సందేహం లేకపోవచ్చు… బండా ప్రకాష్ రాజీనామా చేయగా, ఖాళీ అయిన రాజ్యసభ సీటు పోటీలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండే ఉంటారు. తాజా వార్తల ప్రకారం పొంగులేటి కూడా రేసులో ఉన్నట్లే. కేవలం రెండేళ్ల పదవీ కాలం గల రాజ్యసభ సీటును టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కేటాయిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుసరించే విధానం ఏమిటి? ఇదీ ఆయనను నమ్ముకున్న నేతలను, అభిమానులను తీవ్రంగా తొలుస్తున్న ప్రశ్న. పొంగులేటి అనుచర, అనుయాయ, విశ్వసిస్తున్న నాయకుల్లో ఈ సంశయం దేనికంటే…? పొంగులేటి తీసుకునే నిర్ణయంపై పలువురు నాయకుల రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.

పొంగులేటి శ్రీనివాసరెడ్డినే పూర్తిగా నమ్ముకుని పలువురు నాయకులు తమ రాజకీయ భవితను అంచనా వేసుకుని ఆయన వెంట పయనిస్తున్నారు. వీరిలో ఖమ్మం డీసీసీబీ మాజీ ఛైర్మెన్ మువ్వా విజయ్ బాబు, రామసహాయం నరేష్ రెడ్డి, పిడమర్తి రవి, డాక్టర్ మట్టా దయానంద్, తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పొంగులేటి ఆధ్వర్యంలో వీరంతా ‘ఎమ్మెల్యే అభ్యర్థులు’గా వారి అనుచరగణం అంచనా వేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో పొంగులేటి రెండేళ్ల పదవీ కాలం గల రాజ్యసభ సీటును స్వీకరిస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఎందుకంటే…? టీఆర్ఎస్ చీఫ్ ఖరారు చేశాక… ఆఫర్ ను పొంగులేటి స్వీకరిస్తే ఆయననే నమ్ముకుని పయనిస్తున్న నాయకుల భవిష్యత్తు ఏమిటి? పొంగులేటి రాజ్యసభ సభ్యుడయ్యాక వీరందరూ ఆయననే అనుసరిస్తారా? లేక ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారా? అయినప్పటికీ తన వెంటే ఉంటే ఆయా నేతలకు వచ్చే ఎన్నికల్లో పొంగులేటి ‘న్యాయం’ చేయగలరా? టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో అది సాధ్యమయ్యే పనేనా? ఇవన్నీ ఇప్పటికిప్పుడు జవాబు లేని ప్రశ్నలే. ఇటువంటి పరిస్థితుల్లో పొంగులేటి ముందున్న కర్తవ్యమేమిటి? అనే ప్రశ్న ఉద్భవిస్తోంది. ఓ అంచనా ప్రకారం…

పార్టీ చీఫ్ ఆఫర్ ఇస్తే రెండేళ్ల పదవీ కాలం గల రాజ్యసభ సీటును పొంగులేటి స్వీకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో పొంగులేటికి రాజ్యసభ సభ్యునిగా ‘ప్రొటోకాల్’ లభిస్తుంది. రాజకీయంగా తన శక్తిని మరింత ఇనుడింపజేసుకునే అవకాశాలున్నాయి. ఇదే దశలో వచ్చే ఎన్నికల్లో తన టికెట్ తనకు ఇవ్వాల్సిందేనని పొంగులేటి పార్టీ అధిష్టానంపై వత్తిడి చేసే అవకాశాలున్నాయి. రాజ్యసభ పదవిని ఇచ్చినందువల్ల ఎంపీ టికెట్ ను పార్టీ నిరాకరించవచ్చు లేదా అంగీకరించవ్చు. అప్పుడు పొంగులేటి ఏం చేస్తారనేది రాజకీయ పరిశీలకుల ప్రశ్న. ఈ పరిణామాల్లో పొంగులేటి వ్యూహాత్మకంగా పార్టీ మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఎందుకంటే మాజీ ఎంపీ హోదాలోకన్నా, రాజ్యసభ సభ్యుని స్థాయిలో పార్టీ మారితేనే పొంగులేటికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందనేది రాజకీయ పరిశీలకుల భావన. రాష్ట్రంలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి తనతోపాటు తననే నమ్ముకున్న నాయకుల భవిష్యత్తు కోసం పార్టీ మారాల్సిన పరిస్థితులు అనివార్యం కావచ్చని పరిశీలకులు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని పొంగులేటి ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేయడం గమనార్హం. మొత్తంగా పొంగులేటి ఈ విషయంలో తీసుకునే నిర్ణయంపై ఆయన అభిమానులే కాదు, ఆయనను నమ్ముకున్న దాదాపు పది మంది ‘ఎమ్మెల్యే అభ్యర్థులు’ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారనేది నిర్వివాదాంశం.

Comments are closed.

Exit mobile version