పుట్ట మధు… రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితమైన పేరు. వార్తల్లో నలుగుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మెన్, మంథని మాజీ ఎమ్మెల్యే కూడా. గత నెల 30వ తేదీ అర్థరాత్రి నుంచి అకస్మాత్తుగా ఆచూకీ లేకుండాపోయిన పుట్ట మధు అదృశ్యంపై ఎన్నెన్నో వార్తా కథనాలు… మరెన్నో ప్రచారాలు. ఎట్టకేలకు దాదాపు తొమ్మిది రోజుల ఉత్కంఠ తర్వాత పుట్ట మధును రామగుండం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధును తాము ప్రశ్నిస్తున్నామని, ఈ హత్య కేసులో వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై పుట్ట మధును తాము మరోసారి ప్రశ్నిస్తున్నామని రామగుండం పోలీసులు స్వయంగా ప్రకటించారు. అయితే ఈ ఉదంతంలో పుట్ట మధును పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రకటిస్తారా? లేక ప్రశ్నించి వదిలేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే దశలో పుట్ట మధు ఎపిసోడ్ లో ఎన్నెన్నో ప్రశ్నలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తున్నాయి.
- అధికార పార్టీకి చెందిన జెడ్పీ చైర్మెన్ హోదాలో గల పుట్ట మధు ఎందుకు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు?
- గడచిన సుమారు తొమ్మిది రోజులుగా పుట్ట మధు ఆచూకీ గురించి ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు… ఎందుకు?
- కర్నాటకలోని రాయచూర్, మహారాష్ట్రలోని వని, ఛత్తీస్ గఢ్ లోని రాయపూర్ ప్రాంతాల్లో పుట్ట మధు స్నేహితులు, బంధువులు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ తొమ్మిది రోజులపాటు పుట్ట మధు ఆయా రాష్ట్రాల్లో తల దాచుకున్నారా?
- ఇదే నిజం కాని పక్షంలో ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలోని లాడ్జ్ లో పుట్ట మధు ఆశ్రయం తీసుకోవడానికి గల ప్రధాన కారణాలేంటి?
- తన భర్తకు కరోనా సోకిందని, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని మధు భార్య చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. భీమవరంలో పోలీసులకు మధు చిక్కిన నేపథ్యంలో ఆయనకు కరోనా సోకడం నిజం కాదని భావించాల్సిందేనా?
- వామన్ రావు దంపతుల హత్యోదంతంలో రూ. 2.00 కోట్ల సుపారి ముట్టిందనే లేఖపై కూడా పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారా?
- కేవలం వామన్ రావు దంపతుల హత్యోదంతంపైనే పుట్ట మధును పోలీసులు ప్రశిస్తున్నారా? లేక మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన ఈటెల రాజేందర్ తో గల సంబంధాలపైనా కూపీ లాగుతున్నారా?
- ఈటెల రాజేందర్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం పుట్ట మధు వద్ద లభించే ఆస్కారం ఉందా?
- ఈటెల రాజేందర్, పుట్ట మధులకు సంయుక్తంగా దుబాయ్ లో ఏవేని వ్యాపారాలు ఉన్నాయా? ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఇందుకు సంబంధించిన ప్రచారంపైనా పోలీసులు సమాచార సేకరణ చేస్తున్నారా?
- అసలు ఈటెల రాజేందర్ ఎపిసోడ్ కు, పుట్ట మధు తాజా ఉదంతానికి ఏదేని సంబధం ఉందా? ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన రోజునే పుట్ట మధు అదృశ్యం కావడం వెనుక ఏదేని రాజకీయ కోణం కూడా దాగి ఉందా?
పుట్ట మధు ఎపిసోడ్ లో అధికార పార్టీ వర్గాల్లోనే కాదు, విపక్ష పార్టీలకు చెందిన శ్రేణుల మధ్య కూడా వ్యక్తమవుతున్న అనేకానేక ప్రశ్నల్లో ఇవి కొన్ని మాత్రమే. ఈ నేపథ్యంలో పుట్ట మధును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న రామగుండం పోలీసులు ఎటువంటి అంశాలను వెల్లడిస్తారనేది ఉత్కంఠగా మారింది. అధికార పార్టీకి చెందిన జెడ్పీ చైర్మెన్ అదృశ్యం, పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న ఘటన తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్.