మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులకు రాజకీయంగా భారీ షాక్ తగిలిందా? అంటే… ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ టికెట్ నిరాకరించిన పరిస్థితుల్లో పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని, తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని గడచిన మూడేళ్లుగా ఎదురుచూస్తున్న పొంగులేటికి, అనూహ్యంగా గత ఎన్నికల్లో ఓటమి పాలైన తుమ్మల నాగేశ్వర్ రావులకు కేసీఆర్ గట్టి ‘షాక్’నిచ్చారనే వ్యాఖ్యలు వినిపిసస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న మూడు రాజ్యసభ (ఒక స్థానానికి ఉప ఎన్నిక సహా) స్థానాలకు నిన్న అభ్యర్థిత్వాలు ఖరారైన పరిణామాలు ఖమ్మం జిల్లా అధికార పార్టీ రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీసే అవకాశాలను పరిశీలకులు తోసిపుచ్చలేకపోతున్నారు.
ఏదో ఒక పదవి లభిస్తుందని, సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారని ఎదురుచూస్తున్న ఇద్దరు ముఖ్యనేతలను పక్కనబెట్టి అభ్యర్థిత్వాలను ఖరారు చేసిన తీరుపై ఆ పార్టీ వర్గాలు కూడా నివ్వెరపోతున్నాయి. ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కి సీటు ఖరారుపై ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేకపోయినా, రాజకీయంగా ఏరకంగానూ ప్రాచుర్యంలో లేని హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి రెడ్డి (బీపీఎస్ రెడ్డి)కి కూడా రాజ్యసభ సీటు కేటాయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాయత్రి రవికి కాంగ్రెస్ పార్టీతో గట్టి అనుబంధం ఉన్నప్పటికీ, గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలైనప్పటికీ, ఆ తర్వాత పరిణామాల్లో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి నిత్యం కేసీఆర్, కేటీఆర్ లతో టచ్ లో ఉంటూ పార్టీ పరంగానేగాక, సామాజిక సేవ కోణంలోనూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. సామాజికపరంగా ‘మున్నూరు కాపు’ నాయకునిగానూ రవికి మంచి గుర్తింపు ఉంది. ఈ పరిస్థితుల్లో గాయత్రి రవికి రాజ్యసభ సీటు కేటాయించడం ద్వారా మున్నూరుకాపు సామాజికవర్గం ద్వారా అధికార పార్టీకి రాజకీయ ప్రాబల్యం పెరిగే అవకాశాలు ఉండవచ్చు.
కానీ, ఇదే దశలో బండి పార్థసారథి రెడ్డికి టికెట్ కేటాయించడం ద్వారా కేసీఆర్ ఆశిస్తున్న రాజకీయ ప్రయోజనం ఏమిటి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఫార్మా రంగంలో బీపీఎస్ రెడ్డి ప్రపంచ ఖ్యాతిని గడించి ఉండవచ్చు. ఏపీ సీఎం జగన్ తోనూ ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. టీటీడీ బోర్డు సభ్యునిగానూ బీపీఎస్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీపీఎస్ రెడ్డికి రాజ్యసభ సీటు కేటాయించడం వెనుక కేవలం పార్టీ అవసరాలే ఉన్నాయా? లేక పారిశ్రామికవేత్తగా గుర్తించి పదవిని ఇచ్చారా? అనే ప్రశ్నల సంగతి ఎలా ఉన్నప్పటికీ, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ‘చెక్’ పెట్టేందుకు బీపీఎస్ రెడ్డిని తెరపైకీ తీసుకువచ్చారా? అనే సందేహాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజికి వర్గం నుంచి పొంగులేటిని దూరం చేసే రాజకీయ ఎత్తుగడ ఏదైనా దాగి ఉందా? అనే అనుమానాలు కూడా ఆయన అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే ‘రాజకీయ’ ప్రయోజనం కోసమే బీపీఎస్ రెడ్డికి రాజ్యసభ సీటు కేటాయిస్తే మాత్రం ఈ అంశంలో కేసీఆర్ సారు లెక్క తప్పినట్లేనని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రజా జీవితంలో ఏమాత్రం పరిచయం లేని బీపీఎస్ రెడ్డిని నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఏ రకంగానూ బేరీజు వేయలేరంటున్నారు. రాజకీయ పరంగా ఈ ఇద్దరి మధ్య రవ్వంత పోలిక కూడా సముచితం కాదంటున్నారు. వాస్తవానికి పొంగులేటిది, బీపీఎస్ రెడ్డిది స్థానికత పరంగా సత్తుపల్లి నియోజకవర్గమే కావడం విశేషం. వేంసూరు మండలం కందుకూరు బీపీఎస్ రెడ్డి గ్రామం కాగా, కల్లూరు మండలం నారాయణపురం పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాస గ్రామం. పొంగులేటి ప్రాబల్యానికో, మరే ఇతర కోణంలోనైనా ఆయనకు చెక్ పెట్టేందుకు మాత్రమే బీపీఎస్ రెడ్డికి రాజ్యసభ సీటును కేటాయించినట్లయితే అంతకన్నా ‘బ్లండర్’ మరొకటి ఉండదని, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా తప్పటడుకు వేసినట్లుగానే పరిశీలకులు భావిస్తున్నారు.
మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వర్గీయులు కూడా తాజా పరిణామంతో నైరాశ్యాన్ని ఎదుర్కుంటున్నారు. సొంత పార్టీ నేతల వెన్నుపోట్ల కారణంగా ఓటమి పాలైన తుమ్మలకు కేసీఆర్ న్యాయం చేస్తారనే నమ్మంతోనే ఇన్నాళ్లూ ఆయన అనుచరులు ఉన్నారు. కానీ తాజా పరిణామాలు తుమ్మల వర్గీయులకు షాక్ కలిగించాయి. ఆయా పరిణామాల్లో వచ్చే ఎన్నికల్లో తాము ప్రజా క్షేత్రంలోనూ తేల్చుకుంటామని, ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని పదే పదే స్పష్టం చేస్తున్న తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల విషయంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ఫలితాన్ని చవి చూస్తుందన్నది కాలమే చెప్పాలి.