తెలంగాణాలో ఐపీఎస్ అధికారుల బదిలీకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇద్దరు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ, పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వు జారీ చేసింది.
ఎం. గోపీకృష్ణకు, జె. పూర్ణచందర్ రావుకు లెవెల్ 16 ఐపీఎస్ అధికారులుగా పదోన్నతి కల్పించారు. తద్వారా గోపీకృష్ణను ప్రింటింగ్, స్టేషనరీ విభాగపు కమిషనర్ గా, పూర్ణచందర్ రావును అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా నియమించారు.
తెలంగాణా వ్యాప్తంగా రానున్న కొద్ది రోజుల్లోనే ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయనుందనే ప్రచారం నేపథ్యంలో ఈ పదోన్నతుల ఉత్తర్వు వెలువడడం విశేషం. భారీ సంఖ్యలో ఈసారి ఐపీఎస్ అధికారుల బదిలీ ఉండవచ్చంటున్నారు.
దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్నవారిని, ఆశించిన విధంగా పనితీరు కనబర్చని ఐపీఎస్ అధికారులకు బదిలీ అనివార్యంగా భావిస్తున్నారు, వరంగల్, ఖమ్మం, సిద్ధిపేట తదితర కేంద్రాల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వు వెలువడుతుందని సమాచారం.