ఈ వార్త గురించి ఎక్కువ ఉపోద్ఘాతం అక్కర లేదు. కుప్లంగానే చెప్పకుందాం. కరోనా మహమ్మారి బారిన పడిన అనేక మందిని ప్రయివేట్ ఆసుపత్రుల నిర్వాహకులు దోచుకుతింటున్న సంగతి తెలిసిందే. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల బిల్లుల ‘కత’లు రాబందులను సైతం మరిపిస్తున్నాయి. ఈ విషయంలో పాలకుల, ప్రజల అభిప్రాయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కరోనా బాధితులకు ఎక్కడైనా చికిత్సా విధానం ఒకేలా ఉంటుందని, సర్కారు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాలని పాలక నేతలు సెలవిస్తున్నారు. మరి కరోనా సోకిన మంత్రులు, ఎమ్మెల్యేలు కార్పొరేట్ ఆసుపత్రులకు ఎందుకు వెడుతున్నారని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారనేది వేరే విషయం.
సరే, ఈ వాదోపవాదాల గురించి ఎలా ఉన్నప్పటికీ కర్నాటకలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రి నిర్వాహకులు మాత్రం కరోనా బాధితునికి నమ్మశక్యం కాని రీతిలో భారీ డిస్కౌంట్ ఇవ్వడమే అసలు విశేషం. ఈ ఆసుపత్రి చిరునామాకు సంబంధించి బిల్లులోని అక్షరాలు స్పష్టంగా కనిపించడం లేదుగాని, చిక్ మగ్లూర్ చిరునామా గల ఆసుపత్రిలా గోచరిస్తోంది. కరోనా పేషెంట్ ఒకరు చికిత్స కోసం గత నెల 24న ఈ ఆసుపత్రిలో చేరి, ఈనెల 11వ తేదీన డిశ్చార్జి అయ్యారు. మొత్తం 19 రోజులపాటు ఆయా ఆసుపత్రి నిర్వాహకులు బాధితునికి కాస్త ఖరీదైన చికిత్సనే అందించారు.
ఇందుకోసం 9 లక్షల 25 వేల 601 రూపాయల బిల్లు వేశారు. ఇందులో లక్షా 98 వేల రూపాయలు కేవలం కన్సల్టింగ్ విజిట్ చార్జీలుగానే విధించారనుకోండి. సరే ఇంత భారీ మొత్తపు బిల్లు వేశాక ఏ పేషెంట్ సంబంధీకులైనా కాస్త ‘డిస్కౌంట్’ అడుగుతారు కదా? ఈ పేషెంట్ కుటుంబీకులు కూడా డిస్కౌంట్ అడిగారో, లేక ఆసుపత్రి వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చారో తెలియదుగాని, ఈ బిల్లులో వాళ్లు దయతలచి ఇచ్చిన డిస్కౌంట్ మొత్తం ఎంతో తెలుసా? రూ. 1.00. ఆశ్చర్యపోకండి. ఆసుపత్రి వాళ్లు ఇచ్చిన డిస్కౌంట్ మొత్తం అక్షారాలా ఒక్క రూపాయే. డౌటుగా ఉందా? అయితే ఇక్కడే గల ఆయా బిల్లును ఓసారి మీరూ నిశితంగా పరిశీలించండి.
ఈ ఆసుపత్రి నిర్వాహకుల దయాగునంపై నెటిజన్లు ఏమని సెటైర్లు విసురుతున్నారో తెలుసా? ‘కరోనా నుంచి గట్టెక్కాడు… లక్షల బిల్లు చూసి కూడా తట్టుకున్నాడు… కానీ హాస్పిటల్ వాళ్లు ఇచ్చిన భారీ డిస్కౌంట్ చూసి గుండెపోటుకు గురయ్యాడు.’ అని. ఎంతైనా ఈ ఆసుపత్రి నిర్వాహకులు మహా ‘దర్మ పెబువులు’ కదా!