దశాబ్ధాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లను విస్మరించి నిన్న మొన్న వచ్చిన వారికి ఓ జాతీయ పార్టీ టికెట్లు ఇస్తుంది. పార్టీకి గల కార్యకర్తల బలం, ప్రజల విశ్వాసంతో తొలిసారే చట్టసభల ప్రజాప్రతినిధులుగా వాళ్లు ఎన్నికవుతున్నారు. విజయోత్సవ సంబురాల రంగులు శరీరంపై పూర్తిగా కనుమరుగు కాకముందే అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. టికెట్లు ఇచ్చిన జాతీయ పార్టీ కండువాలను కొద్ది రోజుల్లోనే విసిరేస్తున్నారు. ప్రజల శ్రేయస్సు, నియోజకవర్గ అభివృద్ధి లక్యంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, అవసరమైతే రాజీనామా చేస్తామని, మళ్లీ పోటీ చేసి గెలుస్తామని ప్రకటిస్తున్నారు. ఇటువంటి తాజా రాజకీయ పరిణామాలపై సహజంగానే ప్రజలు నివ్వెరపోతున్నారు. ఈ మాత్రం దానికి విపక్ష పార్టీలకు ఓట్లు వేయడం దేనికి? అధికార పార్టీ నేతలతో ‘కంటు’ కావడం దేనికి? ఆ ఓట్లు వారికే వేస్తే సరిపోయేది కదా? అని ఆయా పరిణామాల అనంతరం పలువురు వ్యాఖ్యానించిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
అన్యాయం, పరావభవం, చేదు అనుభవం… పదాలు ఏవైనా ఎదురైన పరిణామాల సారాంశం మాత్రం దాదాపు ఒక్కటే. ఆ నాయకుడిని ఆ పార్టీ అధినేత విశ్వసించడం లేదా? ఎంతగా విధేయతను ప్రదర్శిస్తున్నా పరిగణనలోకి తీసుకోవడం లేదా? అయినప్పటికీ ఆ నాయకుడు ‘వినయ, విధేయత’లను ఇంకా ఎందుకు ప్రదర్శిస్తున్నట్లు? ఇవీ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరగణంలో తాజాగా వ్యక్తమవుతున్న సందేహాలు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ పార్టీ ఏడాది క్రితం నిర్ధాక్షిణ్యంగా టికెట్ నిరాకరించింది. సంవత్సరం పొడవునా వేచి చూసినా రాజ్యసభ టికెట్ విషయంలోనూ చుక్కెదురైంది.
అయినప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నారో తెలుసా? తనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించనంత మాత్రాన తన అభిమానులు, కార్యకర్తలు నిరాశకు గురికావద్దని, నిరుత్సాహపడవద్దని అంటున్నారు. తాను పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ఆయన మరోసారి ప్రకటించారు. తనను అభిమానించేవారు మనోధైర్యాన్ని కోల్పోవద్దని, సంయమనం పాటించాలని పొంగులేటి పత్రికా ప్రకటన జారీ చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో టికెట్ నిరాకరించిన సందర్భంగానూ పొంగులేటి ఇదే సారాంశంతో పత్రికా ప్రకటన జారీ చేయడం గమనార్హం.
ప్రభుత్వ పరంగా అనేక కాంట్రాక్టు పనుల్లో శ్రీనివాసరెడ్డి ఇరుక్కుపోయారని, వందలాది కోట్ల రూపాయల వ్యవహారం వల్లే ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా ఆయన మిన్నకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. పొంగులేటి బడా కాంట్రాక్టరే కావచ్చు. కానీ నియమ, నిబంధనల ప్రకారం తన కాంట్రాక్టు పనులకు వచ్చే ఇబ్బందేమీ లేదన్నది కూడా ఆయన అనుచరగణంలోని ముఖ్యులు కొందరు అప్పట్లో చేసిన వాదన. కానీ తాజా సమాచారం ప్రకారం పొంగులేటి తెలంగాణా ప్రభుత్వంతో కాంట్రాక్టు పనుల వ్యవహారాలకు ముగింపు పలికినట్లు ఓ కథనం ప్రచారంలో ఉంది. తన కంపెనీకి సంబంధించిన ‘మిషనరీ’ని ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు తెలుస్తోంది. సరే కాంట్రాక్టర్ అన్నాక ఎక్కడ పనులు లభిస్తే అక్కడ నిర్వహిస్తుంటారన్నది వేరే విషయం.
కానీ పొంగులేటిని పొలిటికల్ గా ఇక ఏమాత్రం ముందుకు వెళ్లనీయకుండా ‘కాంట్రాక్టర్’ వరకే పరిమితం చేయాలని ఆయన రాజకీయ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే ఏడాది కాలంగా ఆయన ప్రయత్నాలకు బలమైన ఓ సామాజిక వర్గం అడుగడుగునా అడ్డు తగులుతోందా? ఇది ఇలాగే కొనసాగితే ప్రజాభిమానం గల తమ నాయకుడు ఇక ‘కాంట్రాక్టర్’గా మాత్రమే మిగులుతారా? ఇవీ పొంగులేటి అభిమానుల సందేహాలు. మొన్న ఎంపీ టికెట్, నేడు రాజ్యసభ టికెట్ కేటాయింపు అంశాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, చవి చూసిన చేదు అనుభవాల నేపథ్యంలోనూ ‘పొంగులేటి’ ఇప్పటికీ పార్టీ విధేయతనే ప్రకటించడం వెనుక అసలు వ్యూహం ఏమిటో బోధపడక ఆయన అనుచరగణం తలలు నిమురుకుంటోంది. ఎందుకంటే ‘పొంగులేటి’ ముందు చూపు లేని నాయకుడు కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. అయిననూ ‘పొంగులేటి’ ప్రస్తుతానికి గులాబీ పార్టీ విధేయుడే. శీనన్నగా పిలుచుకునే ఆయన అభిమానులూ ఆయనకు వీర విధేయులే.