ఉద్యమం ద్వారా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఇదో కొత్త పోకడ. ఇక అడుగు తీసి అడుగు ముందుకు
కదిపితే ఉద్యమకారులపై, పోరాట యోధులపై,
రాజకీయ నేతలపై ఐపీసీ
353 సెక్షన్ కింద కేసు నమోదు
కావచ్చు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన
అభియోగానికి వర్తించే సెక్షన్ ఇది. నేరం రుజువైతే కఠిన శిక్ష పడే సెక్షన్ ఇది. ఆర్టీసీ
కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి
ప్రగతి భవన్ ముట్టడి యత్నం సందర్భంగా పోలీసులు నమోదు చేసిన కేసులోని ఓ
సెక్షన్ 353. ప్రగతి భవన్ ముట్టడి
సందర్భంగా తెలంగాణలోని దాదాపు ముఖ్య కాంగ్రెస్ నేతలను ప్రభుత్వం హౌస్ అరెస్ట్
చేసింది. అయితే మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈ
సందర్భంగా పోలీసులకు చుక్కలు చూపించారనే వార్తలు వచ్చాయి.
సీఎం కేసీఆర్
నివాసమైన ప్రగతి భవన్ ముట్టడి పిలుపు పోలీసులను కూడా టెన్షన్ కు గురి చేసింది. ఇదే సమయంలో ఎంపీ
రేవంత్ రెడ్డి పోలీసుల కళ్ళు గప్పి జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచి ప్రగతి భవన్ ముట్టడికి బయలు
దేరారు. బైక్ పై ప్రయాణిస్తున్న రేవంత్ రెడ్డిని నిలువరించడానికి పోలీసులు పడిన
యాతన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఎట్టకేలకు రేవంత్
రెడ్డిని పోలీసులు ప్రగతి
భవన్ వద్ద అదుపులోకి
తీసుకున్నారు.
అయితే ఈ సందర్భంగా
పోలీసులు రేవంత్ రెడ్డిపై నమోదు చేసిన కేసులోని సెక్షన్లు రాజకీయంగా
చర్చకు దారి తీశాయి. ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు
మేరకు ఐపీసీ 341, 332, 353 సెక్షన్ల కింద
రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 353
సెక్షన్ తీవ్రమైనదిగా
న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. ఉద్యమాల్లో,
పోరాటాల్లో పాల్గొనే
వారిని భయపెట్టడానికి పాలకులు ఈ సెక్షన్ ను వాడుకుంటున్నారని ఆ
వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సాధారణంగా ప్రభుత్వ
విధానాలపై వివిధ రాజకీయ పక్షాలు పోరాటాలు చేసే సమయంలో పలు దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి.
ముఖ్యంగా ధర్నాలు,
రాస్తారోకోలు, ముట్టడి వంటి కార్యక్రమాల్లో పోలీసులు కట్టడి చర్యలు
తీసుకోవడం సహజమే. పాలకుల విధానాలు,
ఆదేశాలకు అనుగుణంగా
పోలీసులు ఈ సందర్భంగా వ్యవహరిస్తుంటారు. ఈ ఘటనల్లో పోలీసులు,
పోరాటం చేసే వారి మధ్య
తోపులాట వంటి ఘటనలు జరుగుతుంటాయి. ఒక్కోసారి
ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి.
ఇటువంటి
సందర్భాల్లో పోలీసులు సంబంధిత నాయకులు, కార్యకర్తలపై
ప్రజా జీవనానికి భంగం కలిగించాలనే అభియోగాలపై పెట్టీ లేదా న్యూసెన్స్ కేసులు
నమోదు చేస్తుంటారు.
కానీ ప్రగతి భవన్
ముట్టడి సందర్భంగా రేవంత్ రెడ్డిపై మోపిన సెక్షన్లు ప్రజా పోరాటాలపై, ఉద్యమకారులపై, నాయకులపై ప్రభుత్వం ఇక నుంచి అనుసరించే
విధానాలను స్పష్టం
చేస్తున్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అంటే ఇక 144
వంటి సెక్షన్లు మరుగున
పడి 353 సెక్షన్ కత్తి
నిత్యం వేలాడుతుందన్న మాట.