ప్రగతి భవన్…కేసీఆర్ సారు వారి అధికారిక నివాసం. ఇక్కడ గత సెప్టెంబర్ 14వ తేదీన ఓ కుక్క చనిపోయింది. ప్రగతి భవన్ లోని పెంపుడు శునకాల్లో ఒకటైన 11నెలల హస్కీకి జ్వరం కారణంగా సుస్తీ చేసింది. దాదాపు 101 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న ప్రగతి భవన్ కుక్కకు సంబంధిత డాక్టర్ వైద్యం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి హస్కీ తుది శ్వాస విడిచింది. ఈ ఘటనలో ఆగ్రహించిన ప్రగతి భవన్ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు ప్రగతి భవన్ కుక్కకు వైద్యం చేసిన పశు వైద్యాధికారిపై పోలీసులు ఐపీసీ 429, 11 (4) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.
ప్రగతి భవన్ లోని పెంపుడు కుక్క చచ్చిపోయిన ఫలితంగా ఓ పశువుల డాక్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరి సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతి భవన్ లోకి ముట్టడి పేరుతో రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల కార్యకర్తలు దూసుకువస్తే చర్యలు ఎలా ఉండాలి? అందుకే పాలకులు కన్నెర్ర జేసిన ఫలితంగా ఓ ఏసీపీ అటాచ్ మెంట్ కు గురయ్యారు. బీజేపీ అనుబంధ ఏబీవీపీ కార్యకర్తలు సుమారు 300 మంది ప్రగతి భవన్ లోనికి వెళ్ళడానికి యత్నించిన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వీరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే ఈ సమయంలో విధుల పట్ల అలక్ష్యంగా వ్యవహరించానే ఆరోపణలపై ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రగతి భవన్ వద్ద ప్రభుత్వ అధికారుల విధులు వారికి గర్వకారణమే కాదు…ఇక నిత్య గండం అన్న మాట కూడా!

Comments are closed.

Exit mobile version