పీఆర్సీ విషయంలో తెలంగాణా ప్రభుత్వం తొలిసారి చరిత్రాత్మకంగా వ్యవహరించబోతున్నదా? చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇంటీరియమ్ రిలీఫ్ (ఐఆర్) ప్రకటించకుండానే పీఆర్సీని అమలు చేయనుందా? పీఆర్సీ విషయంలో తాజా పరిణామాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాన్ని ఇస్తున్నాయి. అయితే ఈ అంశంపై ఉద్యోగవర్గాలు ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆ వర్గాల కథనం ప్రకారం… వాస్తవానికి పీఆర్సీ నివేదికకు ముందు ఊరట పద్ధతిలో ప్రకటించేదే ఐఆర్. మధ్యంతర భ్రుతిగానూ వ్యవహరించే ఐఆర్ ప్రస్తావన లేకుండానే ఈసారి పీఆర్సీ అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడమే అసలు విశేషం.
పీఆర్సీ అమలుకు కనీసం ఆరు నెలల ముందు ఐఆర్ ను ప్రభుత్వాలు ప్రకటిస్తుంటాయి. అనంతరం పీఆర్సీని ప్రకటించి ఫిల్మెంట్ ను అమలు చేస్తాయి. పీఆర్సీ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన పద్ధతి కూడా ఇదే. కానీ 2019 ఫిబ్రవరికల్లా పీఆర్సీని అమలు చేస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించగానే ఉద్యోగ సంఘాలు నేతలతోపాటు ఉద్యోగులు కూడా సంతోషంతో చప్పట్లు కొట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పీఆర్సీ కసరత్తు సాగుతూనే ఉంది. పొరుగున గల ఏపీ ప్రభుత్వం కూడా ఆర్టీసీ సమ్మె సందర్భంలో 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వగా, తెలంగాణా ప్రభుత్వం 41 శాతం ఫిట్మెంట్ ను ప్రకటించింది. అయితే ‘అనామలీస్’ కమిటీ పరిశీలనలో 1 శాతంలో పెద్దగా వ్యత్యాసం లేకపోవడం విశేషం.
ఈ నేపథ్యంలో ఐర్ ప్రాధాన్యతను కూడా ఉద్యోగవర్గాలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. పీఆర్సీ కమిటీ ఇచ్చిన సిఫారసు నివేదికలో 15 శాతం ఫిట్మెంట్ ఉందనే వార్తలు కూడా ఉద్యోగవర్గాలను ఆలోచనలో పడేశాయి. గత పీఆర్సీలో 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఐఆర్ ప్రకటించినప్పటి నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆలస్యంగా ఇచ్చినప్పటికీ ‘డైరెక్ట్’ పీఆర్సీ కూడా ప్రయోజనకరంగానే భావిస్తున్నాయి. అయితే ఐఆర్ విషయంలో ఉద్యోగ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు ఉండడం గమనార్హం. ఐఆర్ లేకుండా పీఆర్సీ ఏమిటనే ప్రశ్నలను కొందరు ఉద్యోగులు లేవనెత్తుతుండగా, ఐఆర్ అనేది రూల్ మాత్రం కానే కాదని మరికొందరు పేర్కొంటున్నారు.
అదేవిధంగా పీఆర్సీ నివేదికను సీల్డ్ కవర్ లో సమర్పించడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులకు ప్రకటించే పీఆర్సీ విషయలో ‘సీల్డ్’ కవర్ నివేదిక ఏమిటని కొందరు ప్రశ్నిస్తుండగా, ప్రతి నివేదిక సీల్డ్ కవర్ ద్వారానే సమర్పిస్తారని మరికొందరు వాదిస్తున్నారు. ఇదే సందర్భంలో పీఆర్సీ నివేదికలో 15, 27, 25, 30 శాతం అంటూ కమిటీ సిఫారసు చేసినట్లు వార్తలు వచ్చాయి. సీల్డ్ కవర్ లో దాగి ఉన్నట్లు భావిస్తున్న సిఫారసులకు సంబంధించి ఫిట్మెంట్ శాతంపై ‘లీకులు’ ఇస్తున్నదెవరనే సందేహాలను ఉద్యోగ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. బహుషా ఫిట్మెంట్ శాతంపై ‘రియాక్షన్స్’ కోసం ప్రభుత్వ వర్గాలే లీకులు ఇచ్చి ఉంటాయా? అనే సంశయాలు కూడా ఉద్యోగ వర్గాల్లో ఉన్నాయి. మొత్తంగా ఐఆర్ ప్రకటన లేని పీఆర్సీ అమలుపై ఉద్యోగ వర్గాల్లోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కాగా పీఆర్సీ నివేదిక సీల్డ్ కవర్ ను ఇంకా ఓపెన్ చేయలేదని, సీఎం కేసీఆర్ సమక్షంలోనే దాన్ని తెరుస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తాాజాాగా ప్రకటించడం కొసమెరుపు.