మేడారం జాతరలో జంపన్న పుట్టాడు. కాకపోతే అతని తల్లిపేరు సమ్మక్క కాదు… శివాని. అదీ అసలు విశేషం. విషయం ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. మహారాష్ట్రలోని పుణేకు చెందిన శివాని (25) తన భర్త గోవింద సహా కుటుంబీకులతో మేడారం జాతరకు వచ్చారు. గర్భిణీగా ఉన్న శివానికి నెలలు నిండినప్పటికీ ఆమె మేడారం జాతరకు రావడం విశేషం. సమ్మక్క భక్తుల్లో అనేక మంది గర్భిణీలు జాతరలోనే ప్రసవించాలని, ఆడపిల్ల పుడితే సమ్మక్క, లేదా సారక్క, మగబిడ్డ జన్మిస్తే జంపన్న పుట్టినట్లుగానే భావిస్తూ, వన దేవతల పేర్లను తమ శిశువులకు నామకరణంగా చేసుకోవాలని అభిలషిస్తుంటారు.
గర్భిణీ శివాని కూడా నెలలు నిండినా జాతరకు రావడం వెనుక ఇదే సెంటిమెంట్ గా ఆమె కుటుంబీకులు చెబుతున్నారు. జాతరలో గల శివానికి పురిటి నొప్పులు రావడంతో వైద్య, ఆరోగ్యశాఖ స్థానికంగా ఏర్పాటు చేసిన లేబర్ రూంలో వైద్యులు ఆమెకు డెలివరీ చేశారు. శివానికి 3.5 కిలోల ఆరోగ్యవంతమైన మగ శిశువు జన్మించాడు. తల్లి శివానిని తెలంగాణా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. ఆమెకు కేసీఆర్ కిట్ ను కూడా ఈ సందర్భంగా అందజేశారు. శివాని జన్మనిచ్చిన మగబిడ్డకు ఆమె కుటుంబీకులు ‘జంపన్న’గా నామకరణం చేయడం గమనార్హం.