అనాధ పిల్లల కోసం కట్టకుండా కట్టిన హాస్టల్ డబుక్కున కూలిపోయిందని, 200 మంది పిల్లలు చనిపోయారని, పక్కనున్న మరో మూడు బిల్డింగులూ పడిపోయాయని సదరు వెంకటరత్నం మీద మనం కేసు పెడతాం.
కట్టని బిల్డింగ్ కూలిపోయిందని అడగడమేంటి?
కట్టలేదు కాబట్టే కూలిపోయింది అంటున్నాం.
కట్టని బిల్డింగ్ ఏ సెక్షన్ ప్రకారం కూలిపోయిందని అడుగుతున్నాం?
వెంకటరత్నం కూడా ఇలాగే అడుగుతాడు. మనకు దొరుకుతాడు. బిల్డింగ్ కూలిపోలేదంటే కట్టలేదని ఒప్పుకోవాలి గదా?
ఇప్పుడు కట్టానని చెప్పకుంటున్నాడుగా?
అప్పుడు కూలిపోయిందని ఒప్పుకోవాలి?
ఒప్పుకుంటే…?
కూలిపోయిందానికి నష్టపరిహారం కట్టాలి.
కూలిపోలేదంటే…?
హాస్టల్ కట్టలేదని ఒప్పుకోవాలి.
కట్టామంటే…?
కూలిపోయిందని ఒప్పుకోవాలి.
ఏమిటీ సంభాషణ… అనుకుంటున్నారా? విక్టరీ వెంకటేష్ నటించిన ‘శత్రువు’ సినిమాలోని ఆసక్తికర సన్నివేశమిది. సినిమాలోని ఓ ఘటనపై లాయర్ల పాత్రలో గల నటుల నుంచి పలికించిన ఆయా సంభాషణలు ప్రేక్షకుల చేత కూడా చప్పట్లు కొట్టిస్తాయి. ఇప్పుడీ సినిమా ‘సీన్’ ఎందుకు గుర్తుకువస్తోందంటే… తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, ఫిట్మెంట్ వ్యవహారంలో టీ ఎన్జీవో, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతల ప్రకటన ఇదే సన్నివేశాన్ని తలపిస్తున్నదనే అభిప్రాయాలు ఉద్యోగవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
‘ఎన్నికల నిబంధన అమలులో ఉన్నందున నేనివాళ అమలు చేయలేకపోయిన. తప్పకుండా ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మరి ఉద్యోగులవిగానీ, ఉపాధ్యాయులవిగానీ రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 10 లక్షల మందికి సంబంధించిన అన్ని సమస్యలూ పరిష్కరిస్తాను’ అని అన్నారు. ఆంధ్రాలో ఇచ్చిన దానికంటే ఎక్కువ శాతాన్ని తప్పకుండా తెలంగాణ ఉద్యోగులకు ఈ (ఎన్నికల) కోడ్ అమలు అయిపోగానే ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిగారు మాకు ఈరోజు మాట ఇవ్వడం జరిగింది.’’ అని ఈనెల 9వ తేదీన కేసీఆర్ తమకు హామీ ఇచ్చారని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపైనే ఇప్పుడు వివిధ సంఘాల నేతలు చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ గ్రాడ్యుయేట్లను, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను, టీచర్లను ప్రభావితం చేసేలా ఉందని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. తమకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందిస్తూ, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నిస్తూ ఉద్యోగ సంఘాలకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 9న సీఎంతో భేటీ అనంతరం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 29 శాతం ఫిట్మెంట్, రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంపు, ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటించారు. ఈ ప్రకటనపై వివిధ పత్రికల్లో వచ్చిన క్లిపింగ్‌లు, చానళ్లలో ప్రసారమైన వీడియోలతో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశంతో నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్నవారిలో టీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు కె. రవీందర్‌రెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీజీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మమత, సత్యనారాయణ, పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు పి. శ్రీపాల్‌రెడ్డి, బి.కమలాకర్‌రావులు ఉన్నారు. అయితే ఈ నోటీసులు అందుకున్నవారందరూ జవాబు ఇచ్చారని, కానీ అందులో పేర్కొన్న అంశాలు ఏమిటనేది తెలియడంలేదని వార్తలు వచ్చాయి. అయితే ఇదే సందర్భంలో తాము అసలు సీఎం కేసీఆర్ ను కలవనే లేదని, ఉద్యోగులను, టీచర్లను మభ్యపెట్టే ఛాన్సే లేదని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారట. అంతేగాక ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేస్తూనే ఉంటామని మరి కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారట. కొందరేమో సీఎంను తాము కలిశామని చెబుతున్నారట.
ఇంతకీ ఈనెల 9వ తేదీన వివిధ సంఘాల నేతలు సీఎం కేసీఆర్ ను కలిసినట్టా? కలవనట్టా? కలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికలకు సరిగ్గా అయిదు రోజుల తాము ప్రకటన చేసింది వాస్తవమేనని ఆయా సంఘాల నేతలు అంగీకరించాలి. ఇదే జరిగితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ, పీఆర్సీపై ప్రకటన ద్వారా గ్రాడ్యుయేట్, ఉద్యోగ, ఉపాధ్యాయ ఓటర్లను ప్రలోభపెట్టినట్లు పరోక్షంగా అంగీకరించినట్లే. తాము అసలు సీఎంనే కలవలేదని లిఖితపూర్వకంగా ఎన్నికల సంఘానికి జవాబు చెబితే, పీఆర్సీ, ఫిట్మెంట్ వ్యవహారంపై వివిధ సంఘాల నేతలు వెల్లడించిన అంశం తప్పుడు ప్రకటనగా అంగీకరించినట్లే… అని ఉద్యోగ వర్గాలు వాదిస్తున్నాయి. ‘శత్రువు’ సినిమాలోని ‘లా’ పాయింట్ సన్నివేశానికి, ఎన్నికల సంఘం నుంచి నోటీసుల అందుకున్న ఉద్యోగ సంఘాల నేతల తాజా పరిస్థితికి సారూప్యత కుదిరినట్లే కదా! అదీ అసలు సంగతి.
ఫొటో: సీఎం కేసీఆర్ తో ఉద్యోగ సంఘాల నేతలు (ఫైల్)