మేడారం జాతర పూజారి సిద్ధబోయిన సాంబశివరావు (38) బుధవారం మృతి చెందారు. రెండు వారాల క్రితం ఆయన పక్షవాతానికి గురయ్యారు. చికిత్స తీసుకుంటూ ఇంటి వద్దే ఉంటున్న సాంబశివరావు ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతన్ని ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్య వర్గాలు చెప్పాయి. పక్షవాతానికి గురైన సాంబయ్యకు గుండెపోటు కూడా రావడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
సిద్ధబోయిన సాంబశివరావుకు భార్య, ఇద్దరు పసివాళ్లయిన కుమార్తెలు ఉన్నారు. సమ్మక్క, సారక్క జాతరలో సాంబశివరావు ‘కొమ్ము’ పూజారిగా వ్యవహరించేవారు. అమ్మవార్లను గద్దెలపైకి తీసుకువచ్చే సందర్భంగా ఆయన కొమ్ము ఊదే ప్రక్రియను నిర్వహించేవారు. సాంబశివరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేడారం పూజారులు ప్రభుత్వాన్ని కోరారు. కాగా సాంబశివరావు మృతి పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.