Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»National News»మోదీ అడిగారు సరే, భక్తుల అసలు కోరిక చెప్పారా?!

    మోదీ అడిగారు సరే, భక్తుల అసలు కోరిక చెప్పారా?!

    December 13, 20193 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 jatra 1417

    మూడు దశాబ్ధాలకు పైగా జర్నలిజపు జీవితంలో ఇంత సంతోషం ఎన్నడూ కలగలేదు. ఈ పయనంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తు పల్లాలు చవి చూసిన జీవితంలో ఈరోజు మహా ఆనందం. మా ఆంధ్రభూమి మల్లన్న తారసపడినప్పుడల్లా మేడారం జాతర గురించి, జాతర వార్తల కవరేజ్ గురించి నేను పడిన కష్టాన్ని పదే పదే గుర్తు చేస్తుంటారు. మేడారం జాతర వార్తల కవరేజ్ విషయంలో నువ్వే అసలైన అద్యుడివి అంటుంటారు. అప్పట్లో నువ్వు సేకరించి రాసిన సమాచారమే ఇప్పుడు అందరూ రాస్తున్నారని, అదనంగా ప్రస్తుత జర్నలిస్టులు సేకరించిన సమాచారం ఏమీ కనిపించడం లేదనే మల్లన్న మాటలు విన్నపుడు మహా ఆనందం కలుగుతుంటుంది.

    ts29 HY17 SAMMAKKA JAGGERY

    1988 నుంచి మొదలు 1994 వరకు దండకారణ్యంలో రోజంతా తిరిగి కష్టపడి రాసిన వార్తల కవర్ ను ఈనాడు పత్రికకు పంపడం కోసం, హైదరాబాద్ బస్సు కోసం ఏటూరునాగారం బస్ స్టేషన్ లో వేచి చూసినప్పటి కష్టం మర్చిపోయిన అనుభూతి. అప్పట్లో ఈనాడు పత్రిక ప్రతులు హైదరాబాద్ ఎడిషన్ నుంచి ఏటూరునాగారం దండకారణ్యం ప్రాంతానికి ఆర్టీసీ రాజమండ్రి లేదా గుంటూరు బస్సులో వచ్చేది. విలేకరిగా వార్తలు రాయడానికి ఇప్పడున్న సౌకర్యాలు అప్పట్లో లేవు. రోజంతా జరిగిన ఘటనకు సంబంధించి సాయంత్రం కల్లా వార్తలు రాసి రాత్రి 9.30 గంటలకు మంగపేట నుంచి వచ్చే ఒకే ఒక హైదరాబాద్ బస్సు డ్రైవర్ ను పట్టుకుని, అతనికి ఓ రెండు రూపాయలు ఇచ్చి కవర్ ఇచ్చేవాడిని. ఆ కవర్ గౌలిగూడ బస్ స్టేషన్ (ఈ మధ్యే కూలిపోయింది) లో గల ఈనాడు బాక్స్ లో ఆర్టీసీ డ్రైవర్ మర్చిపోకుండా వేస్తే, ఆ మరుసటి రోజు అంటే వార్త పంపిన రోజు నుంచి మూడోరోజు పత్రికలోవార్త చూసుకునేవాడిని. మరీ ఏ ఎన్కౌంటర్ లేదా మందుపాతర పేలిన వార్తో అయితే ములుగు టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ వాళ్లను బతిలాడితే గంటకో, రెండు గంటలకో వాళ్లు దయ తలచి ట్రంకాల్ కలిపిస్తే తప్ప మరుసటి రోజు వార్త వచ్చేది కాదు. సరే టెలీప్రింటర్లు, ఎలక్ట్రానిక్ టెలీప్రింటర్లు, కంప్యూటర్లు టెక్నాలజీ వగైరా…ప్రస్తుతం అనేక మార్పులు. ఇప్పుడు వాట్సాప్ లో మెసేజ్ పెడితే క్షణాల్లో సమాచారం చేరే సాంకేతిక అభివృధ్ది.

    ts29 Medaram Jatara 1024x516 1

    అప్పట్లో మేడారం జాతర గురించి వార్తల కవరేజ్ అంటే మాటలు కాదు. ఇప్పుడంటే రెడ్డిగూడెంలోనే పత్రికల, న్యూస్ ఛానళ్ల తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని, అందుబాటులో గల అద్భుత సాంకేతిక సహకారంతో వార్తల కవరేజి ఇస్తున్నారు. కానీ అప్పట్లో న్యూస్ కవరేజ్ ఓ యుద్ధం. జాతర జరిగే మేడారం నుంచి స్కూటర్ పైనే పయనిస్తూ తాడ్వాయికి చేరుకుని చేసే వృత్తిపరమైన యుద్ధం అంతా ఇంతా కాదు. కొన్నేళ్లపాటు వరంగల్, మరికొంత కాలానికి ములుగు వరకు వార్తలు తీసుకువెళ్లేందుకు బజాజ్ చేతక్ పై చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. ఒళ్లంతా ఎర్ర దుమ్ముతో కలర్ మారినా కష్టం అనిపించని  వృత్తి నిబద్ధత.

