‘సదువు శారెడు…బల్పాలు దోశెడు’, లేదంటే.. ‘చారానా కోడికి బారానా మసాలా..’ ఈ రెండు సామెతల్లో దేన్నయినా అన్వయించుకోవచ్చు ఈ రైల్వే స్టేషన్ కీర్తికి. ఇంకాస్త మాడిఫై చేసి సామెతను సరికొత్తగా చెప్పాలంటే 20 రూపాయల రాబడి కోసం అక్షరాలా రూ. 115.00 కోట్ల ఖర్చు. బాప్..రే అని నోరెళ్లబెట్టకండి. ఇంతకీ విషయం ఏమిటంటే..
అది మన తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని ఒడిషా రాష్ట్రంలో గల రైల్వే స్టేషన్. బొలంగిర్ జిల్లాలోని బిచ్చుపాలి గ్రామంలో ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఎప్పుడు చూసినా ఈ రైల్వే స్టేషన్ ఖాళీగానే కనిపిస్తోందేమిటి చెప్మా? అసలు ఈ రైల్వే స్టేషన్ ఆదాయం ఎంత? అనే సందేహం కలిగింది బొలంగిర్ కు చెందిన ఆర్టీఐ కార్యకర్త హేమంత్ పాండకు. తెలుసుకుంటే పోలా..? అనుకున్నదే తడవుగా హేమంత్ పాండ సమాచార హక్కు చట్టం కింద ఓ దరఖాస్తు చేశారు. దీనికి జవాబుగా సంబల్ పూర్ రైల్వే డివిజన్ అధికారులు ఇచ్చిన సమాచారం చూశాక హేమంత్ పాండకు మూర్ఛ వచ్చినంత పనైంది.
ఎందుకంటే… ఈ స్టేషన్ నుంచి దినసరి ఇద్దరు ప్రయాణీకులు మాత్రమే ప్రయాణిస్తున్నారు. తద్వారా రైల్వే శాఖకు లభిస్తున్న రోజువారీ ఆదాయం రూ. 20 మాత్రమే. విషయం ఇంకా పూర్తి కాలేదు. బొలంగిర్-బిచ్చుపాలి మధ్య నిర్మించిన 16.8 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి ఖర్చు చేసింది ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 115.00 కోట్లు. నిరుడు జనవరి 15వ తేదీన సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అధికారులు ఈ రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. కానీ.. సోనేపూర్ రైల్వే లైన్ కు దీన్ని కనెక్ట్ చేస్తే బిచ్చుపాలి స్టేషన్ ఆదాయం పెరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్వో జేపీ మిశ్రా అంటున్నారు. అన్నట్టు రైల్వే శాఖలో అత్యంత చిన్న రైల్వే స్టేషన్ నెలసరి నిర్వహణ ఖర్చు కూడా తెలుసుకుంటే… రూ. 3.50 లక్షలు కేవలం జీతభత్యాలకే సరిపోతుందని ఓ అంచనా. అదీ విషయం.