నెగ్గుతుందా? వీగిపోతుందా? అన్నది ప్రశ్న కాదు. ఓ దేశ అధ్యక్షున్ని అభిశంసించడమే అసలు వార్త. దేశాధినేత అంటే చిన్నా, చితకా దేశం కూడా కాదు. ప్రపంచానికే పెద్దన్నగా అభివర్ణించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరి. ఆయనపై వచ్చిన ఆరోపణల సారాంశపు పరిణామాలు ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరం.

వాస్తవానికి అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లదే ఆధిపత్యం. ఈ సభలో అమెరికా అధ్యక్షునిపై అభిశంసన ఆమోద తీర్మానం కేవలం ఫార్మాలిటీ. కానీ సెనేట్ లో రిపబ్లికన్లకే ఆధిక్యం ఉంది. ఇక్కడ అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించే అవకాశాలు మృగ్యం. అయినప్పటికీ డెమోక్రాట్లు పట్టు విడవడం లేదు. తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ప్రధాన టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. అభిశంసనకు సంబంధించి నేటి నుంచి శుక్రవారం వరకు ప్రజా సమక్షంలో విచారణ నిర్వహించనున్నారు. ట్రంప్ నకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించే పనిలో డెమోక్రాట్లు ఫుల్ బిజీగా ఉన్నారట. ఇంతకీ ట్రంప్ చేసిన ఘన కార్యం…అంటే ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏమిటనేగా సందేహం? డెమోక్రటిక్ నేత జో బిడెన్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఆయన కుమారుడు హంటర్ బిడెన్ ఉక్రెయిన్ గ్యాస్ కంపెనీలో ఓ కీలక పదవిలో నియిమితులయ్యారట. ప్రస్తుతం డెమోక్రటిక్ నేత జో బిడెన్ దేశాధ్యక్ష పదవి రేస్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హంటర్ నియామకంపై దర్యాప్తు జరిపించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమర్ జెలెన్స్కీపై ట్రంప్ ప్రెజర్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో దర్యాప్తు జరిపించకపోతే ఉక్రెయిన్ కు 40 కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని నిలిపివేస్తామని కూడా బెదిరించి ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణల సారాంశం. అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశద్రోహం, ముడుపుల స్వీకరణ తదితర తీవ్ర నేరాలలకు పాల్పడితే దేశాధ్యక్షున్ని ప్రతినిధుల సభ అభిశంసించవచ్చు. అయితే ఇందులో దేన్ని తీవ్ర నేరాలుగా పరిగణించాలనే అంశంపై స్పష్టత లేదని అంతర్జాతీయ వార్తా సంస్థలు ఉటంకిస్తుండగా, ట్రంప్ పై వచ్చిన అధికార దుర్వినియోగం తీవ్ర నేరం కిందకే వస్తుందని డెమోక్రాట్లు వాదిస్తున్నారట. ఇందులో భాగంగానే దాదాపు నెలరోజులపాటు శ్రమించి కొందరు అధికారుల నుంచి డెమోక్రాట్లు రహస్యంగా సాక్ష్యాలు కూడా సేకరించారట. బుధవారం నుంచి శుక్రవారం వరకు ప్రజల సమక్షంలో ట్రంప్ పై అభిశంసనకు సంబంధించి బహిరంగ విచారణ నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ పై అభిశంసన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేకాదు..ఈ బహిరంగ విచారణ ప్రక్రియను టీవీల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

మన దేశంలో కొందరు రాజకీయ నేతల పైరవీలు, రూ. వేల, లక్షల కోట్ల ముడుపుల స్వీకరణ బాగోతం, కుంభకోణాలు తదతర అంశాలపై ఆరోపణలు వస్తే సీన్ ఎలా ఉంటుందో తెలుసు కదా? అభిశంసన, ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ సంగతి దేవుడెరుగు…ఆరోపణలు చేసిన నాయకుడి బొక్కలు ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ దొరుకుతాడు? గతంలో పదవిలో ఉన్నపుడు ఏమేం చేశాడు? అతని బలం ఏమిటి? బలహీనతలు ఏమిటి? వంటి తవ్వకాలు షురూ అవుతాయి.  అంతేకాదు…మేమే తిన్నామా? వాళ్లు మాత్రం తినలేదా? వాళ్లు తింటే ఒప్పు? మేం తింటే తప్పా? వంటి ప్రశ్నలతో ఎదురుదాడి కూడా చేస్తారు. అందుకే అనేక అంశాల్లో అగ్ర రాజ్యాలను, వాటి అధిపతులను మనం నోట్లో వేసుకోవడం కాదు…అక్కడి విచారణలు, తీరు తెన్నుల గురించి కూడా మన దేశంలో తినడానికి బాగా అలవాటుపడ్డ నాయకులు కాస్త తెలుసుకుంటే మంచిది కదూ!

Comments are closed.

Exit mobile version