వైఎస్ షర్మిల తెలంగాణాలో స్థాపించనున్న రాజకీయ పార్టీపై మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. షర్మిల పెట్టబోయే పార్టీపై పొంగులేటి రాజకీయ కదలికలపై భిన్నాభిప్రాయాలు, భిన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్పందించాల్సిందిగా ts29 వెబ్ సైట్ ఆయనను కోరింది. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, షర్మిల పార్టీ ఏర్పాటు వెనుక తనకెటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ సీపీ తెలంగాణా అధ్యక్షునిగా ఉన్న సమయంలో, 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ, ఇదే జిల్లాలోని మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలిచిన నేపథ్యంలో తన గురించి ఆసక్తిగా చర్చించుకోవడం సహజమేనన్నారు. అయితే ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరిన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. షర్మిల పార్టీ ఏర్పాటు చేసే అంశంపై కొద్ది నెలల క్రితం తనను సంప్రదించిన మాట వాస్తవమేనన్నారు. మద్ధతు ఇవ్వాలని షర్మిల తనను కోరిన మాట కూడా నిజమేనని చెప్పారు. అయితే తాను ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నానని, పార్టీ నాయకత్వంపై, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ లు తనకు న్యాయం చేస్తారనే పూర్తి విశ్వాసం తనకు ఉందని, ఏ విధంగానూ తన మద్ధతును ఆశించవద్దని షర్మిలకు స్పష్టం చేశానన్నారు. అదేవిధంగా షర్మిల పార్టీ ఏర్పాటు, తనను సంప్రదించిన అంశాలను ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు నివేదించానని కూడా పొంగులేటి పేర్కొన్నారు. షర్మిల పార్టీని ముడిపెడుతూ తన ఎదుగుదలను జీర్ణించుకోలేని శక్తులు తనపై సాగించే వ్యతిరేక ప్రచారాలు చెల్లవని కూడా శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Comments are closed.

Exit mobile version