ఆన్లైన్ టిక్కెట్లు లేకుండా నగరంలోని సినిమా థియేటర్ల పరిసరాల్లోకి ఎవరు కూడా రావద్దని ఏసీపీ రమణమూర్తి సూచించారు.
ఇటీవల హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్ట్యా ముందస్తు చర్యలలో భాగంగా టిక్కెట్లు లేని వారిని థియేటర్ల పరిసరాలకు అనుమతించడం లేదన్నారు. అదేవిధంగా థియేటర్ల వద్ద బాణాసంచా కాల్చడం నిషేధించినట్లు వెల్లడించారు. శాంతియుత వాతావరణానికి ప్రజలు, ముఖ్యంగా సీని అభిమానులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఏసీపీ రమణమూర్తి హెచ్చరించారు.