అయిదేళ్ల క్రితం సీఎం కేసీఆర్ సార్ చెప్పినట్లు విపక్షాలు విని ఉంటే ఉస్మానియా ఆసుపత్రి స్థానంలో ఈపాటికి అధునాతన హంగులతో సరికొత్త హాస్పిటల్ నిర్మితమయ్యేది. ప్రస్తుత కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి మరింత సహాపడి ఉండేది. కానీ కేసీఆర్ సార్ ప్రతిపాదనకు, లక్ష్యానికి విపక్ష పార్టీలు విఘాతం కలిగించాయి. అడుగడుగునా అడ్డుకున్నాయ్. అధికార పత్రిక ‘నమస్తే తెలంగాణా’ పతాక శీర్షిక కథనం ప్రకారమైతే ‘కాళ్లల్లో కట్టెలు’ పెట్టాయ్ ప్రతిపక్షాలు. ఏమిటిదంతా.. అనుకుంటున్నారు కదూ?
ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షం, మురుగు నీళ్లు వచ్చిన పరిణామాలపై, విపక్షాల విమర్శలపై టీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. సీఎం కేసీఆర్ సార్ ప్రయత్నానికి ప్రతిపక్షాలు అప్పట్లో అడ్డుపడకపోయి ఉంటే, ఉస్మానియా ఆసుపత్రికి ప్రస్తుతం ఈ దుస్థితి తప్పేదని ఘంటా భజాయించి మరీ చెబుతున్నారు. కావాలంటే దిగువన గల ‘వాట్సాప్’ పోస్టును చూడండి. నిన్న ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షం, మురుగు నీరు చేరి పేషెంట్లు, ఆసుపత్రి సిబ్బంది ఆందోళనకు గురైన నేపథ్యంలో అసలు ఇందుకు కారకులెవరంటూ ఈ పోస్టు నిలదీస్తోంది. ఆయా పోస్టును ‘ఉన్నది ఉన్నట్లు’గా దిగువన చదవవచ్చు. అధికార పత్రికలోని నేటి బ్యానర్ స్టోరీ సారాంశం కూడా ఇదే కావడం మరో విశేషం.
2015 లో ప్రతిపక్షాల నిర్వకమే నేడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దుస్థితి కారణం:
తెలంగాణ వచ్చిన తొలి నాళ్ళ లొనే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దుస్థితిని స్వయంగా పరిశీలించి, దాని స్థానంలొనే తెలంగాణ గర్వించదగ్గ నూతన హాస్పిటల్ సముదాయాలను నిర్మించ పూనుకున్నారు.
ఆ చర్యను అసెంబ్లీ సాక్షి గా BJP, Congress , MIM, communists కలిసి వ్యతిరేకించగా, అనేక సంఘాల తో పాటు, చరిత్ర కారులు హెరిటేజ్ సొసైటీలు తీవ్రంగా వ్యతిరేకించారు.
ప్రతిపక్షాల ఒత్తిడి మరియు ఇతర పక్షాల ఒత్తిడి కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రతిపాదన ను తాత్కాలికంగా పక్కన పెట్టి, పెద్ద ఎత్తున మరమ్మతులు చేయించింది.
అది గడిచి 5 సంవత్సరాల తరవాత ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో వర్షాల కారణంగా కొన్ని పెచ్చులు ఊడడం, వరద నీరు లేదా మురుగు నీరు హాస్పిటల్ లోపలి కి రావడం వలన, పేషెంట్స్ కు మరియు సిబ్బందికి కొంత ఇబ్బంది కలుగుతుంది.
అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రతిపాదనలు అంగీకరించి, కొత్త హాస్పిటల్ కు అడ్డు పడి ఉండకపోయి ఉంటే,
ఈ పాటికే కొత్త హాస్పిటల్ నిర్మితమై, కరోన సమయంలో రాష్ట్రానికి మరింత సహాయపడి ఉండేది కాదా?
అధునాతన హంగులు తో ప్రపంచ ప్రమాణాల తో ఉస్మానియా హాస్పిటల్ ను నిర్మించే కార్యక్రమం కేసీఆర్ గారు చేపట్టగలరు.
దాన్ని సమర్థించే ఔదార్యం ప్రతిపక్షాలకు ఉందా?
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉదంతం, ప్రతిపక్షాల నిఖార్సయిన ప్రజా వ్యతిరేక రాజకీయం కాక ఇంకేమిటి.
జై తెలంగాణ!