    ఇదిగో ఇన్ని కష్టాల మధ్య చేసే న్యూస్ కవరేజ్ ను మరుసటి రోజు ఈనాడు పత్రికలో చూసుకున్న అప్పటి అనుభూతి, ఆనందం వేరు. అంత పెద్ద ఈనాడు పత్రికలో మొదటి పేజీలో కలర్ ఫొటోతో ప్రచురితమైన వార్తలు చూసుకుని తోటి జర్నలిస్టులు సహా నేనూ ఎంతగానో మురిసేవాళ్లం. ఈ పయనంలోనే ఓ జాతర సంవత్సరంలో సండే మ్యాగ్జిన్ కు కవర్ స్టోరీ రాసే అద్భుతమైన అవకాశం చిక్కింది. సమ్మక్క-సారలమ్మ జాతర గురించి నేను రాసిన వార్తా కథనం దాదాపు నాలుగు పేజీల్లో కవర్ స్టోరీగా సండే మ్యాగ్జిన్ లో నా బై లేన్ (రచయిత పేరు) తో ప్రచురించారు.

    ఆ తర్వాత మేడారం జాతరను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించారు. రూ. కోట్లు వ్యయం చేస్తూ అభివద్ది పనులు చేస్తున్నారు. నిధులు ఖర్చవుతున్నాయే తప్ప, శాశ్వత అభివృద్ధి జరగడం లేదు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రాచుర్యం పొందిన సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలనే డిమాండ్ మాత్రం నెరవేరడం లేదు. ప్రత్యేక రాష్ట్రంలోనూ ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి వెళ్లిన దాఖలాలు లేవు.  

    ts29 DSC 5061 copy

    కానీ శుక్రవారం నాటి తాజా వార్త ఒకటి ‘మేడారం జాతర జాతీయ పండుగ’ ఆశను మళ్లీ చిగురింపజేస్తున్న భావన. అందుకే ఎంతో సంతోషం కలిగిన రోజు ఇది. ఎందుకంటే ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతమైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర గురించి ఈ దేశ ప్రధాని అడిగి తెలుసుకోవడం. అదీ అసలు విశేషం. ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా మేడారం జాతర గురించి ఆరా తీసినట్లు లేదు. స్థానిక నాయకులు గత ప్రధానుల దృష్టికి తీసుకువెళ్లిన ఉదంతాలు కూడా లేవు. కానీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సమ్మక్క-సారలమ్మప్రసాదాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు. అశేష భక్తజనం అమ్మవార్లకు మొక్కులుగా చెల్లించే ఎత్తు బంగారాన్ని (బెల్లం) దేశ ప్రధాని నోట్లో వేసుకున్నారు. జాతర ప్రాశస్త్యం, సమ్మక్క-సారలమ్మల  గురించి అడిగి తెలుసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు అదే ప్రాంతం నుంచి వచ్చారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రధానికి వివరించారు.

    ఇదిగో ఈ నేపథ్యంలో మేడారం జాతరకు ఇప్పటికైనా నేషనల్ ఫెస్టివల్ గా గుర్తింపు రావాలని, అందుకు బీజేపీ ఎంపీలు కృషి చేయాల్సిన అవశ్యకతను కోట్లాది మంది మేడారం భక్తులు గుర్తు చేస్తున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకుని వచ్చే జాతర వరకు మేడారం భక్తులకు బీజేపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ నోటి వెంట సంతోషకర ‘జాతీయ పండుగ’ వార్తను అందిస్తారని విశ్వసిద్దాం.

    -ఎడమ సమ్మిరెడ్డి

    Previous Articleచెప్తే అర్థం చేసుకోవాలి… విచారణే కాదు, దర్యాప్తు కమిషన్ కూడా!
    Next Article CAB మంటలు, వాళ్ల వేట ఇందుకోసమేనా?

    Related Posts

    దొడ్డ మనసులో వద్ది‘రాజు’

    May 12, 2023

    ఖమ్మంలో బీజేపీ నేతల అరెస్ట్

    May 5, 2023

    పొంగులేటి ఇంట్లో పొలిటికల్ స్కెచ్ ఏంటి?

    May 4, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.