ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు అధికారులపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అధికారుల వైఖరిగా ప్రస్తావిస్తూ ఆయన తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. ఈమేరకు శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. లక్షలాది మంది గుండె చప్పుడైన కాంగ్రెస్ పార్టీలో తన అభిమానుల కోరిక మేరకు చేరుతుంటే అది జీర్ణించుకోలేని రాక్షస బీఆర్ఎస్ ప్రభుత్వం రకరకాల కుయుక్తులు పన్నుతూ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. అధికారులు కూడా బీఆర్ఎస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ, వారి అండదండలతో తమకున్న అధికారంతో రకరకాలుగా తనను, తన అనుచరులను ఇబ్బందులు పెట్టే కుట్రలు చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ సభ కోసం జనాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు కావాలని కోరితే ప్రజాప్రతినిధులకు దాసోహమై బస్సుల కేటాయింపునకు అధికారులు అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీపై తనపై ఉన్న అభిమానంతో తరలిరావాలని కోరారు. స్వచ్ఛందంగా జీపులు, డీసీఎంలు ఇతరత్రా రవాణా సౌకర్యాల ద్వారా రావడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే పిరికిపందల్లా చెక్ పోస్టుల దగ్గర వాహనాలను ఆపేందుకు ఆదేశాలు ఇచ్చారన్నారు.

తన అనుచరుడు మువ్వా విజయబాబును చంపుతామని బెదరిస్తు పోస్టర్లు రిలీజ్ చేయడం కాదని, దమ్ముంటే నేరుగా వచ్చి తనను, తన అనుచరులను ఢీకొనాలని సవాల్ విసిరారు. తనను అణగదొక్కడం చేతకాక తన అనుచరులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘ఒకటి చెబుతున్నా రాసిపెట్టుకోండి వెంట్రుకలు కూడా పీకలేరు. ప్లెక్సీలు చింపించడం, సభకు వెళ్తారనే దురుద్ధేశంతో మంచినీటి సరఫరా నిలిపి వేసి వారిని రోజంతా తీవ్ర ఇబ్బందులు గురి చేశారు’ అని అన్నారు.

కాగా ‘ఐఏఎస్ స్థాయిలో ఉన్న మున్సిపల్ అధికారి పార్టీ తొత్తులాగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? మరో పక్క పోస్టర్ రిలీజ్ చేసి తన అనుచరుణ్ణి చంపుతామని బెదిరించినట్లు సాక్ష్యంతో సహా చూపిస్తే ఐపీఎస్ స్థాయిలో ఉన్న జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఎటువంటి సమగ్ర విచారణ చేపట్టకుండానే అటువంటిదేమి లేదని అధికార పార్టీ వారు రాసిచ్చిన స్క్రిప్టును మీడియా ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఫిర్యాదు తీసుకొనేందుకు వెనుకాడుతూ, ఎలాంటి ఫిర్యాదు చేయలేదనడం సరికాదన్నారు. కావాలని అధికారులు ఫిర్యాదును తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఇటువంటి ప్రకటన చేయడం హాస్యస్పాదమన్నారు. ఇకనైనా ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి వాల్ పోస్టర్ తయారు చేసి అతికించే ప్రయత్నం చేసిన వారిని గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments are closed.

Exit mobile version