పాములపర్తి వెంకట నరసింహారావు… పీవీ నరసింహారావుగా ఖండాంతర ఖ్యాతినార్జించిన అచ్చ తెలుగు రాజకీయ చాణక్యుడు. పీవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన తాజా వార్త ఏమిటి? దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. హైదరాబాద్-రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వెనుక సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహం దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన పీవీ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. కానీ ఆయన మరణానంతరం పీవీ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కనీసం గౌరవించలేదని, ఆయన కుటుంబీకులను దూరం చేసుకుందని, దీన్ని అవకాశంగా మల్చుకునేందుకు సీఎం కేసీఆర్ రాజకీయంగా పావులు కదిపారనే సారాంశంతో వార్తలు వస్తున్నాయి.
ఆసక్తికర అంశమేమిటంటే… పీవీ నరసింహారావు కుటుంబంలో ఎమ్మెల్సీ పదవి కొత్తమీ కాకపోవడం. పీవీ కుమారుల్లో ఒకరైన పీవీ రంగారావు హన్మకొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న పీవీ రంగారావుకు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో పదవీ గౌరవం దక్కింది. ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. అనారోగ్యానికి గురైన రంగారావు 2013 ఆగస్టు 1వ తేదీన మృతి చెందారు.
ఫొటో: పీవీ రంగారావు