ముందు ఇక్కడ గల పత్రిక క్లిప్పింగ్ లోని వార్తా కథనపు ‘ఇంట్రో’ను ఓసారి పరిశీలిద్దాం.
‘‘ఖమ్మం నగరం అభివృద్ధిలో భాగ్యనగరాన్ని అందుకునే దిశగా వెళ్తోంది. ఆరేళ్లలో ఎన్నో మార్పులతో సరి‘కొత్త’గా కనిపిస్తోంది. ఏళ్లనాటి అవస్థలను వీడి ఆధునిక హంగులు సంతరించుకుంటోంది. రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించాక కనీ, వినీ ఎరుగని ఖమ్మం కళ్లముందు ఆవిష్కృతం అవుతోంది. ఏడాది క్రితం నగరాన్ని విడిచివెళ్లనవారు ఇప్పుడు అడుగిడితే ఇది మా ఖమ్మమేనా…! అనే స్థాయిలో ప్రగతి పరవళ్లు తొక్కుతోంది. ఏకంగా రూ. 215 కోట్లతో నూతన శోభ సంతరించుకున్న సరికొత్త నగరం సోమవారం ప్రజలకు అందుబాటులోకి రానుంది.’’
బాగుంది కదా ఇంట్రో…? వాక్యనిర్మాణంలోని అక్షరవిన్యాసం?? సాధారణంగా ఇటువంటి వార్తా కథనాలు అధికార పార్టీ కరదీపికగా భావించే ‘నమస్తే తెలంగాణా’లో ప్రచురితమవుతుంటాయి. ఈ మధ్య ‘నమస్తే…’ బాటను అనుసరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థలు కూడా ఇంతకన్నా ఎక్కువ ‘అభివృద్ధి’ కథనాలు రాస్తున్నాయనేది వేరే విషయం. నాలుగు యాడ్స్ కోసమో, తద్వారా లభించే ఆదాయం కోసమో… ఆయా పత్రికలు ఇటువంటి కథనాలు రాస్తే వార్తాంశం కానేకాదు. కానీ సీపీఎం పార్టీ పత్రిక ‘నవ తెలంగాణా’ గులాబీ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధిని సరి‘కొత్త’గా కీర్తించడమే అసలు విశేషం. బహుషా ‘పెయిడ్ ఆర్టికల్’ అని భ్రమించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇందుకు సంబంధించి అనేక ‘యాడ్స్’ కూడా ‘నవ తెలంగాణా’ ఇదేరోజు పబ్లిష్ చేసింది. ఆయా యాడ్స్ ఇచ్చినందుకే ఇటువంటి కథనాన్ని ప్రచురించింది కాబోలునని భావించినా పొరపాటే అవుతుంది.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా నలుగురు మంత్రులు సోమవారం ఖమ్మం పర్యటనకు వచ్చిన సందర్బంగా సీపీఎం పత్రిక తన పాఠకులకు అందించిన సంభ్రమాశ్చర్యకర వార్తా కథనమిది. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాన ప్రతికలకన్నా ‘నాలుగు సెంటీమీటర్లు’ ఎక్కువగానే యాడ్స్ కూడా సంపాదించుకుంది. పత్రిక నిర్వహణలో వాణిజ్య అవసరాలు సాధారణమే. ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. కానీ ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై గత కొంత కాలంగా ‘సోషల్’ వార్ చేస్తున్న సీపీఎం పత్రికలో ఇటువంటి కథనం రావడమే చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన సందర్భంగా సీపీఎం నేతలు నిన్ననే పలు ప్రశ్నల వర్షం కురిపించారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో వదిలిన పోస్టును కూడా ఓసారి దిగువన పరిశీలిద్దాం.
ఖమ్మం KTR పర్యటనపై CPM పార్టీ నేతలు ప్రశ్నల వర్షం….
? 8000 వేల బెడ్ రూం ఇళ్లకు గాను ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఖమ్మం నగరంలో ఎనిమిది వందల ఇళ్లు కూడా పూర్తి చేయలేని స్థితిలో TRS వుందని విమర్శించారు…
? ఇక సారధి నగర్-మామిళ్ళగూడెం అండర్ బ్రిడ్జి హామీ అడ్రస్ లేదని ఆరోపించారు…
? సంవత్సరానికి 100 కోట్లు హామీ ఏమైందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు…
? ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇచ్చిన హామీ గుర్తు వుందా అని వారు ప్రశ్నించారు…
? రేషన్ కార్డులు, పెన్షన్లు, మిషన్ భగీరథ నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు, వీధి లైట్లు, శివారు ప్రాంతాల అభివృద్ధి తదితర హామీలపై మంత్రి KTR సమాధానం చెప్పాలని సుందరయ్య భవనంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ సీపీఎం నాయకుల వాదన. కానీ ఆ పార్టీకి చెందిన ‘నవ తెలంగాణా’ పత్రిక కథనం చదివాక ఖమ్మం అభివృద్ధిపై ‘మార్క్సిస్టు కామ్రేడ్స్’ ఇంకా అభివృద్ధిపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందా? అనే సందేహం కలగకమానదు. ఇదే సంశయాన్ని కొందరు సీపీఎం నేతల వద్ద వ్యక్తం చేస్తే, ఆసక్తికర అంశాలు ప్రస్తావనకు రావడమే అసలు విశేషం. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ‘రుచి’ చూశాక అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు సీపీఎం పార్టీకి ‘స్నేహ హస్తం’ అందిస్తున్నారట. త్వరలోనే జరగనున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఐదు డివిజన్లను కూడా ఇస్తామని టీఆర్ఎస్ స్థానిక నేతలు సంకేతాలను పంపుతున్నారట. ఇందుకు సంబంధించిన స్నేహపూర్వక వాతావరణమే ‘నవ తెలంగాణా’ ప్రచురించిన తాజా వార్తా కథనానికి అసలు కారణమట.
అంతే కాదు, సీపీఎం శ్రేణుల కథనం ప్రకారం… హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్ధతు ఇవ్వడానికి కూడా టీఆర్ఎస్ నాయకత్వం సిద్ధపడిందనేది తాజా సమాచారం. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్ధతు తెలపడాన్ని కూడా సీపీఎం నేతలు స్వాగతిస్తున్నారు. ‘యాంటీ మోడీ’ శక్తులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కూడా సీపీఎం రాష్ట్ర నాయకత్వం సిద్ధపడిందంటున్నారు. మొత్తంగా తెలంగాణాలో బలపడుతున్న బీజేపీని నిలువరించేందుకు టీఆర్ఎస్, సీపీఎం పార్టీలు కలిసి సాగించే ఉద్యమం సరి’కొత్త’పయనానికి బాటలు వేస్తున్నది. అయితే టీఆర్ఎస్ నేతలు చాస్తున్న స్నేహహస్తానికి సీపీఎం లీడర్లు కొందరు సుముఖంగా ఉన్నప్పటికీ, దిగువ స్థాయి కేడర్ మాత్రం ససేమిరా అంటున్నదట. నాలుగైదు కార్పొరేటర్ పదవుల కోసం మరో ‘చరిత్రాత్మక’ తప్పిదం అవసరమా కామ్రేడ్? అని లీడర్లను ప్రశ్నిస్తున్నారట కూడా. కానీ అంతిమంగా మాత్రం రాష్ట్ర నాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడక తప్పదని, తమది బూర్జువా పార్టీ కాదని నిర్వచిస్తున్నారు.