ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణా ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా నిన్న శుభవార్తను అందించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలో దిగువన గల పేరాను ఓసారి జాగ్రత్తగా చదవండి. ఆ తర్వాత అసలు విషయంలోకి వెడదాం.
ఉద్యోగుల వేతనాలు, రైటైర్మెంట్ వయస్సు పెంపు తదితర అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని ముఖ్యమంత్రి నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుండి అందిన నివేదికను అధ్యయనం చేస్తుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతుంది. వేతన సవరణ ఎంత చేయాలి? ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలి? సర్వీసు నిబంధనలు ఎలా రూపొందించాలి? పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గమేమిటి? జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం క్యాబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఇప్పుడు అసలు విషయంలోకి వెడితే… విషయంపై ఎక్కువ ఉపోద్ఘాతం కూడా అక్కరలేదు. ఉద్యోగ వర్గాల కథనం ప్రకారం… ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి 2018 సంవత్సరం మధ్యలో ప్రభుత్వం పీఆర్సీ కమిటీని నియమించింది. ఆరు నెలల్లో, 2018 డిసెంబర్ 31వ తేదీకల్లా ఈ కమిటీ తన సిఫారసు నివేదికను సమర్పించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఆ తర్వాత కమిటీ నివేదిక సమర్పణకు గడువు పెంచుకుంటూపోయింది. ఫలితంగా 2018, 2019 సంవత్సరాలు గడిచిపోయాయి. మరో రోజుతో 2020 సంవత్సరం కూడా ముగుస్తోంది. ఈ డిసెంబర్ 31వ తేదీలోపు పీఆర్సీ కమిటీ తన నివేదికను సమర్పించాలి. కానీ ఏం జరిగింది? చూస్తుండగానే రెండున్నరేళ్ల కాలం గడిచిపోయింది. ప్రభుత్వం నిన్న ప్రకటించిన ‘నూతన సంవత్సర కానుక’లో చెప్పిందేమిటి? పీఆర్సీ కమిటీ తన నివేదికను జనవరి మొదటి వారంలో నివేదిస్తుందట. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య అధికారుల కమిటీ దాన్ని అధ్యయనం చేస్తుందట. రెండో వారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తారట. అనంతరం కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుందట. ఆ తర్వాత మంత్రివర్గం సమావేశమై నిర్ణయం తీసుకుంటుందట. మొత్తంగా ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారనేది నిన్నటి ‘నూతన సంవత్సర కానుక’ అంశంలోని విషయ సారాంశం.
ఇదిగో ఈ కమిటీ ‘మెలిక’పైనే ఉద్యోగ వర్గాలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వ అధికారులతో నియమించినట్లు పేర్కొంటున్న ఆయా కమిటీపై ఉద్యోగ వర్గాలు ఏమంటున్నాయంటే…? పీఆర్సీ కమిటీ ఇచ్చే సిఫారసు నివేదికను అధ్యయనం చేయడానికి మరో కమిటీని నియమించడమేమిటనేది వారి అసలు డౌటు. పీఆర్సీని అమలు చేయాల్సిన ప్రభుత్వ కార్యదర్శిని త్రిసభ్య అధికారుల కమిటీకి అధ్యక్షునిగా నియమించడమేంటి? అనేది మరో కీలక సందేహంగా పేర్కొంటున్నాయి. ఇంతకీ పీఆర్సీ కమిటీ చేసే సిఫారసు ఏమిటి? ఫిట్మెంట్ ఏమేరకు ఇవ్వాలనే అంశంపై శాతాల వారీగా సూచనలు చేస్తుంది. నూటికి నూరుశాతం లెక్కలతో ఈ నివేదిక ఉంటుంది. కమిటీ సిఫారసు చేసిన ఫిట్మెంట్ శాతాల్లో ఏదో ఒకదానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సుపైనా సూచనలు చేస్తుంది. ఏన్నేళ్లు పెంచాలనే అంశంపైనా ప్రతిపాదనలు చేస్తుంది. ఎన్నేళ్లు పెంచితే ఏమేరకు ‘ఎఫెక్ట్’ ఉంటుందనే అంశాలను కూడా ఈ కమిటీ స్పష్టంగా వివరిస్తుంది. దీని ప్రకారం ప్రభుత్వం అటు పీఆర్సీ అమలు, ఇటు ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సుపైనా నిర్ణయం తీసుకుని అమలు చేయాలి. ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ చేసి, అభ్యంతరాలను స్వీకరించాలి. తద్వారా పీఆర్సీ కమిటీ సిఫారసులపై వ్యత్యాసాలు ఏవేని ఉన్నట్లు అభ్యంతరాలు వ్యక్తమైతే సవరించడానికి ‘పే అనామలీస్’ కమిటీని నియమించాలి. ఈ ప్రక్రియ ప్రకారం జరగాల్సిన పీఆర్సీ కమిటీ నివేదిక అమలుపై మరో త్రిసభ్య అధికారులతో మరో కమిటీ వేయడమేమిటనేది ఉద్యోగ వర్గాల సందేహం. ఉద్యోగ వర్గాల చరిత్రలోనే ఈ తరహా అధికారిక కమిటీ ఇప్పటి వరకు లేదని కూడా అంటున్నారు. పీఆర్సీ అమలులో సాధారణంగా జరిగే ఈ ప్రక్రియ గురించి అటు అధికారగణానికి, ఇటు పాలక నేతలకు తెలియని విషయమేమీ కాదని కూడా ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన వేతనాల, ఉద్యోగ విమరణ వయస్సు పెంపు ‘కానుక’పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయ్. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు, వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థలకు, మరికొన్ని ఇతర మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, నిన్న హైదరాబాద్ లో జరిగిన టీచర్ల భారీ ధర్నా తదితర అంశాలు ప్రామాణికంగా సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్. కాగా మరోవైపు కొందరు ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వ నిర్ణయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పుష్పగుచ్చాలు అందిస్తుండడం విశేషం.