ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ గేమ్ ఛేంజ్ చేయనున్నారు. ఇందులో భాగంగానే ఇకనుంచి ఆయన వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేయనున్నట్ల అనుచరగణం చెబుతోంది. ప్రస్తుతం తానున్న పార్టీ నుంచి ఎదురవుతున్న సవాళ్లను, భవిష్యత్ రాజకీయాల కోసం ఎంచుకున్న వేదికలను ప్రామాణికంగా తీసుకుని పొంగులేటి తన తాజా కదలికల్లో పలు మార్పులు చేసుకున్నట్లు సమాచారం.
గత నెల 1వ తేదీన కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ఖమ్మం జిల్లాలోనేగాక, రాష్ట్ర వ్యాప్తంగానూ తీవ్ర సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఆయన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు వివిధ రాజకీయ పరిణామాలకు కూడా దారి తీశాయి. పొంగులేటి వ్యాఖ్యలు.. అనంతర పరిణామాల్లో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల విమర్శలు వివిధ ఘటనలకు దారి తీశాయి. ముఖ్యంగా పొంగులేటి వెంట నడుస్తున్న పలువురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే స్థాయికి వెళ్లాయి. ఈ పరిణామాలపైనా పొంగులేటి ఏకంగా రాష్ట్ర నాయకత్వానికే సవాల్ విసిరారు. తన వెంట ఉన్నవాళ్లను కాదని, ధైర్యం ఉంటే తనను సస్పెండ్ చేయాలని అశ్వారావుపేట ఆత్మీయ సమ్మేళనంలో సవాల్ చేశారు. ఈ సవాల్ పై మంత్రి పువ్వాడ అజయ్ తోపాటు బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు కూడా వైరాలో స్పందించిన సంగతి తెలిసిందే.
ఈ పరిణామాల్లోనే తాజాగా జిల్లాలో ఆయన ఐదో నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. పినపాక, ఇల్లెందు, మధిర, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సంబంధించిన ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పటికే నిర్వహించడం ద్వారా పొంగులేటి బలప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 15న వైరా నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. అంతేకాదు ఆత్మీయ సమ్మేళనానికి 48 గంటల ముందే పొంగులేటి అభిమానులు వైరా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైరా నియోజకవర్గ అభ్యర్థిగా బానోత్ విజయా భాయిని పొంగులేటి ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా పినపాక, ఇల్లెందు, మధిర, అశ్వారావుపేట నియోజకవర్గాల అభ్యర్థులుగా పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, డాక్టర్ కోట రాంబాబు, జారె ఆదినారాయణలను ప్రకటించారు. ఇల్లెందు నియోజకవర్గంలోని గార్లలో ఏకంగా క్యాంపు ఆఫీసును కూడా ప్రారంభించారు.
ఆత్మీయ సమ్మేళనాలు, అభ్యర్థుల ప్రకటన తదితర అంశాలపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫీడ్ బ్యాక్ సమాచారాన్ని సేకరించారు. అభిమానులు, అనుయాయుల, సామాన్య ప్రజల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను బేరీజు వేసుకున్న పొంగులేటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాల్లో అభ్యర్థులను ప్రకటించరాదని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజాగా బుధవారం జరుగుతున్న వైరా నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం సహా ఇప్పటికే ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో సమావేశాలు, అభ్యర్థుల ప్రకటన ముగిసినట్లే.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో ఐదు నియోజకవర్గాలైన సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాల్సి ఉంది. దశలవారీగా వచ్చే నెలరోజుల వ్యవధిలో వీటిని పూర్తి చేస్తారని తెలిసింది. ఖమ్మం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనాన్ని చివరగా.. అంటే వచ్చే మార్చి నెలలో నిర్వహించి, ఖమ్మం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థిని, తాను చేరబోయే పార్టీ పేరును కూడా పొంగులేటి అదేరోజు ప్రకటించనున్నట్లు తాజా సమాచారం. తద్వారా పొంగులేటి తన పొలిటికల్ గేమ్ ను ఛేంజ్ చేసి నిర్వహించనున్న తదుపరి కార్యక్రమాలు మరింత హాట్ హాట్ గా ఉండవచ్చనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. ఇదీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ రాజకీయాల్లో తాజా సీన్.